జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తులు
విశాఖ లీగల్: హైకోర్టు సీనియర్ న్యాయవాది, దివంగత సి.పద్మనాభరెడ్డి సామాన్యుల జీవితాల్లో వెలుగు రేఖగా నిలిచారని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. శనివారం విశాఖలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో పద్మనాభరెడ్డి స్మారక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి తనయుడు, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదిగా తన తండ్రి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల గురించి వివరించారు.
న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సత్సంబంధాలు అవసరమన్నారు. న్యాయవాదులు కోర్టులో ప్రవర్తించే తీరు చాలా ముఖ్యమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయపరమైన అంశాలు, చట్టాల గురించి వివరించారు. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల నేడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. చట్టం అందరికీ సమానమేనన్నారు.
మహిళల చట్టాలు సమర్థవంతంగా అమలు జరగాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్.. ఎన్నికల నేరాలు, తప్పుడు హామీలు తదితరాల గురించి వివరించారు. పద్మనాభరెడ్డి భారత న్యాయవ్యవస్థకు కరదీపిక అని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ మన్మథరావు మాట్లాడుతూ.. పద్మనాభరెడ్డి 60 వేలకు పైగా కేసులను వాదించారని చెప్పారు.
న్యాయమూర్తి జస్టిస్ బి.శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ.. సత్వర న్యాయం పొందాలంటే.. కేసు దాఖలు చేసే సమయంలో సీనియర్ల సలహాలు, సరైన ధ్రువీకరణ పత్రాలు అవసరమన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.నగేష్ మాట్లాడుతూ.. కులాలు, మతాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అధ్యక్షుడు సురేశ్‌కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి ప్రభాకర్, ముప్పాళ్ల సుబ్బారావు, చెలసాని అజయ్‌కుమార్, వి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment