చుండూరు కేసులో దోషులెవరు?
ఎమ్మెల్సీ లక్ష్మణరావు
చుండూరు: చుండూరు కేసులో దళితులను చంపిన దోషులెవరో న్యాయవ్యవస్థ తెలిపాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో చుండూరు రక్తక్షేత్రం నుంచి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుండూరు కేసు తీర్పులో రాష్ట్ర హైకోర్టు తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ కేసులోని ముద్దాయిలందరూ నిర్దోషులైతే మరి దోషులెవరో తెలపాలని డిమాండ్‌చేశారు. పాదయాత్ర ద్వారా న్యాయవ్యవస్థకు కనువిప్పు కలిగించి సుప్రీంకోర్టులో సంఘటితంగా పోరాడాలన్నారు. కుల వివక్షపోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు డి.రమాదేవి మాట్లాడుతూ దళితుల కేసుల్లో అగ్రవర్ణ జడ్జీలను నియమించి అన్యాయమైన తీర్పులు ఇచ్చారన్నారు. కేసును వేరొక బెంచ్‌కి మార్చమని కోరితే కోర్టు ధిక్కారం కేసులతో బాధితులను, బాధితుల తరపు న్యాయవాదులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నార. చుండూరు దళిత బాధిత పోరాట కమిటీ కన్వీనర్ జాలాది మోజెస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు తెలేవరకు రాష్ట్ర హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్టే కోరాలన్నారు.
ముందుగా రక్త క్షేత్రంలోని మృతవీరుల సమాధులపై పూలమాలలతో నివాళులర్పించిన నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ కళాజాత బృందాలతో అంబేద్కర్‌నగర్‌లోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర చేపట్టి అమృత లూరు మండలంలోకి ప్రవేశించారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రత్నాకర్, కెవీపిఎస్ నేతలు జాలా అంజయ్య, తురుమెళ్ల కృష్ణమోహన్, అంబేద్కర్ నగర్ సర్పంచ్ పెరిశమ్మ, జాలాది రూబేన్, పాశం రామారావు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. చుండూరు సీఐ కళ్యాణ్‌రాజ్ ప్రత్యేక పోలీస్ బలగాలతో బందోబస్తు నిర్వహించారు.