న్యాయ వ్యవస్థకే మచ్చ
చుండూరు తీర్పుపై లెఫ్ట్, ప్రజా సంఘాల ఆగ్రహం
ఉభయ రాష్ట్రాలలో ధర్నాలు, ర్యాలీలు
ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలి: రాఘవులు
న్యాయంకోసం జైలుకైనా వెళ్తా: నారాయణ
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారించాలి: బొజ్జా తారకం
హైదరాబాద్: చుండూరు కేసులో హైకోర్టు తీర్పును నిరసిస్తూ వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు సోమవారం ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. ఉభయ రాష్ట్రాల లోని జిల్లా, మండల కేంద్రాలలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా యి. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు వినతి పత్రాలు అందజేశాయి. ఉమ్మడి రాష్ట్ర రాజధాని లోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుం టూరు, విశాఖ, అనంతపురం, కర్నూలుజిల్లా కేంద్ర కార్యాలయాల వద్ద వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీ నాయకత్వంలో ఉభయ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. చుండూరు కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థకే మాయని మచ్చని నినదించాయి. ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే ఎనిమిది మంది దళితుల్ని చంపింది ఎవరని ప్రశ్నించాయి. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు అజీజ్ పాషా, రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, పీజే చంద్రశేఖర్, సీపీఎం రాష్ట్ర నేతలు విల్సన్, వెంకట్ తదితరులు ప్రసంగించారు. విజయవాడలో జరిగిన ర్యాలీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తిరుపతిలో కె.నారాయణ, గుంటూరులో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, రాజమండ్రిలో మీసాల సత్యనారాయణ, విశాఖలో వి.సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
నిందితులందర్నీ వదిలేయడం దుర్మార్గం
చుండూరు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సుప్రీంకోర్టులో ప్రత్యేక బెంచ్ ద్వారా కేసు విచారణ జరిగేలా చూడాలని రాఘవులు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో సామాజిక న్యాయం, విలువలు కలిగిన జడ్జిలను నియమించకపోతే అన్యాయం జరిగే అవకాశం ఉందని వారీ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చుండూరు కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ప్రత్యక్ష సాక్షుల వాదనలు విని తీర్పునిస్తే హైకోర్టు నిందితుందర్నీ వదిలివేయడం దుర్మార్గమన్నారు. ఈ తీర్పు సామాజిక న్యాయసూత్రాలకు విరుద్ధమని విమర్శిం చారు. చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం మాట్లాడుతూ... 1991 ఆగస్టు ఆరున గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితులను అగ్రవర్ణాల వారు ఊచకొత కోశారని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు తీర్పు ఏమాత్రం హేతుబద్ధం కాదన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకోకుంటే ఎలా? అని ప్రశ్నించారు.
నిందితులను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారించాలని డిమాండ్ చేశారు. ఒక న్యాయస్థానం అంగీకరించిన సాక్ష్యాలను నమ్మలేమని ఉన్నత న్యాయస్థానాలే తీర్పు ఇస్తే ఇక బడుగు, బలహీనవర్గాలకు దిక్కెవరని చాడా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థకే మాయని మచ్చని కె.నారాయణ అభిప్రాయపడ్డారు. చుండూరు దళితుల కోసం చేపట్టే న్యాయపోరాటంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధమని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనలలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పీఓడబ్ల్యు సంధ్య, కులవివక్ష పోరాట సమితి ప్రతినిధి సాగర్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, కార్యదర్శి మురళీకృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు బోయిని ఎల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.