ప్రజాప్రతినిధి భర్తా.. మజాకా..!
♦ వ్యవసాయశాఖ అధికారిని తిట్టిన వైనం
♦ గ్రామ సభ సమాచారం ఇవ్వలేదంటూ బెదిరింపులు
గీసుకొండ(పరకాల): మండలంలోని ఓ ముఖ్య మహిళా ప్రజాప్రతినిధి భర్త, టీఆర్‌ఎస్ నాయకుడు. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా మండలంలోని వ్యవసాయశాఖలో పనిచేసే ఓ ఆధికారిపై బూతు పురాణం అందుకున్న సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం రాత్రి వ్యవసాయశాఖ అధికారి మొబైల్‌కు కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకోగానే తప్పతాగిన మైకంలో ఉన్న సదరు మహిళా ప్రజాప్రతినిధి భర్త ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయాడు. తల్లి, చెల్లి..భార్య.. అని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడాడు.
మండలంలో రైతు సమితుల ఏర్పాటు కార్యక్రమాల వివరాలను తనకు చెప్పడం లేదని, సబ్సిడీ ట్రాక్టర్ల విషయంలోనూ తనను లెక్కలోకి తీసుకోవడం లేదంటూ.. అంతా ఎమ్మెల్యే చెప్పినట్లే వింటున్నావంటూ దుర్భాషలాడాడు. దీంతో మనస్థాపం చెందిన సదరు అధికారి విషయాన్ని వ్యవసాయ అధికారుల సంఘం ప్రతినిధులకు చెప్పుకున్నట్లు సమాచారం. వారంతా కలిసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌ను కలిసి విన్నవించడానికి సోమవారం వెళ్లగా ఆయన గ్రీవెన్స్ డే సందర్భంగా బిజీగా ఉండటంతో వీలు కాలేదని తెలుస్తోంది. త్వరలోనే కలెక్టర్‌ను కలిసి సదరు నాయకుడిపై ఫిర్యాదు చేయనున్నటుల సమాచారం. సదరు వ్యవసాయ అధికారి తనకు జరిగిన అవమానాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి రెండు రోజుల క్రితమే తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
ఏఓను బెదిరించిన గీసుకొండ ఎంపీపీ భర్తపై చర్య తీసుకోవాలి
హన్మకొండ: గీసుకొండ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ను బెదిరిం చిన గీసుకొండ ఎంపీపీ భర్త రాజయ్యపై చర్య తీసుకోవాలని వ్యవసాయ అధికా రుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. రైతు సమన్వయ సమితిల ఏర్పాటుతో ఏ విధమైన సంబంధం లేని వారు వ్యవసాయ అధికారులు వి«ధులకు అటంకం కల్పిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడాన్ని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె.అవినాష్‌వర్మ, నాయకులు సురేష్‌కుమార్, బి.రాంజీ, కె.నగేష్, విజయ్‌చంద్ర, ఎన్.శ్రీధర్ ఒక ప్రకటనలో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సామూహిక సెలవులో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, రక్షణ లేని, ఆత్మగౌరవానికి భంగం కలిగే చోట విధులు నిర్వహించలేమని స్పష్టం చేశారు.