Justice Jasti Chalameshwar
-
సమాజ హితం కోరేవారే నిజమైన సెలబ్రిటీలు
మద్దిలపాలెం (విశాఖపట్నం): సమాజహితం కోసం ఆలోచన చేసేవారు, తమ కృషి ద్వారా ప్రజలకు మేలు చేకూరే రీతిలో పాటుపడేవారే నిజమైన సెలబ్రిటీలని, డబ్బులిచ్చుకుని సత్కారాలు చేయించుకునే వారు కాదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ పురస్కార ప్రదానోత్సవం శనివారం రాత్రి విశాఖపట్నంలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చలమేశ్వర్ చేతుల మీదుగా లోక్‌నాయక్ పురస్కారాన్ని, రూ.1.50 లక్షల నగదును ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు అందజేశారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్యపురస్కారాన్ని, రూ. 50 వేల నగదును బాలల వికాసానికి కృషిచేసిన హైదరాబాద్‌కు చెందిన ఎన్.మంగాదేవికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అందించారు. అలాగే దివ్యాంగుల కళా సాహిత్య సాంస్కృతిక రంగానికి సేవలందిస్తున్న వంశీ రామరాజుకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.50 వేల నగదును కేరళ మాజీ న్యాయమూర్తి, హ్యూమన్‌రైట్స్ కమిషనర్ ఆంథోని డోమానే అందజేశారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ రచనలు, సేవల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపే వారే సెలబ్రిటీలుగా నిలుస్తారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు ముగ్గురికి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. డబ్బుపై యావ తగ్గించుకుని మంచి పనులు చేసేవారికి కీర్తిప్రతిష్టలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ పురస్కారాలందించడం అంటే వారిలోని సేవాసంస్కారాన్ని గుర్తించడమేనని చెప్పారు. కేరళ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు, మాజీ న్యాయమూర్తి ఆం«థోని డోమానే మాట్లాడుతూ సేవ చేసేవారిని సత్కరించి వారిలో సేవాతత్వాన్ని నింపేందుకు లోక్‌నాయక్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సాహిత్యంతోనే సమాజహితం సమాజహితానికి సాహిత్యం ఎంతో దోహదపడుతుందని, అంతటి శక్తి యుక్తి సాహిత్యానికి ఉందని లోక్‌నాయక్ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. తాను ఇప్పటివరకు 32 నవలలు, వంద పైచిలుకు కథలు రాశానన్నారు. తాను రాసిన తొలి నవల అంపశయ్యనే తన ఇంటి పేరుగా పిలుస్తున్నారన్నారు. విశాఖ అన్నా, ఇక్కడి సాగర తీరమన్నా తనకు చాలా ఇష్టమన్నారు. అలాంటి గొప్ప నేలపై గొప్ప పురస్కారాన్ని తీసుకోవడం గర్వకారణంగా ఉందని తెలిపారు. మానవత్వాన్ని మేల్కొల్పడమే ధ్యేయం బాలల వికాసానికి నిర్వహిస్తున్న చేతన, బాలబడి తదితర సేవా కార్యక్రమాల ద్వారా భావితరాలలో మానవత్వాన్ని మేల్కొల్పడమే ధ్యేయమని గుంటూరుకు చెందిన ఎన్. మంగాదేవి అన్నారు. జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. వంశీరామరాజు మాట్లాడుతూ 30 ఏళ్లుగా దివ్యాంగులకు సేవలందిస్తున్నానన్నారు. తన ఆశ్రమంలో చదివిన దివ్యాంగులు వాషింగ్టన్ బ్యాంకులో ఉద్యోగం చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అప్పరసు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన న్యాయమూర్తులను ప్రశ్నించొద్దా?
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను సాధారణ పౌరులు సైతం ప్రశ్నిస్తున్నప్పుడు... నన్నెవరూ ప్రశ్నించజాలరు అని ప్రధాన న్యాయమూర్తులు అనుకోవడం తనకు ఇప్పటికీ అర్థం కాని విషయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. వాళ్లు(ప్రధాన న్యాయమూర్తులు) ఎందుకు అతీతులుగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టులో కూడా జవాబుదారీతనం కోసమే తాను ఆనాడు కొలీజియం గురించి ప్రశ్నించానన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే నిర్ణయం తీసుకోవడం కంటే ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకోవడం కొంచెం నయమని పేర్కొన్నారు. దేశంలో రోజుకొక గాంధీ పుట్టరని, మనకు మనమే బాధ్యతగా మెలిగితేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని పేర్కొన్నారు. కాగా, రాజకీయాలు మరీ దారుణంగా ఉన్నాయని, పేకాట (జూదం) కంటే ఎక్కువ రిస్కుగా మారాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. ప్రజలకు డబ్బులు పంచి ఓట్లు కొనుక్కోవడం, ఆ పెట్టుబడిని మళ్లీ రాజకీయాల ద్వారా సంపాదించడమే పరిపాలనగా మారిందన్నారు. ఐవైఆర్, అజేయ కల్లం లాంటి వారు ప్రభుత్వంలో జరిగినవి చెప్పడం వల్లే జనానికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయన్నారు. చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు తాను పుట్టుకతోనే గొప్పవాడిననే భావన సీఎం చంద్రబాబులో ఉండటం వల్లే రెండో దశలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. పాలించే నాయకులపై గొప్ప నమ్మకంతో బ్యూరోక్రాట్లు వ్యవహరించి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పారు. పాలకులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదన్నారు. ‘‘విభజనకు సంబంధించిన అంశాలు, లోపభూయిష్టమైన విభజన చట్టం, అందులోని సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇప్పటికీ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి’’ అనే విషయాలను ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో ప్రస్తావించానని చెప్పారు ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఉన్న భేదాభిప్రాయాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని తన తోటి ఐఏఎస్ అధికారి చందనాఖన్‌కు, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ మురళి సాగర్‌కు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చినట్టు ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ప్రైవేటు, పార్టీ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి ప్రస్తుత పాలనలో ప్రజా ప్రయోజనాల కంటే ప్రైవేటు, పార్టీ ప్రయోజనాలే ఎక్కువయ్యాయని ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే వైరాగ్యం, విరక్తి కలుగుతున్నాయన్నారు. వ్యవస్థలన్నిటినీ కుప్పకూల్చారని వాపోయారు. నాకేమిటి, నా పార్టీకేమిటి అనే ఉద్దేశంతోనే పని చేస్తున్నారని విమర్శించారు. పౌరుల తీరులో మార్పు రావాలని, ప్రశ్నించే తత్వం చూపాలన్నారు. ప్రజల్లో మార్పు తేవడానికే ఐవైఆర్ ఈ పుస్తకాన్ని బయటకు తెచ్చారన్నారు. ఎక్కడకు వెళ్లినా రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడుగుతున్నారని, లోపాలను బహిర్గతం చేయడానికి రాజకీయాల్లోకే రావాలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, చందనాఖన్, హన్స్ ఇండియా సంపాదకులు రాము శర్మ తదితరులు పాల్గొన్నారు. -
జాస్తి చలమేశ్వర్ పదవీ విరమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై మరికొందరు న్యాయమూర్తులతో కలిసి బాహాటంగా తిరగుబాటు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శుక్రవారం పదవీవిరమణ చేయనున్నారు. ఏడేళ్ల పాటు సర్వోన్నత న్యాయస్ధానంలో జస్టిస్ చలమేశ్వర్ విధులు నిర్వహించారు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా మృతి కేసు సహా కీలక కేసుల కేటాయింపుపై న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గగోయ్, మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కలిసి ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12న సర్వోన్నత న్యాయస్ధానం పనితీరుపై జాస్తి నేతృత్వంలో న్యాయమూర్తులు బాహాటంగా వెల్లడించిన అంశాలు న్యాయవ్యవస్థతో పాటు దేశవ్యాప్తంగా పెనుప్రకంపనలు సృష్టించాయి. సుప్రీంకోర్టులో సమానత్వాన్ని కాపాడలేకుంటే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని, స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్ధే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆలంబన అవుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారంతో 65వ ఏట అడుగుపెడుతున్న చలమేశ్వర్ గోప్యత హక్కు ప్రాధమిక హక్కు అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌లో సభ్యులు కావడం గమనార్హం. -
నేడు జస్టిస్ చలమేశ్వర్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీల్లో ప్రధాన న్యాయమూర్తి తరువాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారంతో ఆయనకు 65 ఏళ్లు పూర్తవుతున్నాయి. జస్టిస్ చలమేశ్వర్ సుమారు ఏడేళ్లు సుప్రీంకోర్టులో జడ్జీగా విధులు నిర్వర్తించారు. తన కోసం వీడ్కోలు సమావేశం నిర్వహించొద్దని ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు ఇది వరకే విజ్ఞప్తి చేశారు. ముక్కుసూటి మనిషిగా పేరొందిన చలమేశ్వర్ పలు చారిత్రక తీర్పులు వెలువరించిన బెంచ్‌లలో సభ్యుడిగా పనిచేశారు. జనవరి 12న జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కలసి జస్టిస్ చలమేశ్వర్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కేసులను కేటాయిస్తున్న తీరును తప్పుపట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని చారిత్రక తీర్పునిచ్చిన 9 మంది జడ్జీల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ చలమేశ్వర్ కూడా ఉన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ పేరును సుప్రీం జడ్జి పదవికి ప్రతిపాదించిన ఐదుగురు సభ్యుల కొలీజియంలోనూ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి అత్యున్నత స్థానానికి.. 1953, జూన్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, మొవ్వ మండలం, పెద్ద ముత్తెవి గ్రామంలో జన్మించిన చలమేశ్వర్..మచిలీపట్నంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. చెన్నైలోని లయోలా కళాశాలలో బీఎస్సీ(భౌతికశాస్త్రం) అభ్యసించారు. 1976లో విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 1999లో ఏపీ హైకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందా రు. 2007లో గౌహతి హైకోర్టు సీజేగా, 2010లో కేరళ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. -
దేశంలో సత్యానికి స్థానంలేదు
సాక్షి, విజయవాడ: సత్యం, అహింసలపైనే గాంధీజీ సిద్ధాంతం ఆధారపడి ఉంటుందని, అయితే భారత్‌లో సత్యానికి స్థానం లేకుండాపోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నాయకుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘తలచుకుందాం! ప్రేమతో’ పుస్తకాన్ని ఆదివారం విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1975లో ఎమర్జెన్సీ అనంతరం కంచి పరమాచార్య చంద్రశేఖర్ సరస్వతిని ఒక విలేకరి ఎమర్జెన్సీ ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా.. సత్యం మీద విశ్వాసం కోల్పోయిన సమాజానికి ఇంతకంటే మంచి జరగదని స్వామీజీ చెప్పారని న్యాయమూర్తి వివరించారు. అది అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ అందరం గుర్తుంచుకోవాల్సిన విషయమని తెలిపారు. గాంధీజీ జయంతి రోజున ఆయన్ను అందరూ తలుచుకుంటారని, అయితే ఆయన సిద్ధాంతాలకు మాత్రం తిలోదకాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిజం నిర్భయంగా మాట్లాడాలని, అది మాట్లాడనంత వరకు మంచి జరగదని జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. యలమంచిలి శివాజీని ప్రభావితం చేసిన వ్యక్తులు, వారిలోని గొప్పగుణాలను వివరిస్తూ ఈ పుస్తకం రాశారని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. శివాజీ తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభావితం చేసిన వారి గురించి, తనకు నచ్చిన వారి గురించి వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల సంకలనమిది అన్నారు. యలమంచిలి శివాజీ మాట్లాడుతూ.. తనకు చిన్నతనం నుంచి రచనలపట్ల ఆసక్తి ఉందన్నారు. నేడు చరిత్రహీనుల చరిత్రలను గ్రంథస్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఉద్ధండ నేతలు ఉన్నారని.. వారివల్ల తాను ప్రభావితం చెందానని చెప్పారు. -
అభిప్రాయాలు చెప్పనివారికి మాట్లాడే అర్హత ఉండదు
సాక్షి, విశాఖపట్నం: సమకాలీన వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై అభిప్రాయాలు చెప్పలేని వారికి సమాజం గురించి మాట్లాడే అర్హత ఉండదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. ‘ఆరేడు నెలలుగా భారత న్యాయవ్యవస్థలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కానీ వాటిపై కచ్చితమైన అభిప్రాయాలు చెప్పిన వారు చాలా తక్కువ. నన్ను సమర్థించమని చెప్పను. నేను లేవనెత్తిన లోపాలు కరెక్టా? కాదా? అని చెప్పడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్ధం కావడం లేదు.. ఏమీ మాట్లాడక పోవడం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాద’న్నారు. పత్రికా రంగంలో అక్షరబ్రహ్మగా పేరొందిన సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ జర్నలిజంలోకి అడుగుపెట్టి 62 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో ఆయనను ఘనంగా సన్మానించారు. అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జస్టిస్ చలమేశ్వర్ వివిధ అంశాలపై ప్రసంగించారు. ‘పద్మావతి సినిమా రిలీజ్ అవ్వాలా? వద్దా అని ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, అన్ని వర్గాల ప్రజలు మాట్లాడారు. కానీ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం అభిప్రాయాలు చెప్పేందుకు ఏ ఒక్కరు ముందుకు రాకపోవడం దురదృష్టకరమని చలమేశ్వర్ అన్నారు. జడ్జి అయిన కొత్తలో తొలి సన్మానం ఏబీకే ప్రసాద్ చేతుల మీదుగానే జరిగింది. పేదవాడ్ని దృష్టిలో పెట్టుకొని తీర్పులివ్వాలని ఆనాడు ఆయన చెప్పిన మాటలు నేటికీ గుర్తున్నాయి. అదే బాటలో ప్రస్థానం కొనసాగిస్తున్నానన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఏ ఒక్క పార్టీ కూడా కేవలం 3034 శాతం ఓట్లతోనే మెజార్టీ సీట్లు సాధించి గద్దెనెక్కాయి. ఈ దేశంలో మేం ఏం చెబితే అదే వేదం, మేం ఏ కావాలంటే అదే జరుగుతుంది అన్న ధోరణిలో పాలక పక్షాలు పాలన సాగిస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వారు అరాచకులు, దుర్మార్గులు, ప్రజా కంఠకులు. కొత్తగా అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతావనిలో దాదాపు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏ రాష్ట్ర బడ్జెట్లో చూసినా న్యాయ వ్యవస్థకు 2 శాతానికి మించి కేటాయింపులుండవని చెప్పారు. పత్రికా రంగానికే తలమానికమైన ఏబీకే ప్రసాద్‌ను సత్కరించడం అభినందనీయమన్నారు. ప్రశ్నించేతత్వం లేని సమాజానికి మనుగడ లేదు ప్రశ్నించేతత్వం కోల్పోయిన సమాజానికి మనుగడ ఉండదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని ఇష్టమొచ్చిన రీతిలో ఖర్చు చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తామేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. ఇటీవలే తెలంగాణా ప్రభుత్వం దుర్వినియోగం చేసిన తీరును కాగ్ ఎండగట్టింది.. నేడో రేపో ఏపీ ప్రభుత్వ తీరును కూడా కాగ్ బట్టబయలు చేయనుందన్నారు. ముగ్గురు సహ న్యాయమూర్తులతో కలిసి చరిత్రలో తొలిసారిగా సుప్రీం చీఫ్ జస్టిస్, న్యాయ వ్యవస్థ లోపాలపై ప్రశ్నించడం ద్వారా జస్టిస్ చలమేశ్వర్ నిజంగా చరిత్ర సృష్టించారన్నారు. పత్రికా రంగంలో నిబద్ధత, నిజాయతీకి నిర్వచనం ఏబీకే అని, 62 ఏళ్లుగా ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారన్నారు. ఆయన వారసత్వాన్ని, విలువలన్ని, పాత్రికేయాన్ని కొనసాగించే అదృష్టం నాకు లభించింది. ఏబీకే గారు ఎప్పుడూ ప్రభుత్వాన్ని పొగుడుతూనో, ముఖ్యమంత్రికి భజన చేస్తూనో ఒక్క వాక్యం రాయలేదని చెప్పారు. పౌర సమాజం పోరుబాటపట్టాలి తనకు జరిగిన సన్మానంపై ఏబీకే ప్రసాద్ స్పందిస్తూ ఉదయం సహా ఐదారు ప్రముఖ పత్రికలకు సంపాదకత్వం వహించే అవకాశం తనకు లభించిందని, 23 జిల్లాల్లో ఆరేడువేల మంది జర్నలిస్టులను తయారు చేయగలిగానన్నారు. 62 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు ఈ రంగంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేడు పత్రికా వ్యవస్థ గొంతు నులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పత్రికలతో పాటు పౌర సమాజం కూడా క్రియాశీలంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వాలపై పౌరసమాజం పోరాటం చేసే దిశగా పత్రికలు వారిలో చైతన్యం నింపాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రసంగించారు. -
విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయాధికారుల విభజనలో హైకోర్టు మార్గదర్శకాలను సవాల్ చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వైదొలిగారు. ఈ కేసును తాను లేని ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను నాలుగు వారాలుగా వింటూ వచ్చింది. న్యాయాధికారుల విభజనకు హైకోర్టు రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై తెలంగాణ న్యాయాధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ముసాయిదా ఆధారంగా మరో మార్గదర్శకాల ముసాయిదాను తయారు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ గతంలో ఈ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం ముసాయిదా రూపొందించింది. అయితే న్యాయాధికారుల విభజనను స్థానికత ఆధారంగా చేపట్టాలని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించగా.. హైకోర్టు దానికి సవరణలు చేసి సీనియారిటీ ఆధారంగా విభజన జరపాలన్న మార్గదర్శకాలను చేర్చిందని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా సింగ్ వాదనలు వినిపించారు. మరోవైపు హైకోర్టు మార్గదర్శకాలనే పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హరేన్ రావల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వీవీఎస్ రావు వాదించారు. మంగళవారం జరిగిన విచారణలో వీవీఎస్ రావు తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే గతంలో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడే జస్టిస్ చలమేశ్వర్ పలుమార్లు కీలక అంశాన్ని ప్రస్తావించారు. తాను ఏపీకి చెందినందున ఈ కేసును విచారించడంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పాలని, తాను తప్పుకొంటానని పేర్కొన్నారు. అయినా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దీంతో విచారణను ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చారు. కానీ మంగళవారం అనూహ్యంగా ఈ కేసును తాను లేని ధర్మాసనం వింటుందంటూ ఉత్తర్వులు జారీచేశారు. -
నా వల్ల జడ్జీల నియామకం ఆగిపోలేదు
దేవులపల్లి అమర్ ‘సూటిమాట’ పుస్తకావిష్కరణలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సాక్షి, అమరావతి: తన వల్ల హైకోర్టుల్లో జడ్జి పోస్టుల నియామకం జరగకుండా ఆగిపోయిందనడంలో వాస్తవం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చెప్పారు. తాను కొలీజియం సమావేశాలకు వెళ్లకపోవడం వల్లే పలు హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలు భర్తీ కాకుండా ఆగిపోయాయని కొద్దిరోజుల క్రితం ఒక వార్త ప్రచురితమైందని, అది సరికాదన్నారు. విజయవాడలోని ఒక హోటల్లో శనివారం ప్రముఖ జర్నలిస్టు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ సాక్షి దినపత్రికలో డేట్లైన్ హైదరాబాద్–2 పేరుతో రాసిన వ్యాసాల సంకలనం ‘సూటిమాట’ పుస్కకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం కొలీజియం సమావేశాలకు వెళ్లకూడదని తాను నిర్ణయం తీసుకున్నప్పుడు అలజడి రేగిందని, ఆ సమయంలో అవుట్‌లుక్ పత్రికలో ఒక ప్రముఖ వ్యక్తి.. చలమేశ్వర్ కొలీజీయంకు వెళ్లకపోవడం వల్లే వివిధ హైకోర్టుల్లోని 450 జడ్జీల ఖాళీలు భర్తీ కాలేదని, ఇది దేశానికి మంచిది కాదని రాశారన్నారు. ఆధారం లేకుండా ఆరోపణలు.. ఒక జడ్జీని బదిలీ చేస్తే తన కొడుక్కి లాభం ఉంటుందని, అందుకనే తాను తిరుగుబాటు చేశానని ఒక పాత్రికేయుడు రాశాడని, ఇది ఎవరో చెప్పి రాయించి ఉంటారని అభిప్రాయపడ్డారు. కానీ అదే కొలీజియంలోని ఇద్దరు జడ్జీల సంతానం ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నారని, కానీ తన కుమారుడు హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పారు. ఆ విషయాన్నీ రాసి ఉంటే బాగుండేదన్నారు. న్యాయవ్యవస్థలేని రాజ్యవ్యవస్థ ఊహించలేం.. అన్ని వ్యవస్థల్లో లోపాలున్నట్లే న్యాయ వ్యవస్థలోనూ లోపాలున్నా దానివల్ల ప్రజలకు ఎంతోకొంత ఉపయోగం ఉంటుందని తాను నమ్ముతానని, న్యాయ వ్యవస్థలేని రాజ్య వ్యవస్థను ఊహించుకోవడానికే భయం వేస్తుందని తెలిపారు. అమర్ తనకు 32 ఏళ్లుగా తనకు తెలుసని విషయాన్ని సూటిగానే కాకుండా నిష్కర్షగా, కర్కశంగా కూడా చెబుతాడని అందుకే వృత్తిరీత్యా అతన్ని గౌరవిస్తానని చలమేశ్వర్ తెలిపారు. తాను తెలుగు వార్తల కోసం సాక్షి, ఈనాడు దినపత్రికలు చదువుతానన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. పుస్తకాల ద్వారా చారిత్రక సంఘటనలు ఎలా తెలుస్తాయో వివరించారు. ప్రముఖ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి.రాఘవాచారి మాట్లాడుతూ.. ప్రజల్లో వస్తున్న మార్పును గమనించి అందుకు అనుగుణంగా వార్తలు రాయాలన్నారు. పుస్తక రచయిత దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. రాజకీయ నేతల్లో అసహనం తీవ్రమవుతోందని, తాము తప్ప ఇంకెవరూ అధికారంలో ఉండకూడదనే దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. పాత్రికేయ వ్యవస్థ ఉండడం వారికిష్టం లేదన్నారు. ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్ సచివాలయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు శ్మశానంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ప్రభాత్ దాస్, ఐజేయు ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, దేవులపల్లి పబ్లికేషన్స్ నిర్వహకుడు అజయ్ పాల్గొన్నారు.