Chunduru Case
-
చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో నిందితులకు ఉన్నత న్యాయస్థానం బుధవారం నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు 6న జరిగిన దళితులను అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఊచకోత తోసిన విషయం తెల్సిందే. దీనిపై చుండూరు కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇరవై మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ 2014 ఏప్రిల్ 22వ తేదీన హైకోర్టు తీర్చునిచ్చింది. కాగా ఆ తీర్పును పలువురు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో హత్య కేసు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, మృతుల బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను జరిపిన సుప్రీంకోర్టు ...దిగువ కోర్టు ఇచ్చిన విచారణపై స్టే విధించటంతో పాటు నిందితులకు నోటీసులు ఇచ్చింది. కాగా దళితుల ఊచకోత ఘటనపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొంటూ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. శిక్ష పడినవారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. మరోవైపు నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
న్యాయ వ్యవస్థకే మచ్చ
చుండూరు తీర్పుపై లెఫ్ట్, ప్రజా సంఘాల ఆగ్రహం ఉభయ రాష్ట్రాలలో ధర్నాలు, ర్యాలీలు ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలి: రాఘవులు న్యాయంకోసం జైలుకైనా వెళ్తా: నారాయణ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారించాలి: బొజ్జా తారకం హైదరాబాద్: చుండూరు కేసులో హైకోర్టు తీర్పును నిరసిస్తూ వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు సోమవారం ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. ఉభయ రాష్ట్రాల లోని జిల్లా, మండల కేంద్రాలలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా యి. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు వినతి పత్రాలు అందజేశాయి. ఉమ్మడి రాష్ట్ర రాజధాని లోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుం టూరు, విశాఖ, అనంతపురం, కర్నూలుజిల్లా కేంద్ర కార్యాలయాల వద్ద వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీ నాయకత్వంలో ఉభయ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. చుండూరు కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థకే మాయని మచ్చని నినదించాయి. ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే ఎనిమిది మంది దళితుల్ని చంపింది ఎవరని ప్రశ్నించాయి. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు అజీజ్ పాషా, రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, పీజే చంద్రశేఖర్, సీపీఎం రాష్ట్ర నేతలు విల్సన్, వెంకట్ తదితరులు ప్రసంగించారు. విజయవాడలో జరిగిన ర్యాలీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తిరుపతిలో కె.నారాయణ, గుంటూరులో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, రాజమండ్రిలో మీసాల సత్యనారాయణ, విశాఖలో వి.సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నిందితులందర్నీ వదిలేయడం దుర్మార్గం చుండూరు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సుప్రీంకోర్టులో ప్రత్యేక బెంచ్ ద్వారా కేసు విచారణ జరిగేలా చూడాలని రాఘవులు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో సామాజిక న్యాయం, విలువలు కలిగిన జడ్జిలను నియమించకపోతే అన్యాయం జరిగే అవకాశం ఉందని వారీ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చుండూరు కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ప్రత్యక్ష సాక్షుల వాదనలు విని తీర్పునిస్తే హైకోర్టు నిందితుందర్నీ వదిలివేయడం దుర్మార్గమన్నారు. ఈ తీర్పు సామాజిక న్యాయసూత్రాలకు విరుద్ధమని విమర్శిం చారు. చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం మాట్లాడుతూ... 1991 ఆగస్టు ఆరున గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితులను అగ్రవర్ణాల వారు ఊచకొత కోశారని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు తీర్పు ఏమాత్రం హేతుబద్ధం కాదన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకోకుంటే ఎలా? అని ప్రశ్నించారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారించాలని డిమాండ్ చేశారు. ఒక న్యాయస్థానం అంగీకరించిన సాక్ష్యాలను నమ్మలేమని ఉన్నత న్యాయస్థానాలే తీర్పు ఇస్తే ఇక బడుగు, బలహీనవర్గాలకు దిక్కెవరని చాడా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థకే మాయని మచ్చని కె.నారాయణ అభిప్రాయపడ్డారు. చుండూరు దళితుల కోసం చేపట్టే న్యాయపోరాటంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధమని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనలలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పీఓడబ్ల్యు సంధ్య, కులవివక్ష పోరాట సమితి ప్రతినిధి సాగర్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, కార్యదర్శి మురళీకృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు బోయిని ఎల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
చుండూరు కేసులో దోషులెవరు?
ఎమ్మెల్సీ లక్ష్మణరావు చుండూరు: చుండూరు కేసులో దళితులను చంపిన దోషులెవరో న్యాయవ్యవస్థ తెలిపాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో చుండూరు రక్తక్షేత్రం నుంచి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుండూరు కేసు తీర్పులో రాష్ట్ర హైకోర్టు తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ కేసులోని ముద్దాయిలందరూ నిర్దోషులైతే మరి దోషులెవరో తెలపాలని డిమాండ్‌చేశారు. పాదయాత్ర ద్వారా న్యాయవ్యవస్థకు కనువిప్పు కలిగించి సుప్రీంకోర్టులో సంఘటితంగా పోరాడాలన్నారు. కుల వివక్షపోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు డి.రమాదేవి మాట్లాడుతూ దళితుల కేసుల్లో అగ్రవర్ణ జడ్జీలను నియమించి అన్యాయమైన తీర్పులు ఇచ్చారన్నారు. కేసును వేరొక బెంచ్‌కి మార్చమని కోరితే కోర్టు ధిక్కారం కేసులతో బాధితులను, బాధితుల తరపు న్యాయవాదులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నార. చుండూరు దళిత బాధిత పోరాట కమిటీ కన్వీనర్ జాలాది మోజెస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు తెలేవరకు రాష్ట్ర హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్టే కోరాలన్నారు. ముందుగా రక్త క్షేత్రంలోని మృతవీరుల సమాధులపై పూలమాలలతో నివాళులర్పించిన నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. ఎస్ఎఫ్ఐ కళాజాత బృందాలతో అంబేద్కర్‌నగర్‌లోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర చేపట్టి అమృత లూరు మండలంలోకి ప్రవేశించారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రత్నాకర్, కెవీపిఎస్ నేతలు జాలా అంజయ్య, తురుమెళ్ల కృష్ణమోహన్, అంబేద్కర్ నగర్ సర్పంచ్ పెరిశమ్మ, జాలాది రూబేన్, పాశం రామారావు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. చుండూరు సీఐ కళ్యాణ్‌రాజ్ ప్రత్యేక పోలీస్ బలగాలతో బందోబస్తు నిర్వహించారు. -
చుండూరు తీర్పుపై ప్రజా సంఘాల ఆగ్రహం
ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో దళితులను ఊచకోత కోసిన ఘటనలో హైకోర్టు నిందితులను నిర్దోషులుగా తేల్చి తీర్పు చెప్పడాన్ని నిరసిస్తూ బుధవారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలు ప్రజా, దళిత సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. చుండూరు నేరస్తులను నిర్దోషులుగా ఎలా నిర్ధ్దారిస్తారని ప్రశ్నించారు. విరసం నాయకులు వరవరరావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షులు వేదకుమార్, కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహేశ్వర్‌రాజ్, అరుణోదయ రామారావు, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా నాయకులు నారాయణరావు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ 23 ఏళ్ల క్రితం చుండూరు దళిత వాడలో అగ్రకుల దురహంకారులు 8 మంది దళితులను ఊచకోత కోసిన ఘటన హైకోర్టుకు చాలా చిన్న విషయంగా కన్పించడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సాక్ష్యాధారాలు లేవని దళితులను హత్య చేసిన వారిని నిర్దోషులుగా తేల్చడం దారుణమన్నారు. నిందితులు నిర్దోషులైతే దళితులను హత్య చేసింది ఎవరని ప్రశ్నించారు. ఈ తీర్పు దళితులకు కోర్టులపై నమ్మకం కలిగించేలా లేదన్నారు. తీర్పుపై ‘సుప్రీం’లో అప్పీల్ వేయండి చుండూరులో దళితుల ఊచకోత కేసులో నిందితులకు దిగువ కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు తగు న్యాయం జరిగేలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.మధు ఒక ప్రకటనలో కోరారు. న్యాయం కోసం బాధితులు, దళిత, ప్రజా సంఘాలు చేసే కృషికి పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. కాగా, చుండూరు కేసులో తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న మరో ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిందితులు జైలు నుంచి విడుదల చుండూరు హత్యాకాండలో నిందితులుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిని కోర్టు ఉత్తర్వుల మేరకు బుధవారం విడుదల చేశారు. వీరిలో నలుగురు ఖైదీలు వ్యవసాయ క్షేత్రం (ఓపెన్ ఎయిర్ జైలు) నుంచి విడుదలయ్యారు. మరో ఖైదీ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. వీరందరూ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 2007లో ‘చర్లపల్లి’కి వచ్చారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి: వీకే సింగ్ చుండూరు ఉదంతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థలోనూ సంస్కరణలు అమలుకావాల్సిన విషయాన్ని పునరుద్ఘాటించిందని సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీసు శాఖ సమన్వయ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్ సింగ్ (వీకే సింగ్) తెలిపారు. తాను రాసిన ‘ఈజ్ ఇట్ పోలీస్? కన్ఫెషన్స్ ఆఫ్ ఎ టాప్ కాప్’ పుస్తకంలోనూ ఈ అంశాన్ని వివరించానని బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చెప్పారు. ‘‘అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర డబ్బుంటేమంచి న్యాయవాదుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా సాక్ష్యాధారాలపై పైచేయి సాధించడంతోపాటు విచారణ ప్రక్రియ ఏళ్లు కొనసాగేలానూ చేయవచ్చు. హత్య వంటి తీవ్రమైన నేరాల నుంచీ బయటపడొచ్చు. 21 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు ఉదంతంలో పోలీసులతోపాటు జిల్లా, సెషన్స్ కోర్టులు నిందితులను దోషులుగా నిర్ధారించాయి. హైకోర్టు మాత్రం నిందితులంతా నిర్దోషులని తేల్చింది. ఈ ఉదంతంలో సుదీర్ఘకాలం ఎదురు చూసిన నిరుపేద దళితులకు న్యాయం జరగలేదు. డబ్బు లేని వాళ్లు మాత్రమే జైళ్లకు వెళతారని, మీడియా ప్రభావం వల్ల ధనికుల్లో కొద్దిమందే జైలుకు వెళ్తున్నారనే విషయాన్ని నా పుస్తకంలో ప్రస్తావించా. ఇప్పటికైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు రాకుంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయి. అధికార యంత్రాంగాల చేతిలో పోలీసులు పావులుగా మారడంతో సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షే అవుతోంది. రాజకీయపక్షాలు ఈ సంస్కరణల్నే తమ ప్రధాన డిమాండ్‌గా మార్చుకోవాలి. మేధావి వర్గం, మీడియా సైతం ఆ కోణంలో కృషి చేయాలి. చుండూరు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ‘ఈజ్ ఇట్ పోలీస్?’ పుస్తకంలో ఉన్న అంశాలను ప్రస్పుటం చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.