అంపశయ్య నవీన్‌కు లోక్‌నాయక్ పురస్కారాన్ని అందిస్తున్న జస్టిస్ చలమేశ్వర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు
మద్దిలపాలెం (విశాఖపట్నం): సమాజహితం కోసం ఆలోచన చేసేవారు, తమ కృషి ద్వారా ప్రజలకు మేలు చేకూరే రీతిలో పాటుపడేవారే నిజమైన సెలబ్రిటీలని, డబ్బులిచ్చుకుని సత్కారాలు చేయించుకునే వారు కాదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ పురస్కార ప్రదానోత్సవం శనివారం రాత్రి విశాఖపట్నంలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చలమేశ్వర్ చేతుల మీదుగా లోక్‌నాయక్ పురస్కారాన్ని, రూ.1.50 లక్షల నగదును ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు అందజేశారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్యపురస్కారాన్ని, రూ. 50 వేల నగదును బాలల వికాసానికి కృషిచేసిన హైదరాబాద్‌కు చెందిన ఎన్.మంగాదేవికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అందించారు.
అలాగే దివ్యాంగుల కళా సాహిత్య సాంస్కృతిక రంగానికి సేవలందిస్తున్న వంశీ రామరాజుకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.50 వేల నగదును కేరళ మాజీ న్యాయమూర్తి, హ్యూమన్‌రైట్స్ కమిషనర్ ఆంథోని డోమానే అందజేశారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ రచనలు, సేవల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపే వారే సెలబ్రిటీలుగా నిలుస్తారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు ముగ్గురికి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. డబ్బుపై యావ తగ్గించుకుని మంచి పనులు చేసేవారికి కీర్తిప్రతిష్టలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ పురస్కారాలందించడం అంటే వారిలోని సేవాసంస్కారాన్ని గుర్తించడమేనని చెప్పారు. కేరళ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు, మాజీ న్యాయమూర్తి ఆం«థోని డోమానే మాట్లాడుతూ సేవ చేసేవారిని సత్కరించి వారిలో సేవాతత్వాన్ని నింపేందుకు లోక్‌నాయక్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
సాహిత్యంతోనే సమాజహితం
సమాజహితానికి సాహిత్యం ఎంతో దోహదపడుతుందని, అంతటి శక్తి యుక్తి సాహిత్యానికి ఉందని లోక్‌నాయక్ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. తాను ఇప్పటివరకు 32 నవలలు, వంద పైచిలుకు కథలు రాశానన్నారు. తాను రాసిన తొలి నవల అంపశయ్యనే తన ఇంటి పేరుగా పిలుస్తున్నారన్నారు. విశాఖ అన్నా, ఇక్కడి సాగర తీరమన్నా తనకు చాలా ఇష్టమన్నారు. అలాంటి గొప్ప నేలపై గొప్ప పురస్కారాన్ని తీసుకోవడం గర్వకారణంగా ఉందని తెలిపారు.
మానవత్వాన్ని మేల్కొల్పడమే ధ్యేయం
బాలల వికాసానికి నిర్వహిస్తున్న చేతన, బాలబడి తదితర సేవా కార్యక్రమాల ద్వారా భావితరాలలో మానవత్వాన్ని మేల్కొల్పడమే ధ్యేయమని గుంటూరుకు చెందిన ఎన్. మంగాదేవి అన్నారు. జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. వంశీరామరాజు మాట్లాడుతూ 30 ఏళ్లుగా దివ్యాంగులకు సేవలందిస్తున్నానన్నారు. తన ఆశ్రమంలో చదివిన దివ్యాంగులు వాషింగ్టన్ బ్యాంకులో ఉద్యోగం చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అప్పరసు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment