
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది.
దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్‌కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది.
రాబోయే రోజుల్లో మరో ఓటింగ్‌లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది.
ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్‌ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు.
కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట.
నిజానికి, ఇజ్రాయెల్‌లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్‌లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్‌కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన.
సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం.
ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే!
మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు.
ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్‌కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది.
న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే.
దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్‌కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment