
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించేందుకు ప్రయత్నించరాదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రామాణికమైన ప్రజాప్రయోజన వ్యాజ్యమైతే దానిని సమర్థిస్తామని, తాను కూడా అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశానని గుర్తుచేశారు. ఏ సందర్భంలోనైనా సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందని, కానీ, కొందరు కోర్టులను మాధ్యమంగా చేసుకుని తమ రాజకీయాలు నడపాలనుకోవడం సరికాదని స్పష్టం చేశారు.
ఆజ్‌తక్ ఛానల్ నిర్వహించిన ఈ–ఎజెండా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేవాళ్లు..న్యాయమూర్తిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేందుకు ప్రయత్నించిన వారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. వలస కార్మికులకు సంబంధించి ఓ కేసులో సొలిసిటర్ జనరల్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కోర్టుకు వచ్చిన వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఏం చేశారని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారని, ఈ ప్రశ్న ఎందుకు వేయరాదని, కేవలం రాజకీయపరమైన ఒత్తిళ్లు తెచ్చేం దుకు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యా నించారు. తాము న్యాయవ్యవస్థను విశ్వసిస్తామని, ఆ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా పనిచేసేందుకు వీలుండాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment