
జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్
మన దేశంలో సాధారణ ప్రజానీకానికి న్యాయవ్యవస్థపై ఉన్నంత విశ్వాసం మరే వ్యవస్థపైనా లేదు.
మన దేశంలో సాధారణ ప్రజానీకానికి న్యాయవ్యవస్థపై ఉన్నంత విశ్వాసం మరే వ్యవస్థపైనా లేదు. తమ ఆచరణతో, సృజనాత్మకమైన తీర్పులతో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన న్యాయమూర్తులే అందుకు కారణం. అలాంటి అరుదైన న్యాయమూర్తుల్లో గురువారం కన్నుమూసిన జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ అగ్రగణ్యులు. గత నెలలో శత వసంతాలు పూర్తిచేసుకున్న జస్టిస్ కృష్ణయ్యర్ ఇంతలోనే కాలం చేస్తారని ఎవరూ అనుకోలేదు. వందేళ్ల నిండు జీవితంలో ఆయన పాత్ర బహుముఖీనమైనది. న్యాయవాదిగా, మంత్రిగా, సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా, క్రియాశీల కార్యకర్తగా, తాత్వికుడిగా, మానవహక్కుల ప్రేమికుడిగా... ఇలా ఎన్ని పాత్రలు పోషించినా వాటన్నిటికీ పీడిత జన పక్షపాతమే ఇరుసు. ఎన్నో వైరుధ్యాలతో, మరెన్నో అసమానతలతో నిండివుండే సమాజంలో భిన్న వర్గాల ప్రయోజనాల మధ్య సమన్వయాన్ని సాధించడం సామాన్యమైన విషయం కాదు. మన రాజ్యాంగం అలాంటి క్లిష్టమైన బాధ్యతను చాలామటుకు నెరవేర్చింది. అయితే, దాన్ని శిలాశాసనంగా మాత్రమే భావిస్తే...రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో విఫలమైతే కాలానుగుణంగా ఎదుర య్యే సమస్యలకు పరిష్కారం కనుగొనడం అసాధ్యమవుతుంది. సరిగ్గా ఇక్కడే జస్టిస్ కృష్ణయ్యర్ లాంటివారి అవసరం ఏర్పడుతుంది. ఆయన అసంఖ్యాకంగా వెలువరించిన తీర్పులైతేనేమి, రచించిన గ్రంథాలైతేనేమి, వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలైతేనేమి మన రాజ్యాంగాన్ని సుసంపన్నం చేశాయి. మన పాలనాయంత్రాంగం దుమ్ము దులిపాయి. మన న్యాయవ్యవస్థ ప్రతిష్టను ఆకాశపుటంచులకు తీసుకెళ్లాయి. కొత్త ఆలోచనలకు వెలుగుచూపాయి. అంతర్జాతీయంగా మన సుప్రీంకోర్టు గౌరవప్రపత్తులను ఇనుమడింపజేశాయి.
రిటైరైన తర్వాత వచ్చే పదవుల కోసం వెంపర్లాడి తమ కర్తవ్య నిర్వహణలో విఫలమవుతున్న వారెందరో ఉన్నారు. కానీ జస్టిస్ కృష్ణయ్యర్ ముక్కుసూటిగా వ్యవహరించడంలో, ఉన్నదున్నట్టు కుండబద్దలు కొట్టడంలో ఏనాడూ తడబడలేదు. లోక్‌సభకు తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపేయాలని కోరుతూ ఇందిరాగాంధీ దాఖలు చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు ఎన్నదగినది. ప్రధానిగా సభకు హాజరుకావొచ్చునని, అయితే తుది తీర్పు వెలువడే వరకూ సభలో జరిగే ఏ ఓటింగ్‌లోనూ పాల్గొనరాదని ఆయన విధించిన ఆంక్షలు ఆనాటి పాలకవర్గాన్ని నివ్వెరపరిచాయి. ఈ కేసు విచారణకు ముందు అప్పటి న్యాయశాఖ మంత్రి హెచ్‌ఆర్ గోఖలే కలవడానికి ప్రయత్నించినప్పుడు ‘వీలుపడద’ని నిష్కర్షగా చెప్పిన వ్యక్తిత్వం జస్టిస్ కృష్ణయ్యర్‌ది. వాస్తవానికి గోఖలే ఆయనకు వ్యక్తిగత మిత్రుడు. దేశంలోనే తొలిసారి కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో 1957లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందులో కృష్ణయ్యర్ న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి భూ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చారు. రాజకీయ రంగానికి స్వస్తిచెప్పి న్యాయరంగంలోకొచ్చాక కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఎన్నదగిన తీర్పులనిచ్చారు.
నిరుపేదలకు ఉచితంగా న్యాయసహాయం అందించాలని సిఫార్సు చేసింది ఆయన నేతృత్వంలోని అత్యున్నతస్థాయి సంఘమే. 1973లో దాన్ని అమలు చేయడం ప్రారంభించాక ప్రపంచంలో ఎన్నో దేశాలకు అది అనుసరణీయమైంది. జస్టిస్ కృష్ణయ్యర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన అనేక తీర్పులు రాజ్యాంగంపట్ల అప్పటివరకూ ఉండే మౌలిక అవగాహననే మార్చివేశాయి. న్యాయప్రక్రియనూ, న్యాయసిద్ధాంతాన్నీ ప్రజాస్వామీకరించడానికి దోహద పడ్డాయి. అంతక్రితం ఎవరూ ఊహించని ప్రజా ప్రయోజన వ్యాజ్యమనే భావనకు అంకురార్పణ చేసి సామాన్య పౌరులకు సర్వోన్నత న్యాయస్థానాన్ని చేరువచేసింది జస్టిస్ కృష్ణయ్యరే. పౌరుల ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు పూచీపడే రాజ్యాంగంలోని 21వ అధికరణకు ఆయన చెప్పిన భాష్యం నేర న్యాయవ్యవస్థకు మానవీయతను జోడించింది. నేరారోపణలు ఎదుర్కొనే వ్యక్తికి బెయిల్ పొందడం హక్కని, అరుదైన సందర్భాల్లో మాత్రమే నిర్బంధంలో నిందితుణ్ణి నిర్బంధించ వచ్చునని తీర్పునిచ్చింది ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే. జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పులు కవితాత్మకంగా...సమాజ హృదయ స్పందనను కొలిచేవిగా ఉంటాయని న్యాయకోవిదులు చెబుతారు. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సైతం న్యాయ వాదులకు ఆయనిచ్చిన గౌరవం అందరికీ గుర్తుండిపోతుంది. న్యాయమూర్తులకు బార్ సూపర్ న్యాయమూర్తి వంటిదని, అదిచ్చే తీర్పునుంచి ఏ న్యాయమూర్తీ తప్పించుకొనలేరని కృష్ణయ్యర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. జస్టిస్ కృష్ణయ్యర్‌పై అలిగినవారూ, కోప్పడినవారూ లేకపోలేదు. నిరుడు జూన్‌లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టాక...‘సరైన సమయం వచ్చినప్పుడు మీరు ఈ దేశానికి కూడా నాయకత్వంవహించాలి’ అని లేఖరాస్తే ఆయనపై కొందరికి కోపం వచ్చింది. అలాగని గోపాల సుబ్రహ్మణ్యం న్యాయమూర్తి కాకుండా మోదీ సర్కారు అడ్డుకున్నప్పుడు ఆ చర్య అత్యంత దారుణమైనదని, దాన్ని వెంటనే సవరించుకోవాలని మోదీకి నిర్మొహమాటంగా రాశారు. అది పర్యావరణమైనా, సౌరశక్తికి సంబంధించినదైనా, జస్టిస్ బాలకృష్ణన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి అయినా వెనువెంటనే స్పందించడం... ఎందరు ఏమన్నా తాను అనుకున్నదేదో చెప్పడం జస్టిస్ కృష్ణయ్యర్ స్వభావం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ అన్నట్టు కృష్ణయ్యర్‌కు సాటిరాగలవారు ప్రపంచంలోనే చాలా అరుదు. అంతటి అరుదైన వ్యక్తిత్వాన్ని, పదునైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన జస్టిస్ కృష్ణయ్యర్ రాగల తరాలకు సైతం ఎవరెస్టు శిఖరంలా స్ఫూర్తిదాయకంగా ఉంటారు.