న్యాయస్థానం మూడో సభ కాకూడదు | VVR Krishnam Raju Article On Indian Judiciary | Sakshi
Sakshi News home page

న్యాయస్థానం మూడో సభ కాకూడదు

Published Thu, Oct 1 2020 12:57 AM | Last Updated on Thu, Oct 1 2020 12:57 AM

VVR Krishnam Raju Article On Indian Judiciary - Sakshi

ఇటీవల దేశ న్యాయస్థానాలు సంచలన తీర్పులు, ఆశ్చర్యకరమైన ఆదేశాలు, కటువైన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ప్రపంచ న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2018 జనవరి 12వ తేదీన నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ దేశ న్యాయవ్యవస్థ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. రెండేళ్ళ తర్వాత దేశంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ పరిణామాలను పరిశీలిస్తే వారు చెప్పింది నిజమేననిపిస్తోంది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ కొంతకాలం క్రితం సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం మంది అవినీతిపరులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్‌ మరో ముందడుగు వేసి సుప్రీంకోర్టులోని ఎనిమిది మంది న్యాయమూర్తులు అవినీతిపరులని ఆరోపిస్తూ, వారి పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసి, ధైర్యం ఉంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాల్‌ విసిరారు. 2006 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ రమాపాల్, ‘‘ఉన్నత న్యాయస్థానాల్లోని వారు ఏడు రకాల పాపాలకు పాల్పడుతున్నారు. అవి సహచరుల అనైతిక ప్రవర్తనను పట్టించుకోకపోవడం, జడ్జీల నియామకంలో పారదర్శకత పాటించకపోవడం, గత తీర్పులను య«థాతథంగా కాపీ కొట్టడం, వ్యక్తిగతమైన అహంభావం, వృత్తిపరమైన అహంభావం, హిపోక్రసీ, ఆశ్రిత పక్షపాతం’’ అని వివరించారు.  
1950 జనవరి 28వ తేదీన భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ‘‘దేశ  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన పార్లమెంట్‌ విధులకు న్యాయస్థానాల తీర్పులు ఆటంకం కాకూడదు. న్యాయవ్యవస్థ పార్లమెంట్‌ ఉభయ సభలకు తోడుగా మూడో సభగా వ్యవహరించకూడదు’’ అని స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుంది.  మన దేశంలో భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలు
ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. ఆ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు కోర్టుల తీర్పులు, ఆదేశాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘పరిపాలనా వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వం అలా చేయాలి... ఇలా చేయకూడదు... అంటుంటే ఇక ఓట ర్లెందుకు? శాసన వ్యవస్థ ఎందుకు? ప్రభుత్వాలెందుకు?’ అని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం జూలై రెండో తేదీన మీడియాతో మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారంటే న్యాయ వ్యవస్థలో ఎక్కడో ఏదో లోపం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ ‘శాసన, కార్యనిర్వాహక విభాగాల పరిధిలోకి న్యాయస్థానాలు రాకుండా లక్ష్మణరేఖ గీసుకోవాలి’’ అని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే న్యాయం కోసం న్యాయవ్యవస్థపైనే ప్రజాప్రతి నిధులు పోరాటం చేస్తున్నారనిపిస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదు.

2010 మట్టూ ప్రియదర్శిని కేసులో సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ ఖట్జూ తీర్పునిస్తూ, ‘‘న్యాయ వ్యవస్థ స్వీయ నియంత్రణ పాటించాలి, సూపర్‌ లెజిస్లేచర్‌గా వ్యవహరించడానికి ప్రయత్నించకూడదు’’ అన్నారు. అమెరికన్‌ చరిత్రకారుడు ఆర్థర్‌ షెల్సింజర్‌ జూనియర్‌ 1947లో న్యాయమూర్తులు అత్యుత్సాహపరులు, ఆత్మనిగ్రహం పాటించి చట్టానికి లోబడి తీర్పులిచ్చేవారు, మధ్యేవాదులనే  మూడు రకాలుగా ఉంటారని పేర్కొన్నారు. అయితే రెండో వర్గమైన అత్యుత్సాహపరుల కారణంగానే భవిష్యత్‌లో రాజ్యాంగ సంక్షోభాలు, న్యాయశాఖ, శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని రాజ్యాంగ నిపుణులు గతంలోనే హెచ్చరించారు. 

అత్యవసర పరిస్థితిలో న్యాయవ్యవస్థ పాత్ర
1975 జూన్‌ 12వ తేదీన అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జగ్‌మోహన్‌ లాల్‌ సిన్హా ఇచ్చిన తీర్పు దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టడానికి పరోక్ష కారణమైందన్న విమర్శలు వచ్చాయి. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 518 సీట్లకు గానూ 352 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్‌నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేస్తూ గత ఎన్నికల్లో ఇందిర అనేక అవకతవకలకు పాల్పడినందున అమె ఎన్నికను రద్దు చేయాలని కోరారు. చేసిన అనేక ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోయారు. కోర్టు రెండు ఆరోపణల ఆధారంగా ఆమె ఎన్నిక చెల్లదని, ఆమె మరో ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పునిచ్చింది.

ఈ ఆరోపణల్లో ఒకటి అప్పటికే ప్రధానిగా ఉన్న ఇందిర తన ఎన్నికల ప్రచార సభకు వేదిక ఏర్పాటు చేయడానికి పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగిం చడం. యశ్‌పాల్‌ అనే ప్రభుత్వ ఉద్యోగిని తన ఎన్నికల అవసరాల కోసం వాడుకున్నారన్నది ఆమెపై మరో అభియోగం. అయితే 1975 జూన్‌ 24న జస్టిస్‌ కృçష్ణ అయ్యర్‌ ఆమె కొన్ని షరతులతో ప్రధానిగా కొనసాగవచ్చని తీర్పు ఇవ్వగా, 1975 నవంబర్‌ ఏడో తేదీన సుప్రీంకోర్టు బెంచ్‌ అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, ఇందిర నిర్దోషని పేర్కొంది. అయితే అలహాబాద్‌ హైకోర్టు తీర్పునే ఎగువ కోర్టు కూడా సమర్థించే ప్రమాదం ఉందనే భయంతో ఆమె 1975 జూన్‌ 26న దేశంలో అత్యవసర పరిస్థితి విధించి దేశప్రతిష్టను దెబ్బతీశారు. 

న్యాయ వ్యవస్థ అత్యుత్సాహం (జ్యుడీషియల్‌ యాక్టివిజం) అనే పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. నాయమూర్తులు రాగద్వేషాలకు, బంధు, మిత్ర ప్రీతికి, అహంకారాలకు అతీతంగా పూర్తి అవగాహనలతో తీర్పులు ఇస్తుం టారు. అయితే శాసన, కార్యనిర్వాహక విభాగాలతో న్యాయ విభాగం కూడా రాజ్యాంగానికి లోబడి చట్టాలు, నిబంధనల మేరకే విధులు నిర్వర్తించాలి. అవి తమతమ పరిధిలో ఉంటూ ఇతర వ్యవస్థలను తక్కువగా చూడకుండా ఉండాలి. లేకపోతే రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

వి.వి.ఆర్‌.కృష్ణంరాజు
వ్యాసకర్త ప్రెసిడెంట్, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌
మొబైల్‌ : 95052 92299

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement