న్యూఢిల్లీ: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ శాసనసభ్యుల సదస్సులో మాట్లాడుతూ న్యాయస్థానాలకు చట్టాల రూపకల్పనలో జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. రాజ్యాంగం న్యాయస్థానాల విధులను, చట్టసభల విధులను స్పష్టంగా వివరించిందని, మేము గొప్పంటే మేము గొప్పని ఎవ్వరూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇటీవల సుప్రీం కోర్టు పార్లమెంటు చట్టం చేసే లోపు ప్రధాన ఎన్నికల కమీషనరును, ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
శనివారం జరిగిన జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. శాసనాలను చేసే అధికారం రాజ్యాంగం శాసనసభలకు మాత్రమే ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసేటప్పుడు బిల్లు ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించి, వాదోపవాదాలు చేస్తారు. అనంతరం అవి ప్రజలకు ఉపయోగపడే అంశమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైతే తప్ప వాటిని ఆమోదించరు. ప్రజాస్వామ్యంలో అదొక భాగమని తెలిపారు.
చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు చట్టబద్ధంగానూ, రాజ్యాంగబద్ధంగానూ ఉన్నాయా? లేదా? అని మాత్రమే న్యాయవ్యవస్థ చూడాలి తప్ప చట్టాలు చేసి అధికారం రాజ్యాంగం వారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలన్నిటినీ శాసనసభ నిర్ణయిస్తుంది, ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడైనా నిబంధనలను ఉలంఘించినట్లు అనిపిస్తే ఎవ్వరైనా కోర్టును ఆశ్రయించవచ్చని, అలాంటి సందర్భాల్లో మాత్రం వారు సత్వర న్యాయం చేయాలని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment