
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధుల కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ చేశానని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్‌లో చూపించాలని సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎంలు లేఖలు రాయడం కొత్తమీకాదని వ్యాఖ్యానించారు.
జగన్ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్‌ఐఆర్ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో విచారణ రాకుండా చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై చర్చ జరగాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు ఒక్కటేనని అరుణ్ కుమార్ తెలిపారు.