యలమంచిలి శివాజీ రచించిన ‘తలచుకుందాం ప్రేమతో’ పుస్తకావిష్కరణ చేస్తున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తదితరులు
సాక్షి, విజయవాడ: సత్యం, అహింసలపైనే గాంధీజీ సిద్ధాంతం ఆధారపడి ఉంటుందని, అయితే భారత్‌లో సత్యానికి స్థానం లేకుండాపోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నాయకుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘తలచుకుందాం! ప్రేమతో’ పుస్తకాన్ని ఆదివారం విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1975లో ఎమర్జెన్సీ అనంతరం కంచి పరమాచార్య చంద్రశేఖర్ సరస్వతిని ఒక విలేకరి ఎమర్జెన్సీ ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా.. సత్యం మీద విశ్వాసం కోల్పోయిన సమాజానికి ఇంతకంటే మంచి జరగదని స్వామీజీ చెప్పారని న్యాయమూర్తి వివరించారు.
అది అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ అందరం గుర్తుంచుకోవాల్సిన విషయమని తెలిపారు. గాంధీజీ జయంతి రోజున ఆయన్ను అందరూ తలుచుకుంటారని, అయితే ఆయన సిద్ధాంతాలకు మాత్రం తిలోదకాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిజం నిర్భయంగా మాట్లాడాలని, అది మాట్లాడనంత వరకు మంచి జరగదని జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. యలమంచిలి శివాజీని ప్రభావితం చేసిన వ్యక్తులు, వారిలోని గొప్పగుణాలను వివరిస్తూ ఈ పుస్తకం రాశారని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. శివాజీ తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభావితం చేసిన వారి గురించి, తనకు నచ్చిన వారి గురించి వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల సంకలనమిది అన్నారు. యలమంచిలి శివాజీ మాట్లాడుతూ.. తనకు చిన్నతనం నుంచి రచనలపట్ల ఆసక్తి ఉందన్నారు. నేడు చరిత్రహీనుల చరిత్రలను గ్రంథస్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఉద్ధండ నేతలు ఉన్నారని.. వారివల్ల తాను ప్రభావితం చెందానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment