ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవీ స్వీకారం రోజున చేసే ప్రమాణాలకు కట్టుబడి ప్రజలకు కుల మతాలకు అతీతంగా సేవలు చేయాలి. బాధ్యతలూ నిర్వర్తించాల్సి ఉంటుంది. రాగద్వేషాలకు అతీతంగా వారు ఉండి తీరాల్సిందే. ఏ ఒక్కరిపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు సైతం చేయకూడదు. అలా చేస్తే రాజ్యాంగాన్ని ధిక్కరించిన వారు అవుతారు.
ఇటీవల ఒక ప్రజా ప్రతినిధి ఒక కులాన్ని ఉద్దేశపూర్వకంగా దూషించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆ ప్రజాప్రతినిధి అలా మాట్లాడవచ్చా? ఎవరో ఏదో చేశారని మొత్తం ఆ కులాన్ని టార్గెట్ చేయడం విస్మయం కలిగిస్తున్నది. ఈ విధానాన్ని అన్ని రాజకీయ పక్షాలూ ముక్తకంఠంతో ఖండించాలి. అప్పుడే ఇలాంటి వారి వైఖరిలో మార్పు వస్తుంది.
ఓ సామాజిక వర్గానికి చెందిన నేత 10 ఏండ్లు పాలించిన మాత్రాన ఆయనపై కోపంతో ఈ ప్రజాప్రతినిధి ఆ నేత కులస్థుల నందరినీ దూషించడం భావ్యమేనా? ఈ ప్రజాప్రతినిధి సొంత పార్టీలో కూడా ఆయన తిట్టిన సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ నేతలకు కూడా ఈ సంబోధన వర్తిస్తుందా అనేది స్పష్టం చేయాలి.
అదే పార్టీకి చెందిన పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి విషయంలో కూడా ఆయన అభిప్రాయం ఇదే అయితే పార్టీని, పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టినట్టే కదా! ఈ విషయంలో వెంటనే స్పందించి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆ ప్రజాప్రతినిధిని వివరణ ఇవ్వాలని ఆదేశించడం శుభపరిణామం. అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠం కావాలని కోరుకోవడం ఎంతైనా అవసరం.
అన్ని కులాలు, జాతుల వారితోపాటు చివరకు ఆయన దూషించిన కులం వారు కూడా ఆయనకు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది? ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకూ ఆయనే కదా ప్రజాప్రతినిధి! అలాంటిది ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగడం దేనికి సంకేతం? ఇదేనా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు. ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఆ ఒక్క కులాన్నే కాదు... ఏ కులాన్ని దూషించే హక్కూ ఎవరికీ లేదు. ఇలా చేస్తే రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం లేనట్టే లెక్క. గౌరవం ఉన్న వారు ఇలా ప్రవర్తించరు.
కులాలపై దూషణలకు దిగినా, ద్వేషించినా అన్ని రాజకీయ పార్టీలూ అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విధమైన సంస్కృతిని ఎవరూ ప్రోత్సహించవద్దు. ఎవరైనా ప్రోత్సహించినా తగిన శాస్తి చేయాలి. ప్రజల్లో హీరోయిజం చూపించేందుకు ఇలాంటి మార్గాన్ని ఎన్నుకోవడం దుందుడుకు చర్య అవుతుంది.
అరవై, డెబ్భై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీతో అత్యంత అనుబంధం ఉన్న ఆ కులానికి చెందిన నేతలు పెద్ద పెద్ద హోదాల్లో పని చేశారు. కులరహితంగా సేవలందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా నిత్యం పాటుపడ్డారు. కులాలను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. అందరికీ తోడుగా, నీడగా వ్యవహరించారు. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భరోసా కల్పించేవారు. దేశం, తెలంగాణ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు.
అదే విధంగా మరో జాతీయ పార్టీలో ఆ కులానికి చెందిన నేతలకు ప్రజాప్రతినిధులుగా, గవర్నర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఏతావతా చెప్పొచ్చేదేమిటంటే... అన్ని పార్టీల్లోనూ ఈ కులస్థులు ఉన్నారనే! ఈ ఇంగితాన్ని మరచి ఒక నేత పట్ల ఉన్న ఆక్రోశంతో అతడి కులస్థుల నందరినీ తిట్టి బాధపడేలా చేయడం సరికాదు కదా! మొత్తం రాజకీయ వాతావరణమే ఈ చర్యతో దెబ్బతిన్నదనేది వాస్తవం.
కుల సంఘాల వారు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండి, రాజ్యాంగబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడడం మంచి పద్ధతి. అలా కాకుండా సోషల్ మీడియా వేదికలపై ఒకరి కులాన్ని మరో కులంవారు తిడుతూ రెచ్చగొట్టుకోవడం సరికాదు. ఈ విషయంలో అందరూ సంయమనాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తెచ్చి, తమ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ప్రజాప్రతినిధులపైన ఆ పార్టీ పెద్దలు చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయడం సరైన మార్గం. ప్రజల చేత ఎన్నికై, ప్రజల కోసం పని చేసే నేతలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.
వెలమ జాతి ఒక్కరి సొత్తు కాదు. వారు ఒక్కరి దిక్కు ఒరిగి లేరు. నిజానికి ఆ కులాన్ని తిట్టిన ప్రజాప్రతినిధి పార్టీలోనే ఎక్కువ మంది వెలమలు ఉన్నారు అనే విషయం మరిచిపోకూడదు. గత ఏడు దశాబ్దాలుగా వారు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నమాట జగమెరిగిన సత్యం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఈ దూషణతో వ్యక్తిగతంగా దిగజారుతూ, పార్టీకి కూడా ఆయన చేసిన పాపం అంటగట్టడం ఎందుకు?
దేశానికి ఆపద వస్తే కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పార్టీల మధ్య ఎన్ని వైరుద్ధ్యాలు ఉన్నా భారతీయులందరూ దేశ రక్షణ, అభివృద్ధిలో ఏకతాటిపై ఉండడం సహజం. ఇది మన లక్ష్యం. ఈ విషయంలో అది తెలంగాణ అయినా, మన సొంత జిల్లా అయినా, పక్క జిల్లా అయినా అక్కడ ప్రజలు ఆపదలో ఉంటే కులమతాలకు అతీతంగా ఆదుకొని తీరుతాం.
సమాజంలో మనుషులంతా సమానమే. కులాలు వేరు వేరు ఉంటాయి. ఆ కులంలో పుట్టాం... ఈ కులంలో పుట్టాం... అని చింతించుకుంటూ పోతే లాభం లేదు. ఒక చిన్న కులంలో పుట్టడం నేరం కాదు. పెద్ద కులంలో పుట్టానని పొంగిపోవడం మంచిది కాదు. ఒక కులంపై విద్వేషం చిమ్మే విధంగా మరొకరు మాట్లాడడం భావ్యం కూడా కాదు. అసలు కుల ప్రస్తావన తేవడం నేరం కిందకే వస్తుంది. కులం పేరిట దూషిస్తూ స్వలాభం పొందడం రోతపుట్టిస్తుంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సర్కారు కులగణనను ఓ వైపు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాప్రతినిధి ఓ కులంపై విషం చిమ్మడం దారుణం. అసలు కులగణన ఎందుకు జరిపిస్తున్నారన్న ఎరుక ఈ ప్రజాప్రతినిధికి ఉందా? వివిధ కులాల వారు ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారి వారి జనాభాల నిష్పత్తుల ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికే కదా! అంటే అన్ని కులాలనూ సమానదృష్టితో చూడడానికే కదా!
మరి ఈ ప్రజాప్రతినిధి ఒక కులంపై ఇంత దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సభ్యసమాజంపై ఉంది. ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలూ, పౌర సమాజం మొత్తం ఇది అర్థం చేసుకొని వ్యవహరించాలి. అప్పుడే సమాజ శ్రేయస్సుకు తోడ్పాటు అందించిన వారు అవుతారు. లేకపోతే సమాజానికే ప్రమాదం.
వ్యాసకర్త కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ‘ 9849061481
వెలిచాల రాజేందర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment