జడ్జీల నియామకం ప్రభుత్వ విధి | The appointment of the judgeis government's duty | Sakshi
Sakshi News home page

జడ్జీల నియామకం ప్రభుత్వ విధి

Published Fri, Dec 9 2016 2:35 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

The appointment of the judgeis  government's duty

పార్లమెంటరీ కమిటీ స్పష్టీకరణ
రాజ్యాంగ వక్రీకరణలను మార్చాలని ప్రభుత్వానికి సిఫారసు

 
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కార్యనిర్వాహక విధిలోకి వస్తుందని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. రాజ్యాంగ ఆదేశాలను సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా వక్రీకరించిందని.. ఫలితం గానే కొలీజియం వ్యవస్థ తెరపైకి వచ్చిందని పేర్కొంది. ఈ ‘వక్రీకరణల’ను రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. జడ్జీల నియామకాలపై ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యం లో పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది.

న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే కొలీజి యాన్ని రద్దు చేయాలంటూ తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కిందటేడాది రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణ చెల్లుబాటుకు సంబంధించిన కేసులను ఐదుగురు కాకుండా 11 మంది సుప్రీం జడ్జీలు విచారించాలని కమిటీ సూచించింది. రాజ్యాంగానికి భాష్యం చెప్పే కేసులను ఏడుగురు సుప్రీం న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనమే విచారించాలని కమిటీ సిఫారసు చేసింది.

సీజేలకు కనీస పదవీకాలం ఉండాలి
సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తు (సీజే)లకు ‘కనీస పదవీకాలం’ఉండేలా చూడాలని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల పదవీకాలం అత్యంత తక్కువగా ఉంటోందని ఆక్షేపించింది. గత 20 ఏళ్లలో 17 మంది సీజేఐలు నియమితులైతే.. వారిలో కేవలం ముగ్గురికి మాత్రమే రెండేళ్ల పదవీకాలం ఉందంది. చాలామంది పదవీకాలం ఏడాది కంటే తక్కువగానే ఉంటోందని తెలిపింది. చాలామంది హైకోర్టు సీజేల పదవీకాలం కూడా రెండేళ్ల కంటే తక్కువగానే ఉంటోందని పేర్కొంది. సీజేలకు కనీస పదవీకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి తీవ్ర జాప్యం జరగడంపై ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థనూ తప్పుబట్టింది. జడ్జీల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా చూడాలంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement