కుల్దీప్ సింగ్ సెంగార్
సాక్షి, లక్నో : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఉన్నావ్ లైంగిక దాడి, కస్టడీలో బాధితురాలి తండ్రి మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించారు. లైంగిక దాడి ఆరోపణలకి సంబంధించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో సెంగార్, ఆయన అనుచరులు బుధవారం రాత్రి ఘర్షణకు దిగిన అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఎంఎల్‌ఏ పేర్కొంటూ పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు నిరాకరించారు. బుధవారం అర్ధరాత్రి లక్నోలో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సెంగార్ కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేసుకు సంబంధించి ఎస్పీ కార్యాలయానికి ఎంఎల్‌ఏ చేరుకున్న క్రమంలో ఆయన అనుచరులకు, మీడియా ప్రతినిధులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సెంగార్ పేర్కొనగా, ఈ కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు చేపడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. కాగా, తనపై బీజేపీ ఎంఎల్‌ఏ కుల్దీప్ సింగ్ సెంగార్, ఆయన సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి యూపీ సీఎం నివాసం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోగా కస్టడీలోనే ఆయన మరణించడం కలకలం రేపింది. కాగా, ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పట్ల బాధితురాలి బాబాయి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అసలు ఆయనను అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment