కంచే చేను మేస్తే? ధర్మం, న్యాయం కాపాడాల్సిన పాలకులే... అధర్మానికి కాపు కాస్తే? మాఫియా డాన్‌ల అడుగులకు మడుగులొత్తితే? పోలీసు, న్యాయవ్యవస్థలు దోషులుగా నిర్ధారించిన వారిని సైతం శిక్షాకాలం పూర్తి కాక ముందే రకరకాల సాకులతో బాహ్యప్రపంచంలోకి వదిలేస్తుంటే ఏమనాలి? ఎవరికి చెప్పాలి? పార్టీలు, పాలకుల మీద ఏవగింపు గలిగే ఇలాంటి చర్యల వరుసలో తాజా ఉదాహరణ – హంతకుడు ఆనంద్ మోహన్ సింగ్‌ను పాలకులు నిస్సిగ్గుగా జైలు నుంచి బయటకొదిలేసిన సంఘటన.
ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను దారుణంగా చంపి, జైలు ఊచలు లెక్క బెడుతున్న ఈ బడా నేరస్థుడు గురువారం బిహార్‌లోని సహరసా జైలు నుంచి విడుదలైన తీరు నివ్వెరపరుస్తోంది అందుకే. నిరుడు బీజేపీతో బంధం తెంచుకున్నాక ఓట్ల పునాదిని విస్తరించుకొనేందుకు తంటాలు పడుతున్న బిహార్ సీఎం నితీశ్ బలమైన తోమర్ రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఆనంద్‌లో అద్భుతమైన అవకాశాన్ని చూశారని ఆరోపణ వినిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలే పరమా వధిగా దోషుల్ని వదిలేసే దిగజారుడు పనిలో పార్టీలన్నీ పోటీ పడుతుండడం ఆగ్రహం రేపుతోంది.
ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కృష్ణయ్యను 1994లో దారుణంగా హత్య చేశాడీ ఆనంద్ మోహన్. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దళితుడు. విధినిర్వహణలోని ఆయనను ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వ వాహనం నుంచి లాగి, హేయంగా కొట్టి చంపడానికి 1994 డిసెంబర్ 5న అల్లరిమూకను రెచ్చగొట్టింది ఆనంద్ మోహన్. 2007లో ట్రయల్ కోర్ట్ దోషికి మరణశిక్ష విధించింది. ఏడాది తర్వాత పాట్నా హైకోర్ట్ దాన్ని జీవితకాల శిక్షగా తగ్గించింది.
ఈ తీర్పును ఆనంద్ సుప్రీమ్‌లో సవాలు చేసినా, ఇప్పటి దాకా కోర్ట్›ఉపశమనమేమీ ఇవ్వలేదు. అలా 2007 నుంచి జైలులో ఉన్న వ్యక్తిపై బిహార్ సర్కార్ ఎక్కడ లేని అక్కర చూపింది. ఈ నెలలోనే ‘బిహార్ ప్రిజన్ మ్యాన్యువల్ 2012’లో 481వ రూల్‌ను మార్చింది. ‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారి హత్యలో దోషి అయిన ఖైదీని విడుదల చేయరాద’న్న నిబంధనను నిర్లజ్జగా తొలగించింది. ఫలితంగా – జైలులో 14 ఏళ్ళు, 20 ఏళ్ళు గడిపిన మరో 27 మంది ఖైదీలతో పాటు ఈ నేరస్థుడికీ అన్యాయంగా స్వేచ్ఛ లభించింది.
పౌర సమాజం నుంచి ప్రతిపక్షాల దాకా అందరూ తీవ్రంగా వ్యతిరేకించినా, నితీశ్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. బిహార్‌లో రాజకీయాలకూ, నేరస్థులకూ మధ్య అనాదిగా పొడిచిన పొత్తుకు ఇది ప్రతీక. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ పలుకుబడి సామాన్యమేమీ కాదు. శివ్‌హర్ లోక్‌సభా స్థానంలో గతంలో ఎంపీగా గెలిచాడు. కృష్ణయ్య హత్యతో జైలులో ఉంటేనేం, అతని భార్య లవ్లీ ఆనంద్ ఒకసారి ఎంపీ అయ్యారు. 2010 అసెంబ్లీ, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పక్షాన పోటీ చేశారు.
వారి కుమారుడు చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఎమ్మెల్యే. తల్లీకొడుకులిద్దరూ బిహార్ అధికార సంకీర్ణ కూటమిలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సభ్యులే. కుమారుడి వివాహ నిశ్చితార్థం కోసం ఆనంద్ ఇటీవల 15 రోజులు పెరోల్ మీద బయటే ఉన్నాడు. సదరు నిశ్చితార్థానికి సాక్షాత్తూ బిహార్ సీఎం సహా అధికార కూటమి నేతలందరూ హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. పెరోల్ ముగిసిన ఆనంద్ ఏప్రిల్ 26న జైలుకు చేరాడో లేదో, సర్కార్ సవరించిన నిబంధనల పుణ్యమా అని మర్నాడే బయటకొచ్చేశాడు.
వివిధ రాష్ట్రాల్లోని పాలకుల అవసరానికి తగ్గట్టు నియమ నిబంధనలు మారిపోతున్నాయి. వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. వెరసి, జైళ్ళలోని దోషుల శిక్షాకాలాన్ని తగ్గించి బయటకు వదిలేస్తున్న లజ్జాకరమైన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గత ఆగస్ట్‌లో బయటపడ్డ బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషుల నుంచి తాజా ఆనంద్ మోహన్ దాకా అన్ని వ్యవహారాలూ అలాంటివే. బీజేపీ నుంచి జేడీ–యూ దాకా అన్ని పార్టీలూ ఈ తిలా పాపంలో తలా పిడికెడు పంచుకున్నవే.
ఓటు రాజకీయాలు, సమర్థకుల సంరక్షణ – ఇలా ఈ విడుదల వెనుక పైకి కనిపించని కారణాలు అనేకం. గద్దె మీది పెద్దల పరోక్ష సాయంతో బయటపడ్డ వీరికి సమర్థకుల నుంచి లభి స్తున్న స్వాగత సత్కారాలు, నీరాజనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఆనంద్ విడుదలతో జరిగిన బైక్ ర్యాలీలు, మిఠాయి పంపిణీలూ అచ్చంగా అలాంటివే. రేపిస్టులనూ, హంతకులనూ గౌరవించి, ఆరాధించే సంస్కృతికి అన్ని పార్టీలూ, అనుయాయులూ దిగజారుతున్న తీరు జుగుప్సా కరం. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ ఘటనల్లో వ్యవస్థలు భాగమైపోతూ ఉండడం శోచనీయం.
చేసిన నేరం తాలూకు తీవ్రత, దోషుల వ్యక్తిగత చరిత్రలను బట్టి ఏ కేసుకా కేసు ప్రత్యేకమైనదే. కానీ, అన్నిటినీ ఒకే గాటన కడుతూ, కావాల్సినవారిని కాపాడుకొనే రీతిలో నిర్ణీత కాలవ్యవధి దాటి జైలులో ఉన్నవారందరినీ వదిలేయవచ్చని తీర్మానించడం సబబేనా? అలాంటప్పుడు బాధితులకు సరైన న్యాయం ఏ రకంగా జరిగినట్టు? పశ్చాత్తాపం, పరిణత సత్ప్రవర్తన లాంటివి శిక్షాకాలపు తగ్గింపునకు గీటురాళ్ళు కావాలి.
కేవలం జైలులో గడిపిన రోజులే లెక్కలోకి తీసుకుంటే, బాజాప్తాగా బయటకొచ్చిన దోషి రేపు మరో నేరానికి పాల్పడడని నమ్మకం ఏమిటి? బాధిత కుటుంబాల కళ్ళెదుటే నేరస్థులు నిష్పూచీగా తిరుగుతుంటే, చట్టం, న్యాయం పట్ల సామాన్యుడు విశ్వాసం కోల్పోతే ఆ పాపం ఎవరిది? తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావిడి పడుతున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ లోతైన ప్రభావం చూపే పరిణామాలని ఇకనైనా తెలివిడి తెచ్చుకోవాలి. ఈ దేశంలో చట్టాలన్నీ అధికార బలగానికి చుట్టాలేనన్న భావన బలపడితే ప్రజాస్వామ్యానికే చేటు.
పరిహాసమైన ప్రజాస్వామ్యం
Published Fri, Apr 28 2023 2:55 AM | Last Updated on Fri, Apr 28 2023 2:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment