
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయాధికారుల విభజనలో హైకోర్టు మార్గదర్శకాలను సవాల్ చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వైదొలిగారు. ఈ కేసును తాను లేని ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను నాలుగు వారాలుగా వింటూ వచ్చింది. న్యాయాధికారుల విభజనకు హైకోర్టు రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై తెలంగాణ న్యాయాధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ముసాయిదా ఆధారంగా మరో మార్గదర్శకాల ముసాయిదాను తయారు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ గతంలో ఈ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు అనుగుణంగా కేంద్రం ముసాయిదా రూపొందించింది. అయితే న్యాయాధికారుల విభజనను స్థానికత ఆధారంగా చేపట్టాలని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించగా.. హైకోర్టు దానికి సవరణలు చేసి సీనియారిటీ ఆధారంగా విభజన జరపాలన్న మార్గదర్శకాలను చేర్చిందని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా సింగ్ వాదనలు వినిపించారు. మరోవైపు హైకోర్టు మార్గదర్శకాలనే పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హరేన్ రావల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వీవీఎస్ రావు వాదించారు.
మంగళవారం జరిగిన విచారణలో వీవీఎస్ రావు తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే గతంలో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడే జస్టిస్ చలమేశ్వర్ పలుమార్లు కీలక అంశాన్ని ప్రస్తావించారు. తాను ఏపీకి చెందినందున ఈ కేసును విచారించడంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పాలని, తాను తప్పుకొంటానని పేర్కొన్నారు. అయినా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దీంతో విచారణను ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చారు. కానీ మంగళవారం అనూహ్యంగా ఈ కేసును తాను లేని ధర్మాసనం వింటుందంటూ ఉత్తర్వులు జారీచేశారు.