‘ప్రయోజనాల ఘర్షణ’ కొట్టివేత
న్యూఢిల్లీ: జడ్జీల నియామకంపై కొలీజియం స్థానంలో తేవడానికి ఉద్దేశించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు ఏర్పాటైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి.. ఈ కేసు విచారణ ప్రారంభించటంలో ఎదురవుతున్న ప్రయోజనాల సంఘర్షణ, పక్షపాతం సిద్ధాంతం అవరోధాలకు అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఈ కేసు విచారణ నుంచి ధర్మాసనానికి వహిస్తున్న జస్టిస్ జె.ఎస్.ఖేహర్ తప్పుకోబోరని జస్టిస్ జె.చలమేశ్వర్ బెంచ్ తరఫున బుధవారం స్పష్టంచేశారు.
జస్టిస్ ఖేహర్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ మంగళవారం విచారణ ప్రారంభించగానే.. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు.. జస్టిస్ ఖేహర్ జడ్జీల కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందున ఈ కేసు విచారణలో ప్రయోజనాల సంఘర్షణ, పక్షపాతానికి అవకాశముంటుందని అభ్యంతరాలు లేవనెత్తారు. వారి అభ్యంతరాలను ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ఎన్‌జేఏసీ చట్టం చెల్లుబాటు కేసుపై ఈ నెల 27 నుంచి విచారణ ప్రారంభిస్తామంది. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.