సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై లైంగిక దాడి ఆరోపణలను సీబీఐ నిర్ధారించింది. ఉద్యోగం ఆశ చూపి సెంగార్ నివాసంలో ఆయనతో పాటు అనుచరుడు శశి సింగ్‌లు ఆ సమయంలో మైనర్ అయిన బాధితురాలిని ప్రలోభపెట్టారనే ఆరోపణలను సీబీఐ ధృవీకరించింది. 2017, జూన్ 4న శశి సింగ్‌తో కలిసి బాధితురాలు ఎమ్మెల్యే సెంగార్‌ను యూపీలోని మఖి గ్రామంలోని ఆయన నివాసంలో కలిసిన క్రమంలో లైంగిక దాడి ఘటన చోటుచేసుకుంది. ఆమెపై సెంగార్, మరో వ్యక్తి లైంగిక దాడి జరిపే సమయంలో గది బయట సింగ్ వేచిఉన్నారని ఆరోపణలున్నాయి. జూన్ 11న బాధితురాలిని ముగ్గురు యువకులు అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఓ ఎస్‌యూవీలో ఆమెను తొమ్మిది రోజుల పాటు నిర్భందించారు.
కాగా, ఎంఎల్‌ఏ ప్రభావితం చేయడం వల్లే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించడంలో స్ధానిక పోలీసులు జాప్యం చేశారా అనే కోణంలోనూ సీబీఐ విచారిస్తోంది. కోర్టు సైతం ఇవే సందేహాలను వ్యక్తం చేయడం గమనార్హం. శాంతిభద్రతల యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు యూపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట సజీవ దహనానికి ప్రయత్నించిన అనంతరం ఉన్నావ్ ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 17 గంటల పాటు విచారణ అనంతరం కోర్టు సూచనల మేరకు బీజేపీ ఎమ్మెల్యే సెంగార్‌ను ఏప్రిల్ 13న సీబీఐ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment