‘రాజ్యాంగం వైఫల్యం’పై విచారణ నిరవధిక వాయిదా | High Court Indefinite Adjournment Constitutional Breakdown In AP Case | Sakshi
Sakshi News home page

‘రాజ్యాంగం వైఫల్యం’పై విచారణ నిరవధిక వాయిదా

Published Fri, Dec 18 2020 9:30 PM | Last Updated on Fri, Dec 18 2020 9:56 PM

High Court Indefinite Adjournment Constitutional Breakdown In AP Case - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అన్న అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను నిరవధికంగా వాయిదా వేసింది. రాజ్యాంగ వైఫల్యంపై హైకోర్టు జరుపుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది వైఎన్‌ వివేకానంద తెలియచేయడంతో జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం దీన్ని రికార్డు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి అనంతరం బెంచ్‌ దిగి వెళ్లిపోయింది. అంతకు ముందు ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభం కాగానే రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశామని, అది కొద్దిసేపట్లో విచారణకు రానుందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద నివేదించారు. అందువల్ల ఈ వ్యాజ్యాల్లో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరగా అందుకు జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం నిరాకరిస్తూ మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొంది. 

వాయిదా సమస్యే లేదు.. మధ్యాహ్నమే విచారణ
శుక్రవారం మధ్యాహ్నం బదులు విచారణను సోమవారం చేపట్టాలని ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరపున హాజరవుతున్న సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి కూడా అభ్యర్థించారు. రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపే నిమిత్తం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రీకాల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వుల కాపీ తమకు అందలేదని తెలిపారు. రిజిస్ట్రీ సర్టిఫైడ్‌ కాపీ బదులు ఈ-మెయిల్‌ ద్వారా సాఫ్ట్‌ కాపీని పంపిందని, ఇది కోర్టు ఆదేశాలను అమలు చేయడం కిందకు రాదన్నారు. ఈ-మెయిల్‌ కాపీని తాము తదుపరి (పై కోర్టుల్లో సవాలు చేసేందుకు) వినియోగించడం సాధ్యం కాదని, అందువల్ల సర్టిఫైడ్‌ కాపీని ఇప్పించాల్సిన అవసరం ఉందని, విచారణ సోమవారం చేపట్టాలని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఇందుకు నిరాకరిస్తూ మధ్యాహ్నమే విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. 

వాయిదా వేస్తే మిన్ను విరిగి మీద పడదు...
ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరవుతున్న మరో సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ మధ్యాహ్నం కాకుండా విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. తనకు వ్యక్తిగతమైన ఇబ్బంది ఉందని, అందుకే వాయిదా అడుగుతున్నానని తెలిపారు. వాయిదా వేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని, మిన్ను విరిగి మీద పడదని పేర్కొన్నారు. వ్యక్తిగత ఇబ్బంది ఉందని అభ్యర్థించినప్పుడు విచారణను వాయిదా వేయడం ఏపీ హైకోర్టు సంప్రదాయమని గుర్తు చేశారు. అయితే వాయిదా వేసేందుకు ధర్మాసనం నిరాకరించింది.

న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలి...
ఈ సమయంలో మోహన్‌రెడ్డి, జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. మధ్యాహ్నం విచారించి తీరుతామని జస్టిస్‌ రాకేశ్‌ స్పష్టం చేయగా  ఇది అన్యాయమని, న్యాయస్థానానికి ఎంతమాత్రం తగదని మోహన్‌రెడ్డి నివేదించారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ అన్నింటినీ కోర్టు రికార్డింగ్‌ (బ్లూజీన్స్‌ యాప్‌ ద్వారా వీడియో రికార్డింగ్‌) చేస్తోందన్న విషయం తెలుసని, తన వాదన రికార్డు కావాలన్న ఉద్దేశంతోనే కోర్టు అన్యాయంగా వ్యవహరిస్తోందని చెబుతున్నానని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తనను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారని జస్టిస్‌ రాకేశ్‌ పేర్కొనగా ప్రతి దానిని విచారించాల్సిన బాధ్యత మీపై (ధర్మాసనం) ఉందని మోహన్‌రెడ్డి గుర్తు చేశారు.

అలాగే న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించాలన్నారు. కోర్టుగా తాము తమ విధులను నిర్వర్తిస్తున్నామని జస్టిస్‌ రాకేశ్‌ వ్యాఖ్యానించగా ఎలాంటి పక్షపాతం లేకుండా, ముందస్తుగానే నిర్ణయానికి రాకుండా విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉందని మోహన్‌రెడ్డి సమాధానమిచ్చారు. తాము తమ ప్రమాణం మేరకు నడుచుకుంటున్నామని, దాని నుంచి పక్కకు వెళ్లబోమని జస్టిస్‌ రాకేశ్‌ పేర్కొనగా మధ్యాహ్నం విచారణకు తాను హాజరుకాబోవడం లేదని, సోమవారం వాదనలు వినిపిస్తానని మోహన్‌రెడ్డి బదులిచ్చారు.

వాయిదా కోరడం దుర్వినియోగం చేసినట్లా?
‘మీరు ఏం కావాలో అది చేసుకోండి... రాష్ట్ర ప్రభుత్వం రోజుకో న్యాయవాదిని నియమిస్తోంది’ అని జస్టిస్‌ రాకేశ్‌ వ్యాఖ్యానించగా.. ఎవరిని న్యాయవాదిగా నియమించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదే రీతిలో కేసును వాయిదా వేయాలా? వద్దా? అన్నది తమ ఇష్టమని జస్టిస్‌ రాకేశ్‌ వ్యాఖ్యానించారు. మీరు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయాలనుకుంటే చేయవచ్చని జస్టిస్‌ రాకేశ్‌ వ్యాఖ్యానించగా మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందిస్తూ వ్యక్తిగత ఇబ్బందుల వల్ల విచారణ వాయిదా వేయాలని కోరడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

న్యాయవాదుల అభ్యర్థనను కోర్టు ఇలా భావిస్తుంటే తాము చేయగలిగింది ఏమీ లేదన్నారు. తిరిగి మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టులో ఏం జరిగిందని జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ప్రశ్నించారు. రాజ్యాంగ వైఫల్యంపై ఈ ధర్మాసనం జరుపుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద తెలిపారు. దీంతో దీన్ని రికార్డు చేసుకున్న జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం తమ ముందున్న వ్యాజ్యాలపై విచారణను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి బెంచ్‌ దిగి వెళ్లిపోయింది.

31న పదవీ విరమణ.. ఈలోపే నిర్ణయం వెలువరించేలా!
తమవారిని పోలీసులు అక్రమంగా నిర్భంధించారంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరుపుతూ వచ్చిన జస్టిస్‌ రాకేశ్, జస్టిస్‌ ఉమాదేవిల ధర్మాసనం అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అనే అంశాన్ని తేలుస్తామంటూ అక్టోబర్‌ 1న ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 31న జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ వ్యాజ్యాలపై విచారణను ముగించాలన్న ఉద్దేశంతో ధర్మాసనం రోజూవారీ విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం జరిగిందని ఏ పిటిషనర్‌ పేర్కొనలేదని, పిటిషనర్లు కోరకుండా ఆ అంశంపై విచారణ జరపడం సరికాదని, అసలు ఆ అంశంపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని, అందువల్ల అక్టోబర్‌ 1న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఆ పిటిషన్‌ను ఒక్క నిమిషంలో కొట్టివేసిన జస్టిస్‌ రాకేశ్‌ కుమార్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ను వాదనలు వినిపించేందుకు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించేందుకు అనుమతించలేదు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సైతం అనుమతినివ్వలేదు. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఈ వ్యాజ్యంలో ఏ నిర్ణయం వెలువరించాలో ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చి విచారణ జరుపుతున్నారని, దీనివల్ల  తమకు న్యాయం లభించదని భావిస్తూ విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌ తప్పుకోవాలంటూ (రెక్యూజల్‌) రాష్ట్ర ప్రభుత్వం ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇదే సమయంలో జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం జారీ చేసిన అక్టోబర్‌ 1 నాటి ఉత్తర్వులను, రీకాల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement