Public representative
-
కులదూషణ ఏ సంస్కృతికి ప్రతీక?
ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవీ స్వీకారం రోజున చేసే ప్రమాణాలకు కట్టుబడి ప్రజలకు కుల మతాలకు అతీతంగా సేవలు చేయాలి. బాధ్యతలూ నిర్వర్తించాల్సి ఉంటుంది. రాగద్వేషాలకు అతీతంగా వారు ఉండి తీరాల్సిందే. ఏ ఒక్కరిపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు సైతం చేయకూడదు. అలా చేస్తే రాజ్యాంగాన్ని ధిక్కరించిన వారు అవుతారు. ఇటీవల ఒక ప్రజా ప్రతినిధి ఒక కులాన్ని ఉద్దేశపూర్వకంగా దూషించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆ ప్రజాప్రతినిధి అలా మాట్లాడవచ్చా? ఎవరో ఏదో చేశారని మొత్తం ఆ కులాన్ని టార్గెట్ చేయడం విస్మయం కలిగిస్తున్నది. ఈ విధానాన్ని అన్ని రాజకీయ పక్షాలూ ముక్తకంఠంతో ఖండించాలి. అప్పుడే ఇలాంటి వారి వైఖరిలో మార్పు వస్తుంది. ఓ సామాజిక వర్గానికి చెందిన నేత 10 ఏండ్లు పాలించిన మాత్రాన ఆయనపై కోపంతో ఈ ప్రజాప్రతినిధి ఆ నేత కులస్థుల నందరినీ దూషించడం భావ్యమేనా? ఈ ప్రజాప్రతినిధి సొంత పార్టీలో కూడా ఆయన తిట్టిన సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ నేతలకు కూడా ఈ సంబోధన వర్తిస్తుందా అనేది స్పష్టం చేయాలి. అదే పార్టీకి చెందిన పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి విషయంలో కూడా ఆయన అభిప్రాయం ఇదే అయితే పార్టీని, పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టినట్టే కదా! ఈ విషయంలో వెంటనే స్పందించి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆ ప్రజాప్రతినిధిని వివరణ ఇవ్వాలని ఆదేశించడం శుభపరిణామం. అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠం కావాలని కోరుకోవడం ఎంతైనా అవసరం.అన్ని కులాలు, జాతుల వారితోపాటు చివరకు ఆయన దూషించిన కులం వారు కూడా ఆయనకు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది? ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకూ ఆయనే కదా ప్రజాప్రతినిధి! అలాంటిది ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగడం దేనికి సంకేతం? ఇదేనా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు. ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఆ ఒక్క కులాన్నే కాదు... ఏ కులాన్ని దూషించే హక్కూ ఎవరికీ లేదు. ఇలా చేస్తే రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం లేనట్టే లెక్క. గౌరవం ఉన్న వారు ఇలా ప్రవర్తించరు.కులాలపై దూషణలకు దిగినా, ద్వేషించినా అన్ని రాజకీయ పార్టీలూ అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విధమైన సంస్కృతిని ఎవరూ ప్రోత్సహించవద్దు. ఎవరైనా ప్రోత్సహించినా తగిన శాస్తి చేయాలి. ప్రజల్లో హీరోయిజం చూపించేందుకు ఇలాంటి మార్గాన్ని ఎన్నుకోవడం దుందుడుకు చర్య అవుతుంది. అరవై, డెబ్భై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీతో అత్యంత అనుబంధం ఉన్న ఆ కులానికి చెందిన నేతలు పెద్ద పెద్ద హోదాల్లో పని చేశారు. కులరహితంగా సేవలందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా నిత్యం పాటుపడ్డారు. కులాలను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. అందరికీ తోడుగా, నీడగా వ్యవహరించారు. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భరోసా కల్పించేవారు. దేశం, తెలంగాణ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. అదే విధంగా మరో జాతీయ పార్టీలో ఆ కులానికి చెందిన నేతలకు ప్రజాప్రతినిధులుగా, గవర్నర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఏతావతా చెప్పొచ్చేదేమిటంటే... అన్ని పార్టీల్లోనూ ఈ కులస్థులు ఉన్నారనే! ఈ ఇంగితాన్ని మరచి ఒక నేత పట్ల ఉన్న ఆక్రోశంతో అతడి కులస్థుల నందరినీ తిట్టి బాధపడేలా చేయడం సరికాదు కదా! మొత్తం రాజకీయ వాతావరణమే ఈ చర్యతో దెబ్బతిన్నదనేది వాస్తవం. కుల సంఘాల వారు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండి, రాజ్యాంగబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడడం మంచి పద్ధతి. అలా కాకుండా సోషల్ మీడియా వేదికలపై ఒకరి కులాన్ని మరో కులంవారు తిడుతూ రెచ్చగొట్టుకోవడం సరికాదు. ఈ విషయంలో అందరూ సంయమనాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తెచ్చి, తమ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ప్రజాప్రతినిధులపైన ఆ పార్టీ పెద్దలు చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయడం సరైన మార్గం. ప్రజల చేత ఎన్నికై, ప్రజల కోసం పని చేసే నేతలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. వెలమ జాతి ఒక్కరి సొత్తు కాదు. వారు ఒక్కరి దిక్కు ఒరిగి లేరు. నిజానికి ఆ కులాన్ని తిట్టిన ప్రజాప్రతినిధి పార్టీలోనే ఎక్కువ మంది వెలమలు ఉన్నారు అనే విషయం మరిచిపోకూడదు. గత ఏడు దశాబ్దాలుగా వారు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నమాట జగమెరిగిన సత్యం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఈ దూషణతో వ్యక్తిగతంగా దిగజారుతూ, పార్టీకి కూడా ఆయన చేసిన పాపం అంటగట్టడం ఎందుకు? దేశానికి ఆపద వస్తే కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పార్టీల మధ్య ఎన్ని వైరుద్ధ్యాలు ఉన్నా భారతీయులందరూ దేశ రక్షణ, అభివృద్ధిలో ఏకతాటిపై ఉండడం సహజం. ఇది మన లక్ష్యం. ఈ విషయంలో అది తెలంగాణ అయినా, మన సొంత జిల్లా అయినా, పక్క జిల్లా అయినా అక్కడ ప్రజలు ఆపదలో ఉంటే కులమతాలకు అతీతంగా ఆదుకొని తీరుతాం. సమాజంలో మనుషులంతా సమానమే. కులాలు వేరు వేరు ఉంటాయి. ఆ కులంలో పుట్టాం... ఈ కులంలో పుట్టాం... అని చింతించుకుంటూ పోతే లాభం లేదు. ఒక చిన్న కులంలో పుట్టడం నేరం కాదు. పెద్ద కులంలో పుట్టానని పొంగిపోవడం మంచిది కాదు. ఒక కులంపై విద్వేషం చిమ్మే విధంగా మరొకరు మాట్లాడడం భావ్యం కూడా కాదు. అసలు కుల ప్రస్తావన తేవడం నేరం కిందకే వస్తుంది. కులం పేరిట దూషిస్తూ స్వలాభం పొందడం రోతపుట్టిస్తుంది.అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సర్కారు కులగణనను ఓ వైపు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాప్రతినిధి ఓ కులంపై విషం చిమ్మడం దారుణం. అసలు కులగణన ఎందుకు జరిపిస్తున్నారన్న ఎరుక ఈ ప్రజాప్రతినిధికి ఉందా? వివిధ కులాల వారు ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారి వారి జనాభాల నిష్పత్తుల ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికే కదా! అంటే అన్ని కులాలనూ సమానదృష్టితో చూడడానికే కదా! మరి ఈ ప్రజాప్రతినిధి ఒక కులంపై ఇంత దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సభ్యసమాజంపై ఉంది. ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలూ, పౌర సమాజం మొత్తం ఇది అర్థం చేసుకొని వ్యవహరించాలి. అప్పుడే సమాజ శ్రేయస్సుకు తోడ్పాటు అందించిన వారు అవుతారు. లేకపోతే సమాజానికే ప్రమాదం. వ్యాసకర్త కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ‘ 9849061481వెలిచాల రాజేందర్రావు -
ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య వెనుక మహిళా ప్రజాప్రతినిధి: పీతల సుజాత
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనక ఉన్న అదృశ్య శక్తిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నారని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పీతల సుజాత ఆరోపించారు. ఆమె ఎవరో, ఆమెకు అనంతబాబుకి ఉన్న సంబంధమేమిటో, ఎందుకు హత్య జరిగిందనే వివరాలను త్వరలోనే బయటపెడతామని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు, అతన్ని కాపాడటానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
నా సూచనలు సీజేఐకి మెయిల్ చేశా: ఉండవల్లి
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధుల కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ చేశానని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్‌లో చూపించాలని సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎంలు లేఖలు రాయడం కొత్తమీకాదని వ్యాఖ్యానించారు. జగన్ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో విచారణ రాకుండా చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై చర్చ జరగాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు ఒక్కటేనని అరుణ్ కుమార్ తెలిపారు. -
పని చేయలేదని పనిపట్టారు..!
ప్రజాప్రతినిధి అంటే మన కోసం మనం ఎన్నుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన కోసం పనిచేయకపోతే.. తన పనితీరు మనకు నచ్చకపోతే.. ఏం చేస్తారు.. ఆ.. ఏముంది చేసేందుకు.. మన ఖర్మ అని నోరు మూసుకుని కూర్చోవడం తప్ప.. అనుకుంటాం కదా..! కానీ బొలీవియాలోని బ్యూనవెంచురా అనే మున్సిపాలిటీలో ప్రజలు మాత్రం అలా చేతులు ముడుచుకుని కూర్చోరు. ప్రజా సేవలో కాస్త అలసత్వం ప్రదర్శించినా నిలదీ యడమే కాదు.. వారికి తెలిసొచ్చేలా బుద్ధి చెబుతారు. అక్కడి మేయర్ జావియర్ డెల్గడో తన విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు తగిన శాస్తి చేశారు అక్కడి ప్రజలు. ఆ మేయర్ కాలును ఓ స్తంభానికి గంటపాటు కట్టేశారు. దీనివల్ల వారి అసంతృప్తి సదరు ప్రజాప్రతినిధికి తెలిసి మరుసటి రోజు నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడని వారి ఆశ. అక్కడ ప్రభుత్వం నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్లిన జావియర్‌కు అక్కడి జనం షాక్ ఇచ్చారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని, ప్రజలకు సేవ చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని జావియర్ చెబుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తమ ప్రజాప్రతినిధులు అందిస్తున్న సేవలతో అసంతృప్తి కనుక ఉంటే ప్రజలు ఇలా శిక్ష విధించవచ్చని అక్కడి రాజ్యాంగం కూడా హక్కును ప్రసాదించింది. -
ప్రజాప్రతినిధి భర్తా.. మజాకా..!
♦ వ్యవసాయశాఖ అధికారిని తిట్టిన వైనం ♦ గ్రామ సభ సమాచారం ఇవ్వలేదంటూ బెదిరింపులు గీసుకొండ(పరకాల): మండలంలోని ఓ ముఖ్య మహిళా ప్రజాప్రతినిధి భర్త, టీఆర్ఎస్ నాయకుడు. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా మండలంలోని వ్యవసాయశాఖలో పనిచేసే ఓ ఆధికారిపై బూతు పురాణం అందుకున్న సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం రాత్రి వ్యవసాయశాఖ అధికారి మొబైల్‌కు కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకోగానే తప్పతాగిన మైకంలో ఉన్న సదరు మహిళా ప్రజాప్రతినిధి భర్త ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయాడు. తల్లి, చెల్లి..భార్య.. అని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడాడు. మండలంలో రైతు సమితుల ఏర్పాటు కార్యక్రమాల వివరాలను తనకు చెప్పడం లేదని, సబ్సిడీ ట్రాక్టర్ల విషయంలోనూ తనను లెక్కలోకి తీసుకోవడం లేదంటూ.. అంతా ఎమ్మెల్యే చెప్పినట్లే వింటున్నావంటూ దుర్భాషలాడాడు. దీంతో మనస్థాపం చెందిన సదరు అధికారి విషయాన్ని వ్యవసాయ అధికారుల సంఘం ప్రతినిధులకు చెప్పుకున్నట్లు సమాచారం. వారంతా కలిసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌ను కలిసి విన్నవించడానికి సోమవారం వెళ్లగా ఆయన గ్రీవెన్స్ డే సందర్భంగా బిజీగా ఉండటంతో వీలు కాలేదని తెలుస్తోంది. త్వరలోనే కలెక్టర్‌ను కలిసి సదరు నాయకుడిపై ఫిర్యాదు చేయనున్నటుల సమాచారం. సదరు వ్యవసాయ అధికారి తనకు జరిగిన అవమానాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి రెండు రోజుల క్రితమే తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఏఓను బెదిరించిన గీసుకొండ ఎంపీపీ భర్తపై చర్య తీసుకోవాలి హన్మకొండ: గీసుకొండ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ను బెదిరిం చిన గీసుకొండ ఎంపీపీ భర్త రాజయ్యపై చర్య తీసుకోవాలని వ్యవసాయ అధికా రుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. రైతు సమన్వయ సమితిల ఏర్పాటుతో ఏ విధమైన సంబంధం లేని వారు వ్యవసాయ అధికారులు వి«ధులకు అటంకం కల్పిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడాన్ని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె.అవినాష్‌వర్మ, నాయకులు సురేష్‌కుమార్, బి.రాంజీ, కె.నగేష్, విజయ్‌చంద్ర, ఎన్.శ్రీధర్ ఒక ప్రకటనలో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సామూహిక సెలవులో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, రక్షణ లేని, ఆత్మగౌరవానికి భంగం కలిగే చోట విధులు నిర్వహించలేమని స్పష్టం చేశారు. -
కలసికట్టుగా పనిచేద్దాం
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం అధికారులకు ఎమ్మెల్యే పిలుపు తిరుచానూరు : ప్రజల అభివృద్ధి కోసం అందరం కలసికట్టుగా పనిచేద్దామని, రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో(ఎంపీడీవోలు మినహా) పరిచయ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శిల్పారామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్ధేశించి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కసి, పట్టుదల తనలో ఉన్నాయన్నారు. ఆ సంకల్పంతోనే మంచి కార్యక్రమాలు, మేలైన కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు తాను ఎప్పటికీ ముందుంటానన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్రఅధికారులదేనన్నారు. అధికారులు-ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో జెడ్పీటీసీ సభ్యుడిగా, తుడా చైర్మన్‌గా, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎందరో ఐఏఎస్, ఇతర అధికారులతో కలిసి పనిచేశానన్నారు. తాను ఎప్పుడూ ఏ అధికారితోనూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయించలేదన్నారు. తుడా చైర్మన్‌గా దీర్ఘకాలంగా 3 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి తానేనని, పదవీకాలం ముగిసే రోజున ప్రజలు, అన్ని పార్టీల నాయకులతో పత్రికా ప్రతినిధుల సమక్షంలో ప్రజావేదిక ఏ ర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారులతో పనిచేయించుకోనని, అధికారులు సైతం ఏ వ్యక్తికో, రాజకీయ పార్టీకో తలొగ్గి పనిచేయకూడదని పిలుపునిచ్చారు. తన మాట కఠినంగా, వ్యవహారశైలి ఆవేశంగా ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా తాను కర్మసిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తినని, పాపభీతి కలిగిన వాడినని అన్నారు. తాను పల్లెలో పుట్టి పెరిగానని, పల్లె కష్టాలు తనకు తెలుసన్నారు. చదువుకునే సమయంలో మెటల్ రోడ్డులో కాలికి చెప్పులు లేకుండా కాలినడకన పాఠశాలకు వెళ్లిన క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు కష్టపడి చదవడంతోనే అధికారులైన మీరు, తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. పైరవీలతో తాను ఈస్థాయికి ఎదగలేదన్నారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామాలు అభివృద్ధి సాధించినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు అందరం కలసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన అధికారులు ఇదివరకు భాస్కర్‌రెడ్డి అంటే ఒకలా ఆలోచించామని, ఇప్పుడు మీతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజాభివృద్ధికి కలసి పనిచేస్తామని ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు.