న్యాయవ్యవస్థా కట్టుబడి ఉండాల్సిందే
♦ అధికారాల విభజనపై లోక్‌సభలో న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్
♦ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం కష్టమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: అధికారాల విభజనకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఇతర ప్రజాస్వామిక మూల స్తంభాలకు నిర్దేశించిన విధంగానే న్యాయవ్యవస్థకు అధికారాలు నిర్దేశించారని కేంద్ర న్యాయ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌సభలో పేర్కొన్నారు. పలు తీర్పుల ద్వారా సుప్రీం కోర్టు, శాసనవ్యవస్థ పరిధిలోకి అడుగుపెడు తోందని పలువురు సభ్యులు పేర్కొనడంపై ఆయన పైవిధంగా స్పందించారు. జడ్జీల నియామకాలపై నెలకొన్న వివాదంపై స్పందిస్తూ... అణ్వస్త్రాలను ప్రయోగించే విషయంలో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, సీవీసీ నియామకాల్లోనూ ప్రధానిపై విశ్వాసం ఉన్నప్పుడు న్యాయమూ ర్తులను నియమించే విషయంలో ఎందుకు ఉండదని మంత్రి ప్రశ్నించారు.
ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలో ఉన్నారు. క్రికెట్ నిర్వహణ నుంచి మెడికల్ ప్రవేశ పరీక్షల వరకూ వివిధ అంశాల్లో సుప్రీంకోర్టు, శాసన వ్యవస్థ పరిధిలోకి జోక్యం చేసుకుంటోందని బీజేపీ సభ్యుడు సంజయ్ జైశ్వాల్ పేర్కొన్నారు. నీట్ ఎంట్రన్స్, క్రికెట్ నిర్వహణ అంశాల్లో కోర్టు తీర్పులపై స్పందించేందుకు మంత్రి నిరాకరించారు.
ప్రత్యక్ష ప్రసారాలు కష్టం: కోర్టు ప్రొసీడిం గ్స్‌ను లైవ్ టెలికాస్ట్ చేసే అంశంపై స్పందిస్తూ.. రెండు సభలే ఉన్నందున లోక్‌సభ, రాజ్యసభ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారాలు అందించడం సులభమమని, అయితే దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో ఉన్న న్యాయస్థానాల్లో ఇది కష్టమన్నారు. అయితే సభ్యుల సూచన పరిశీలించదగినదని పేర్కొ న్నారు. హైక్టోరుల్లో పెండెన్సీ కమిటీలపై సభ్యులు ప్రశ్నించగా.. కోర్టు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని సమాధాన మిచ్చారు. తన దృష్టిలో పార్లమెంటు సుప్రీం అని, అయితే చట్టాలను పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపిందని, అయితే దీన్ని కోర్టు కొట్టివేసిందని చెప్పారు.
పూర్తయిన బడ్జెట్ ప్రక్రియ: లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదం పొందడంతో 2017 – 18 ఏడాది బడ్జెట్ ప్రక్రియ పూర్తయింది. ప్రతి పక్షాలు కాంగ్రెస్, బీజేడీ వాకౌట్ చేయడంతో 40సవరణలు చేసిన ఈ బిల్లు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆర్థిక బిల్లుకు చేసిన సవరణల్లో...ఏప్రిల్ 1 నుంచి నగదు లావాదేవీలను రూ.2 లక్షలకు పరిమితం చేయడం, పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం లాంటివి ఉన్నాయి.