![Chandra Babu should apologize to the justice system - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/12/sharma.jpg.webp?itok=0gUoGHAL)
సాక్షి, అమరావతి: కోర్టులను కూడా మేనేజ్ చెయ్యొచ్చంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు న్యాయవ్యవస్థకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేత చుండూరు సుందర రామశర్మ డిమాండు చేశారు. టీడీపీ అధినేతకు శవ రాజకీయాలు చేయడం బాగా ఆలవాటని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థలో గౌరవప్రదమైన వ్యక్తి నిరంజన్‌రెడ్డి అని.. అలాంటి ఆయనపైనా చంద్రబాబు హేయంగా విమర్శలు చేశారన్నారు. కోర్టులను కూడా ప్రభావితం చేస్తారని చంద్రబాబు అంటున్నారంటే అది బాబుకు ఎంత అలవాటో తెలుస్తోందన్నారు.
రామశర్మ ఇంకా ఏమన్నారంటే.. తీవ్ర నిరాశ, నిస్పృహలో బాబు మతితప్పి మాట్లాడుతున్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులపైనా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యవస్థపైనా చంద్రబాబుకు గౌరవంలేదు. ఎంపీలపై చేసిన విమర్శలను వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలి. ఎంపీలు బ్రోకర్లా? ఏమిటా మాటలు? నిజానికి.. ఎన్టీఆర్ నుంచి సీఎం పదవిని, పార్టీని లాక్కున్న చంద్రబాబునాయుడు ఆ రోజు ఏ విధంగా వ్యవహరించాడో అందరూ చూశారు. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు చూశాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తిగా దిగజారి వ్యవహరించాడు. అసలు వ్యవస్థలను మేనేజ్ చేసి పబ్బం గడుపుకోవడమే ఆయనకు బాగా తెలుసు. పార్లమెంటు, అసెంబ్లీ దేవాలయాలు లాంటివి. వాటికి ఎన్నికయ్యే వారిని గౌరవించాలి. కానీ, రాజ్యసభకు ఎన్నికైన వారిని చంద్రబాబు బ్రోకర్లు అంటున్నారు. నిజానికి.. చంద్రబాబు ఇప్పటివరకు చేసిన పనులు చూస్తే అసలు బ్రోకర్ ఎవరో తెలుస్తుంది.
పాదయాత్ర ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు
ఇక లోకేశ్‌ది పాదయాత్ర కాదు.. అది ఒక బూతుమాటల యాత్ర. తన తండ్రిపైనా, ఎల్లో మీడియాపైనా ఆక్రోశంగా ఉన్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌పై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. లోకేశ్ అడుగులు వేయలేకపోతున్నారు. త్వరగా ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబూ అందుకు ఎదురుచూస్తున్నారు. పార్టీ శ్రేణుల్లోనూ అదే అభిప్రాయం ఉంది. మరోవైపు.. ఎంపీల ఎంపికలో సామాజిక న్యాయం పాటించిన పార్టీ వైఎస్సార్‌సీపీనే.
పరిమళ్ నత్వానీతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం జగన్ భావించి ఆయనను రాజ్యసభకు పంపించారు. కానీ, చంద్రబాబు మాదిరిగా డబ్బులు తీసుకోలేదు. అలాగే, మా పార్టీ నుంచి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులుంటే, వారిలో నలుగురు బీసీలు. మరి నువ్వెప్పుడైనా అలా బీసీలకు పదవులు ఇచ్చావా చంద్రబాబూ? వర్ల రామయ్యకు మొండిచెయ్యి చూపించావు. అదే నీకు, వైఎస్ జగన్‌కు ఉన్న తేడా? అన్ని కులాల వారు బాబు నైజం తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment