లక్నో: సంచలనం సృష్టించిన ‘ఉన్నావ్’ అత్యాచారం కేసులో నిందితుడు బీజేపీ ఎంపీ కుల్దీప్ సింగ్ సెంగర్ భార్య సంగీతను మోసం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురినియ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నాయకులం, సీబీఐ అధికారులమంటూ బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించి వీరు పోలీసులకు దొరికిపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన అలోక్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు కుల్దీప్ సింగ్ భార్య సంగీతకు ఫోన్ చేసి తమను తాము బీజేపీ నాయకులుగా పరిచయం చేసుకున్నారు. తమకు కోటి రూపాయలు ఇస్తే సీబీఐ కస్టడీలో ఉన్న కుల్దీప్‌ను బయటకు తీసుకువస్తామని తెలిపారు. ఆ కోటి రూపాయలను కూడా సీబీఐ అధికారికి లంచం ఇవ్వడం కోసమే అడుగుతున్నామని అన్నారు. అందుకు సంగీత తన దగ్గర అంత డబ్బు లేదని తెలపడంతో, కనీసం 50 లక్షల రూపాయలైన ఏర్పాటు చేయమని చెప్పారు.
తరువాతి రోజు మరో వ్యక్తి ఫోన్ చేసి తనను తాను సీబీఐ అధికారి రాజీవ్ మిశ్రాగా పరిచయం చేసుకున్నాడు. అతను కూడా తనకు కోటి రూపాయలు ఇస్తే కుల్దీప్‌ను బయటకు తీసుకువస్తానని చెప్పాడు. అంతేకాక తమ మాటల మీద ఆమెకు నమ్మకం లేకపోతే మే 7న లక్నో సీబీఐ కార్యలయం దగ్గరకు వచ్చి పరీక్షించిన తర్వాతే డబ్బులు ఇవ్వాలని తెలిపాడు. ఈ ఫోన్ కాల్ గురించి సంగీత తన బంధువులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. ఈ విషయం గురించి సంగీత ఘాజీపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘మేము ఆమెకు వచ్చిన ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేసి నిందితులను లక్నోకు చెందిన అలోక్, విజయ్‌లుగా గుర్తించాం. గురువారం నాడు వీరిద్దరిని అరెస్టు చేశామ’ని లక్నో ఎస్‌ఎస్‌పీ దీపక్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment