నా వల్ల జడ్జీల నియామకం ఆగిపోలేదు
దేవులపల్లి అమర్ ‘సూటిమాట’ పుస్తకావిష్కరణలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్
సాక్షి, అమరావతి: తన వల్ల హైకోర్టుల్లో జడ్జి పోస్టుల నియామకం జరగకుండా ఆగిపోయిందనడంలో వాస్తవం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చెప్పారు. తాను కొలీజియం సమావేశాలకు వెళ్లకపోవడం వల్లే పలు హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలు భర్తీ కాకుండా ఆగిపోయాయని కొద్దిరోజుల క్రితం ఒక వార్త ప్రచురితమైందని, అది సరికాదన్నారు. విజయవాడలోని ఒక హోటల్‌లో శనివారం ప్రముఖ జర్నలిస్టు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ సాక్షి దినపత్రికలో డేట్‌లైన్ హైదరాబాద్–2 పేరుతో రాసిన వ్యాసాల సంకలనం ‘సూటిమాట’ పుస్కకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం కొలీజియం సమావేశాలకు వెళ్లకూడదని తాను నిర్ణయం తీసుకున్నప్పుడు అలజడి రేగిందని, ఆ సమయంలో అవుట్‌లుక్ పత్రికలో ఒక ప్రముఖ వ్యక్తి.. చలమేశ్వర్ కొలీజీయంకు వెళ్లకపోవడం వల్లే వివిధ హైకోర్టుల్లోని 450 జడ్జీల ఖాళీలు భర్తీ కాలేదని, ఇది దేశానికి మంచిది కాదని రాశారన్నారు.
ఆధారం లేకుండా ఆరోపణలు..
ఒక జడ్జీని బదిలీ చేస్తే తన కొడుక్కి లాభం ఉంటుందని, అందుకనే తాను తిరుగుబాటు చేశానని ఒక పాత్రికేయుడు రాశాడని, ఇది ఎవరో చెప్పి రాయించి ఉంటారని అభిప్రాయపడ్డారు. కానీ అదే కొలీజియంలోని ఇద్దరు జడ్జీల సంతానం ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నారని, కానీ తన కుమారుడు హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పారు. ఆ విషయాన్నీ రాసి ఉంటే బాగుండేదన్నారు.
న్యాయవ్యవస్థలేని రాజ్యవ్యవస్థ ఊహించలేం..
అన్ని వ్యవస్థల్లో లోపాలున్నట్లే న్యాయ వ్యవస్థలోనూ లోపాలున్నా దానివల్ల ప్రజలకు ఎంతోకొంత ఉపయోగం ఉంటుందని తాను నమ్ముతానని, న్యాయ వ్యవస్థలేని రాజ్య వ్యవస్థను ఊహించుకోవడానికే భయం వేస్తుందని తెలిపారు. అమర్ తనకు 32 ఏళ్లుగా తనకు తెలుసని విషయాన్ని సూటిగానే కాకుండా నిష్కర్షగా, కర్కశంగా కూడా చెబుతాడని అందుకే వృత్తిరీత్యా అతన్ని గౌరవిస్తానని చలమేశ్వర్ తెలిపారు. తాను తెలుగు వార్తల కోసం సాక్షి, ఈనాడు దినపత్రికలు చదువుతానన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. పుస్తకాల ద్వారా చారిత్రక సంఘటనలు ఎలా తెలుస్తాయో వివరించారు.
ప్రముఖ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి.రాఘవాచారి మాట్లాడుతూ.. ప్రజల్లో వస్తున్న మార్పును గమనించి అందుకు అనుగుణంగా వార్తలు రాయాలన్నారు. పుస్తక రచయిత దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. రాజకీయ నేతల్లో అసహనం తీవ్రమవుతోందని, తాము తప్ప ఇంకెవరూ అధికారంలో ఉండకూడదనే దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. పాత్రికేయ వ్యవస్థ ఉండడం వారికిష్టం లేదన్నారు. ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్ సచివాలయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు శ్మశానంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ప్రభాత్ దాస్, ఐజేయు ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, దేవులపల్లి పబ్లికేషన్స్ నిర్వహకుడు అజయ్ పాల్గొన్నారు.