న్యూఢిల్లీ: కోర్టు ప్రొసీడింగ్స్‌ను లైవ్ స్ట్రీమింగ్ (ప్రత్యక్ష ప్రసారం) ఇవ్వడం ద్వారా న్యాయవ్యవస్థలో అనవసరపు గోప్యత తొలగిపోతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అయితే లైవ్‌స్ట్రీమ్ అనేది కొన్ని సందర్భాల్లో రెండంచులున్న కత్తిలాగా మారుతుందని, అలాంటప్పుడు న్యాయమూర్తులు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. న్యాయమూర్తులు పాపులర్ ఒపీనియన్ (జనాకర్షక అభిప్రాయాలు)కు లొంగకూడదన్నారు. గుజరాత్ హైకోర్టులో ఆన్‌లైన్ లైవ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఆరంభమైన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రజలకు కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయన్న విషయం తెలుసుకునే హక్కుందని, ప్రజలకు సంపూర్ణ సమాచారం అందితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విధానంలో జాగరూకత అవసరమని, లైవ్‌స్ట్రీమింగ్‌తో జడ్జిలపై రకరకాల ఒత్తిడులు పడతాయని, దీంతో తీరైన న్యాయాన్ని అందించడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని హెచ్చరించారు. ఒక్కోమారు ప్రజలు మెచ్చిన అభిప్రాయం న్యాయానికి వ్యతిరేకంగా ఉండొచ్చని, అయినా రాజ్యాంగానికి లోబడి న్యాయాన్నే అనుసరించాలని ఉద్భోదించారు.
ప్రైవసీ సమస్యను గుర్తించాలి
లైవ్‌స్ట్రీమింగ్‌తో క్లయింట్ల ప్రైవసీకి సంబంధించి ఇబ్బందులు ఎదురుకావచ్చని, అలాగే కీలక సాక్షులు ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడం ఆందోళనకరమైన అంశమని జస్టిస్ రమణ గుర్తు చేశారు. వీరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్ష ప్రసార నిబంధనలు రూపొందించుకోవాలన్నారు. న్యాయవాదులు సైతం జాగ్రత్తగా వ్యవహరించాలని, పబ్లిసిటీ కోసం పాకులాడకూడదని హెచ్చరించారు. సుప్రీంకోర్టులో కొన్నిచోట్ల లైవ్‌స్ట్రీమింగ్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తామని చెప్పారు.
స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా కొన్ని విషయాల గురించి ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉందని, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పనితీరుపై సరైన అవగాహన లేదని చెప్పారు. జనాల్లో న్యాయవ్యవస్థ గోప్యత, గూఢతపై నెలకొన్న సంశయాలను తీర్చే సమయం ఆసన్నమైందని, లైవ్‌స్ట్రీమింగ్ ఇందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. కోర్టుల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కమిటీ చేస్తున్న కృషిని సీజేఐ కొనియాడారు.
కేసుల భారం.. పనితీరుకు సూచిక కాదు
సాక్షి, న్యూఢిల్లీ: ‘భారతీయ న్యాయస్థానాలలో ‘పెండెన్సీ’4.5 కోట్ల కేసులకు చేరుకుందని తరచుగా కోట్ చేసే గణాంకం.. ఇది కేసుల భారాన్ని ఎదుర్కోవడంలో భారత న్యాయవ్యవస్థ యొక్క అసమర్థతగా చిత్రించినట్టుగా ఉంటుందని, దీనిని ‘అతిగా అంచనా వేయడం’గా, ‘అనాలోచిత విశ్లేషణ‘గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. పెండెన్సీ కేసుల భారం పనితీరు కొలిచేందుకు ఉపయోగపడే సూచిక కాదని ఆయన పేర్కొన్నారు.
అహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు న్యాయ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లో వేసే ‘విలాసవంతమైన వ్యాజ్యాలు’న్యాయ విచారణ జాప్యానికి దోహదపడే కారకాల్లో ఒకటన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతం సహా వివిధ కారణాల వల్ల ఏ సమాజంలోనూ విభేదాలు తప్పవని, వీటి పరిష్కారానికి వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి చాలా ముందస్తుగా ఉపయోగించిన సాధనమని చెప్పారు. మధ్యవర్తిత్వం భారతీయ నైతికతలో లోతుగా ఇమిడి ఉందని, దేశంలో బ్రిటిష్ విచారణ వ్యవస్థకు ముందు ఇది ప్రబలంగా ఉందని, వివాద పరిష్కార పద్ధతిగా వివిధ రకాల మధ్యవర్తిత్వాలను ఉపయోగించేవారని చెప్పారు.
ఇండియా–సింగపూర్ మధ్యవర్తిత్వ సదస్సులో ప్రధాన వక్తగా ఉపన్యాసం ఇచ్చారు. అనేక ఆసియా దేశాలు సహకార, స్నేహపూర్వక పరిష్కారం అందించడంలో సుదీర్ఘమైన, గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయని జస్టిస్ రమణ అన్నారు. ‘గొప్ప భారతీయ ఇతిహాసమైన మహాభారతం.. వాస్తవానికి సంఘర్షణ పరిష్కార సాధనంగా మధ్యవర్తిత్వం కోసం ప్రారంభ ప్రయత్నానికి ఒక ఉదాహరణను అందిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు పాండవులు, కౌరవుల మధ్య వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాడు. మధ్యవర్తిత్వ వైఫల్యం ఘోరమైన పరిణామాలకు దారితీసింది..’అని పేర్కొన్నారు. సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ కూడా ఈ కార్యక్రమంలో తన ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment