Anand Mohan
-
దోషిగా తేలితే నన్ను ఊరి తీయండి: ఆనంద్ మోహన్ సింగ్
పాట్నా: ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో పద్నాలుగేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఆనంద్ మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తాను దోషిగా తేలితే ఉరికి సైతం సిద్ధమేనంటూ వ్యాఖ్యానించాడాయన. బిహార్ అరారియాలో ఈ మాజీ ఎంపీ కమ్ గ్యాంగ్‌స్టర్ మాట్లాడుతూ.. కృష్ణయ్య హత్య కేసులో తాను నిర్దోషినంటూ ప్రకటించాడు. ఈ దేశం ఎవరి సొత్తూ కాదు. నేను చట్టాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్ముతాను. అందుకే 15 ఏళ్లకుపైగా శిక్ష అనుభవించా. ఒకవేళ నేను గనుక దోషి అని తేల్చితే.. ఉరిశిక్షకైనా సిద్దం అంటూ ప్రకటించాడు ఆనంద్ మోహన్ సింగ్. -
పరిహాసమైన ప్రజాస్వామ్యం
కంచే చేను మేస్తే? ధర్మం, న్యాయం కాపాడాల్సిన పాలకులే... అధర్మానికి కాపు కాస్తే? మాఫియా డాన్ల అడుగులకు మడుగులొత్తితే? పోలీసు, న్యాయవ్యవస్థలు దోషులుగా నిర్ధారించిన వారిని సైతం శిక్షాకాలం పూర్తి కాక ముందే రకరకాల సాకులతో బాహ్యప్రపంచంలోకి వదిలేస్తుంటే ఏమనాలి? ఎవరికి చెప్పాలి? పార్టీలు, పాలకుల మీద ఏవగింపు గలిగే ఇలాంటి చర్యల వరుసలో తాజా ఉదాహరణ – హంతకుడు ఆనంద్ మోహన్ సింగ్‌ను పాలకులు నిస్సిగ్గుగా జైలు నుంచి బయటకొదిలేసిన సంఘటన. ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను దారుణంగా చంపి, జైలు ఊచలు లెక్క బెడుతున్న ఈ బడా నేరస్థుడు గురువారం బిహార్‌లోని సహరసా జైలు నుంచి విడుదలైన తీరు నివ్వెరపరుస్తోంది అందుకే. నిరుడు బీజేపీతో బంధం తెంచుకున్నాక ఓట్ల పునాదిని విస్తరించుకొనేందుకు తంటాలు పడుతున్న బిహార్ సీఎం నితీశ్ బలమైన తోమర్ రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఆనంద్‌లో అద్భుతమైన అవకాశాన్ని చూశారని ఆరోపణ వినిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలే పరమా వధిగా దోషుల్ని వదిలేసే దిగజారుడు పనిలో పార్టీలన్నీ పోటీ పడుతుండడం ఆగ్రహం రేపుతోంది. ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కృష్ణయ్యను 1994లో దారుణంగా హత్య చేశాడీ ఆనంద్ మోహన్. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దళితుడు. విధినిర్వహణలోని ఆయనను ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వ వాహనం నుంచి లాగి, హేయంగా కొట్టి చంపడానికి 1994 డిసెంబర్ 5న అల్లరిమూకను రెచ్చగొట్టింది ఆనంద్ మోహన్. 2007లో ట్రయల్ కోర్ట్ దోషికి మరణశిక్ష విధించింది. ఏడాది తర్వాత పాట్నా హైకోర్ట్ దాన్ని జీవితకాల శిక్షగా తగ్గించింది. ఈ తీర్పును ఆనంద్ సుప్రీమ్‌లో సవాలు చేసినా, ఇప్పటి దాకా కోర్ట్›ఉపశమనమేమీ ఇవ్వలేదు. అలా 2007 నుంచి జైలులో ఉన్న వ్యక్తిపై బిహార్ సర్కార్ ఎక్కడ లేని అక్కర చూపింది. ఈ నెలలోనే ‘బిహార్ ప్రిజన్ మ్యాన్యువల్ 2012’లో 481వ రూల్‌ను మార్చింది. ‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారి హత్యలో దోషి అయిన ఖైదీని విడుదల చేయరాద’న్న నిబంధనను నిర్లజ్జగా తొలగించింది. ఫలితంగా – జైలులో 14 ఏళ్ళు, 20 ఏళ్ళు గడిపిన మరో 27 మంది ఖైదీలతో పాటు ఈ నేరస్థుడికీ అన్యాయంగా స్వేచ్ఛ లభించింది. పౌర సమాజం నుంచి ప్రతిపక్షాల దాకా అందరూ తీవ్రంగా వ్యతిరేకించినా, నితీశ్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. బిహార్‌లో రాజకీయాలకూ, నేరస్థులకూ మధ్య అనాదిగా పొడిచిన పొత్తుకు ఇది ప్రతీక. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ పలుకుబడి సామాన్యమేమీ కాదు. శివ్‌హర్ లోక్‌సభా స్థానంలో గతంలో ఎంపీగా గెలిచాడు. కృష్ణయ్య హత్యతో జైలులో ఉంటేనేం, అతని భార్య లవ్లీ ఆనంద్ ఒకసారి ఎంపీ అయ్యారు. 2010 అసెంబ్లీ, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పక్షాన పోటీ చేశారు. వారి కుమారుడు చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఎమ్మెల్యే. తల్లీకొడుకులిద్దరూ బిహార్ అధికార సంకీర్ణ కూటమిలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సభ్యులే. కుమారుడి వివాహ నిశ్చితార్థం కోసం ఆనంద్ ఇటీవల 15 రోజులు పెరోల్ మీద బయటే ఉన్నాడు. సదరు నిశ్చితార్థానికి సాక్షాత్తూ బిహార్ సీఎం సహా అధికార కూటమి నేతలందరూ హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. పెరోల్ ముగిసిన ఆనంద్ ఏప్రిల్ 26న జైలుకు చేరాడో లేదో, సర్కార్ సవరించిన నిబంధనల పుణ్యమా అని మర్నాడే బయటకొచ్చేశాడు. వివిధ రాష్ట్రాల్లోని పాలకుల అవసరానికి తగ్గట్టు నియమ నిబంధనలు మారిపోతున్నాయి. వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. వెరసి, జైళ్ళలోని దోషుల శిక్షాకాలాన్ని తగ్గించి బయటకు వదిలేస్తున్న లజ్జాకరమైన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గత ఆగస్ట్‌లో బయటపడ్డ బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషుల నుంచి తాజా ఆనంద్ మోహన్ దాకా అన్ని వ్యవహారాలూ అలాంటివే. బీజేపీ నుంచి జేడీ–యూ దాకా అన్ని పార్టీలూ ఈ తిలా పాపంలో తలా పిడికెడు పంచుకున్నవే. ఓటు రాజకీయాలు, సమర్థకుల సంరక్షణ – ఇలా ఈ విడుదల వెనుక పైకి కనిపించని కారణాలు అనేకం. గద్దె మీది పెద్దల పరోక్ష సాయంతో బయటపడ్డ వీరికి సమర్థకుల నుంచి లభి స్తున్న స్వాగత సత్కారాలు, నీరాజనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఆనంద్ విడుదలతో జరిగిన బైక్ ర్యాలీలు, మిఠాయి పంపిణీలూ అచ్చంగా అలాంటివే. రేపిస్టులనూ, హంతకులనూ గౌరవించి, ఆరాధించే సంస్కృతికి అన్ని పార్టీలూ, అనుయాయులూ దిగజారుతున్న తీరు జుగుప్సా కరం. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ ఘటనల్లో వ్యవస్థలు భాగమైపోతూ ఉండడం శోచనీయం. చేసిన నేరం తాలూకు తీవ్రత, దోషుల వ్యక్తిగత చరిత్రలను బట్టి ఏ కేసుకా కేసు ప్రత్యేకమైనదే. కానీ, అన్నిటినీ ఒకే గాటన కడుతూ, కావాల్సినవారిని కాపాడుకొనే రీతిలో నిర్ణీత కాలవ్యవధి దాటి జైలులో ఉన్నవారందరినీ వదిలేయవచ్చని తీర్మానించడం సబబేనా? అలాంటప్పుడు బాధితులకు సరైన న్యాయం ఏ రకంగా జరిగినట్టు? పశ్చాత్తాపం, పరిణత సత్ప్రవర్తన లాంటివి శిక్షాకాలపు తగ్గింపునకు గీటురాళ్ళు కావాలి. కేవలం జైలులో గడిపిన రోజులే లెక్కలోకి తీసుకుంటే, బాజాప్తాగా బయటకొచ్చిన దోషి రేపు మరో నేరానికి పాల్పడడని నమ్మకం ఏమిటి? బాధిత కుటుంబాల కళ్ళెదుటే నేరస్థులు నిష్పూచీగా తిరుగుతుంటే, చట్టం, న్యాయం పట్ల సామాన్యుడు విశ్వాసం కోల్పోతే ఆ పాపం ఎవరిది? తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావిడి పడుతున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ లోతైన ప్రభావం చూపే పరిణామాలని ఇకనైనా తెలివిడి తెచ్చుకోవాలి. ఈ దేశంలో చట్టాలన్నీ అధికార బలగానికి చుట్టాలేనన్న భావన బలపడితే ప్రజాస్వామ్యానికే చేటు. -
గ్యాంగ్ స్టర్ కు బీహార్ ప్రభుత్వం కొమ్ము కాస్తుందా?
-
తెలుగు ఐఏఎస్ అధికారిని పొట్టనబెట్టుకున్న...గ్యాంగ్‌స్టర్‌ను వదిలేశారు!
పట్నా: అతనో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. మాజీ ఎంపీ కూడా. పేరు ఆనంద్ మోహన్. దాదాపు 30 ఏళ్ల కింద బిహార్‌లో ఏకంగా ఐఏఎస్ అధికారిపైకే మూకను ఉసిగొల్పి అత్యంత పాశవికంగా రాళ్ల దాడి చేయించి పొట్టన పెట్టుకున్నాడు. ఆ కేసులో 15 ఏళ్లుగా జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేస్తూ నితీశ్‌కుమార్ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏకంగా జైలు నిబంధనలనే మార్చేసింది! ఆనంద్‌తో సహా పలు తీవ్ర నేరాలకు పాల్పడి జీవితఖైదు అనుభవిస్తున్న మరో 26 మంది దోషుల విడుదలకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం పెరోల్ మీద ఉన్న అతడు ఆ సమయంలో తన కుమారుడైన ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థ వేడుకను ఆస్వాదిస్తున్నాడు! నితీశ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్‌లోని రాజకీయ తదితర రంగాల ప్రముఖులంతా అందులో పాల్గొన్నారు. తనకు విముక్తి ప్రసాదిస్తున్నందుకు నితీశ్‌కు ఆనంద్ మోహన్ కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో డెహ్రాడూన్‌లో జరిగే కొడుకు పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించుకుంటానంటూ హర్షం వెలిబుచ్చాడు. పెరోల్ ముగియడంతో మంగళవారం జైలుకు తిరిగి వెళ్లిన అతను బుధవారం రెమిషన్‌పై విడుదల కానున్నాడు. నితీశ్ సర్కారు నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్పీ, బీజేపీతో పాటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టగా అధికార జేడీ(యూ) మాత్రం సమర్థించుకుంది. క్షమాభిక్ష జాబితాలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషి ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్, పలు తీవ్ర క్రిమినల్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే అవధేశ్ మండల్ కూడా ఉన్నారు. ఏం జరిగింది? 1994లో లాలుప్రసాద్ యాదవ్ హయాంలో బిహార్‌లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్ బిహారీ ప్రసాద్ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. మండల్ రిజర్వేషన్లపై దేశమంతా అట్టుడుకున్న వేళ అగ్రవర్ణ భూమిహార్ అయిన శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డిసెంబర్ 5న శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్ మోహన్ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గోపాల్‌గంజ్ కలెక్టర్ అయిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను కార్లోంచి బయటికి లాగి రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి పొట్టన పెట్టుకున్నారు. ఆనంద్ మోహన్ దగ్గరుండి మరీ వారిని ఈ దాడికి ప్రేరేపించినట్టు చెబుతారు. ఈ కేసులో జైల్లో ఉండగానే ఎంపీగా గెలిచాడు. 2007లో కింది కోర్టు మరణశిక్ష విధించింది. దాంతో స్వతంత్ర భారత చరిత్రలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నాయకునిగా రికార్డుకెక్కాడు. తర్వాత దాన్ని పట్నా హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. అప్పట్నుంచీ అతడు జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల హత్యకు, అత్యాచారాలకు పాల్పడ్డవారికి రెమిషన్ మంజూరు చేయరాదన్న నిబంధనను నితీశ్ సర్కారు తాజాగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర జైలు మాన్యువల్‌ను సవరిస్తూ ఏప్రిల్ 10న నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఆనంద్ మోహన్ విడుదల కోసమేనని అప్పట్నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నితీశ్‌తో అతని బంధం ఇప్పటిది కాదు. వారిద్దరూ సమతా పార్టీ సహ వ్యవస్థాపకులు. కృష్ణయ్య...అట్టడుగు నుంచి ఎదిగిన తెలుగు తేజం మూక దాడికి బలైన ఐఏఎస్ జి.కృష్ణయ్య తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు. ఇల్లు గడిచేందుకు తండ్రితో పాటు కూలి పనికి వెళ్లారు. జర్నలిజం కోర్సు చేసిన అనంతరం కొంతకాలం క్లర్కుగా, లెక్చరర్‌గా పని చేశారు. 1985లో సివిల్స్ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌గా బిహార్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. రోజూ విధిగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఆయన దొరికిన తొలి పోస్టింగే బందిపోట్లకు, కిడ్నాపర్లకు స్వర్గధామంగా పిలిచే వెస్ట్ చంపారన్ జిల్లాలో! తన పనితీరుతో జిల్లాకున్న చెడ్డపేరుతో పాటు దాని రూపురేఖలనే సమూలంగా మార్చేశారని అక్కడ ఇప్పటికీ చెప్పుకుంటారు. తర్వాత నాటి సీఎం లాలు సొంత జిల్లా గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా ఉండగా హత్యకు గురయ్యారు. అప్పుడాయనకు కేవలం 35 ఏళ్లు! ఈ దారుణంపై సీఎం హోదాలో లాలు పేలవ స్పందన తీవ్ర విమర్శలపాలైంది. కృష్ణయ్యకు నివాళులర్పించేందుకు వచ్చిన లాలును వెళ్లిపొమ్మని ఆయన భార్య ఉమా దేవి తెగేసి చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నేరగాళ్లను జైళ్లలోంచి విడుదల చేసి విచ్చలవిడిగా సమాజంపైకి ఉసిగొల్పే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఎక్కడుంటుందన్న ఆమె ప్రశ్న చాలాకాలం అందరి మనసులనూ తొలిచేసింది. ఇప్పటికీ మాఫియా రాజ్యమే కృష్ణయ్య భార్య ఉమ ఆవేదన ఆనంద్ మోహన్ విడుదల వార్తతో దివంగత ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమ షాకయ్యారు. తన గుండె పగిలిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం కొన్ని రాజ్‌పుత్ ఓట్ల కోసం ఒక దారుణమైన ఒరవడికి నితీశ్ సర్కారు శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. ‘‘ఆనంద్ మోహన్ మరణశిక్ష ఇతర నేరగాళ్లకు ఓ హెచ్చరికలా, నికార్సైన అధికారులకు భరోసాగా ఉంటుందని ఆశపడ్డా. కానీ దాన్ని జీవితఖైదుకు తగ్గించారు. దానికే నేను తల్లడిల్లిపోతే ఇప్పుడేమో ఆ శిక్షనూ రద్దు చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ బిహార్‌లో మాఫియా రాజ్యమే నడుస్తోందని మరోసారి రుజువైంది. ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడేందుకు నేరగాళ్లకు ఇది మరింత ప్రోత్సాహమిస్తుంది. ఆనంద్ మోహన్ వంటి నేరగాళ్లు, వాళ్ల కుటుంబీకులే ఇంకా తమకు రాజకీయ ప్రాతినిధ్యం వహించాలా అన్నది రాజ్‌పుత్‌లు ఆలోచించుకోవాలి’’అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఈ నిర్ణయం రద్దయ్యేలా చూడాలని కోరారు. ‘‘ఇలాంటి కేసుల్లో దోషులు జీవితాంతం జైల్లో గడపాల్సిందే. అందుకే నితీశ్ సర్కారు నిర్ణయంపై పట్నా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంది. దీనిపై నా భర్త బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో చర్చిస్తున్నా’’అని వెల్లడించారు. కృష్ణయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తండ్రిని కోల్పోయేనాటికి వారికి పెద్ద కూతురు నిహారికకు ఏడేళ్లు, చిన్నమ్మాయి పద్మకు ఐదేళ్లు. వారిని తీసుకుని ఉమ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా రిటైరయ్యారు. నిహారిక బ్యాంక్ మేనేజర్‌గా, పద్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అటవీ’ ఉద్యోగాల భర్తీకి... 11 నుంచి రాత పరీక్షలు
పోస్టుల వివరాలు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్-141 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్-92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్-16 బంగ్లా వాచర్-2 టెక్నికల్ అసిస్టెంట్-3 ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీ శాఖలోని ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11వ తేదీ నుంచి రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా అటవీ శాఖ కన్జర్వేటర్ ఆనంద్ మోహన్ తెలిపారు. ఆయన గురువారం ఖమ్మంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోస్టులు... దరఖాస్తుదారుల సంఖ్య, పరీక్షల తేదీలు.. సమయం తదితర వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో ఖమ్మం కేంద్రంగా జేఎన్టీయూ ఆధ్వర్యంలో రీజనల్ కో-ఆర్డినేటర్ ద్వారా ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు-141, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు-92, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు-16, బంగ్లా వాచర్ పోస్టులు-2, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-2) పోస్టులు-3 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: ఈ నెల 11న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో 24 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 13,261మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: ఈ నెల 18న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో 17 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 9,146మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: ఈ నెల 25న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 1,733మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 గంటల నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది. బంగ్లా వాచర్స్, తానేధార్స్, టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షలు వరంగల్‌లో జరుగుతాయి. హాల్ టికెట్‌ను అటవీ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో ఉన్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు పర్యవేక్షకులుగా డివిజనల్ ఫారెస్ట్ అధికారులు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు నియమితులయ్యారు.