మెమన్ ఉరికి మతమే కారణం!
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల ఉగ్రవాది యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధించడానికి అతని మతమే కారణమంటూ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. అసలు అయోధ్యలో వివాదాస్పద కట్టడం (బాబ్రీ మసీదు) కూల్చివేత, ముంబైలో, గుజరాత్‌లో మతఘర్షణలు వంటి తీవ్రమైన కేసుల్లో నేరస్తులకు ఈ తరహా శిక్షలు విధించలేదేమని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లో అసదుద్దీన్ మాట్లాడారు. ‘‘బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని ఇప్పటివరకు ఎందుకు శిక్షించలేదు, వారికి కూడా ఉరిశిక్ష విధించాలి.
1992-93లో ముంబైలో జరిగిన మత కల్లోలాల్లో వెయ్యి మంది ఊచకోతకు గురయ్యారు. ఆ ఘటనలో ఎంతమందిని శిక్షించారు. మాలెగావ్ పేలుళ్లతో సంబంధమున్న సాధ్వి ప్రజ్ఞ, స్వామి అసీమానంద్‌లకు ఉరిశిక్ష విధించగలరా?..’’ అని పేర్కొన్నారు. యాకూబ్ మెమన్‌కు అతని మతం కారణంగానే ఉరిశిక్ష విధించారని అన్నారు.
అలాంటి వారు పాక్ వెళ్లాలి: మహరాజ్
దేశాన్ని గౌరవించనివారికి, న్యాయవ్యవస్థను గౌరవించనివారికి దేశంలో ఉండే హక్కు లేదని, అలాంటివారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ అసదుద్దీన్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ వ్యాఖ్యానిం చారు. ‘‘దేశాన్ని అసదుద్దీన్ నడిపించడం లేదు. మెమన్ దోషి అని కోర్టులు నిర్ధారించాయి. ఉగ్రవాది ఉగ్రవాదే. వారు ఇలాంటి మత రాజకీయాలకు పాల్పడడాన్ని ఆపేయాలి..’’ అని పార్లమెంటు వెలుపల మీడియాతో పేర్కొన్నారు. ఇక అసదుద్దీన్ మత రాజకీయాలకు పాల్పడుతున్నాడని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. అసదుద్దీన్ ప్రతిదానిలో మతాన్ని చూస్తారని, ఇది దురదృష్టకరమన్నారు.
ఒవైసీది రాజకీయ అవివేకం: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్‌కు సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్షను మతకోణంలో చూడడం తగదని అసదుద్దీన్‌కు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. మెమన్‌కు ఉరిశిక్షను ప్రభుత్వం విధించలేదని, సుప్రీంకోర్టు విధించిందని ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. ఒక మతానికి చెందిన వారికి ఉరిశిక్ష విధిస్తున్నారడం రాజకీయ అవివేకమని, ఎంఐఎం ఆలోచనా ధోరణిని ఎప్పటికీ మారదని విమర్శించారు.