న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్‌ | Judiciary Should Save India Bjp Killing Democracy Telangana KCR | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రధాని స్వయంగా చెప్పడమేంటి? 

Published Fri, Nov 4 2022 1:16 AM | Last Updated on Fri, Nov 4 2022 11:36 AM

Judiciary Should Save India Bjp Killing Democracy Telangana KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేకున్నా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నించడం చిన్న విషయమేమీ కాదని.. ఇలాంటి పద్ధతులు కొనసాగితే దేశంలో ఉద్రిక్తతలు, హింస తలెత్తి.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.

భారత న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుర్మార్గాలను అడ్డుకునేందుకు, దేశాన్ని రక్షించుకునేందుకు చావాల్సి వస్తే.. అందుకు సిద్ధమని, ప్రాణాలు ఇచ్చి పోరాడుతామని ప్రకటించారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని సింగిల్‌ కేసుగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం సహా దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, సంస్థలకు ఆధారాలు పంపిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కలకలం రేపిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ఘటనపై సీఎం కేసీఆర్‌ తొలిసారిగా అధికారికంగా స్పందించారు.

ఈ మేరకు గురువారం రాత్రి ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజానికి రెండు రోజుల క్రితమే మీడియా ముందుకు రావాలనుకున్నానని.. కానీ మునుగోడు ఉప ఎన్నికలో లాభం కోసం చేశారనే చిల్లర ఆరోపణలు వస్తాయనే ఉద్దేశంతో పోలింగ్‌ ముగిసే వరకు వేచి చూశానని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘మొదటిసారి భారమైన మనసుతో, దుఃఖంతో చెప్తున్నా.. పదవులున్నా లేకున్నా 40, 50 ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న అనుభవంతో చెప్తున్నా. ఈ దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దేశంలో దుర్మార్గంగా, నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా ప్రజాస్వామ్య హత్య జరుగుతోంది. ప్రజాస్వామ్య హంతకుల స్వైర విహారం దేశ పునాదులకే ప్రమాదకరం. ఊహకు కూడా అందే పరిస్థితి లేనందునే షాక్‌తో మాట్లాడుతున్నా. 

న్యాయవ్యవస్థకు చేతులు జోడిస్తున్నా.. 
గతంలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినపుడు న్యాయవ్యవస్థ గొప్ప పాత్ర పోషించింది. ఇప్పుడు దేశం ప్రమాదంలోకి వెళ్లకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని న్యాయవ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లను చేతులు జోడించి కోరుతున్నాను. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆధారాలను దేశంలోని సీబీఐ, ఈడీ, సీవీసీతోపాటు అన్ని ప్రముఖ జాతీయ, మీడియా సంస్థలకు శుక్రవారం మధ్యాహ్నంలోగా చేరవేస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధ్యక్షులకు కూడా పంపిస్తున్నాం. 

రాజ్యాంగేతర శక్తుల చేతిలో దేశం 
కర్ణాటక ఎమ్మెల్యేలకు మారువేషాలు వేసి తీసుకెళ్లిన తీరును నిందితులు పూసగుచ్చినట్టు చెప్పారు. ఈవీఎంలు ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదని చెప్పారు. భారతదేశం రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ఉన్నట్టు వీరి మాటల ద్వారా వెల్లడవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఉన్న దొంగల ముఠా వీర విహారాన్ని అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చెదలను నిర్మూలించాల్సి ఉంది. మన రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా. నెల రోజుల ముందు నుంచే రామచంద్రభారతి అనే వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో మొదట ఫోన్‌లో, తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడటంతో వాళ్ల ప్రణాళిక అర్థమైంది. విచారణ జరపాలని హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

ముఠాలోని వారికి రెండు మూడు ఆధార్‌లు 
అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఈడీ, ఐటీ సంస్థలతోపాటు వై ప్లస్‌ భద్రత కల్పిస్తామని రాజ్యాంగేతర శక్తులు చెప్పడం చూస్తే దేశంలో ఏం జరుగుతోందో అర్థమవుతుంది. ఈ ముఠాలో 24 మంది ఉండగా వారందరికీ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి రెండు మూడు ఆధార్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు వేర్వేరు వివరాలు ఉన్నాయి. కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ మీద బీజేపీ టికెట్‌తో పోటీ చేసిన తుషార్‌ అనే వ్యక్తితో బ్రోకర్లు మాట్లాడారు. తుషార్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షానే. 

ఈ దురాఘాతాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి 
ఎనిమిదేళ్లలో బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది. దేశాన్ని విభజించేలా క్రూర పద్ధతుల్లో ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను చూసి బాధపడుతున్నా. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చి బలహీనపర్చే కుట్రలు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ దేశంలో జరుగుతున్న ఈ దురాఘాతాలను తెలుసుకోవాలి. బంగ్లాదేశ్‌ యుద్ధం తర్వాత నాటి ప్రధాని ఇందిరకు ఎదురేలేదని భావిస్తున్న తరుణంలో ఎమర్జెన్సీ విధింపు, ఆ తర్వాత జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో వచ్చిన ఉద్యమంలో ప్రజలు ఎలా స్పందించారో తెలుసు. ఏళ్లపాటు నిర్బంధం ఎదుర్కొన్న మాలవ్యా, పాశ్వాన్, దండావతే వంటి నేతలు లక్షల మెజారిటీతో గెలిచారు. తద్వారా ప్రజాస్వామ్యానికి ఎవరు భంగం కలిగించినా సహించబోమని ప్రజలు నిరూపించారు. 

ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విలీనం 
మేం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే విలీనం చేసుకున్నాం. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వచ్చారు. కానీ కొందరు మునుగోడు ఉప ఎన్నికలో వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతి నన్ను కలిశారనే ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజాతీర్పును గౌరవించాలి. ఎన్నికల సంఘం, సీఈవో ఫెయిల్‌ అంటూ కొందరు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో మేం అనేక ఎన్నికల్లో పోటీ చేసినా ఇంత హేయంగా ఎన్నడూ మాట్లాడలేదు. ప్రజాస్వామ్య మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతోపాటు మీడియా పట్ల కూడా వారికి గౌరవం లేదు.’’ 

చూస్తూ ఊరుకోబోం 
మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని చెప్పి మా రాజధానిలో వ్యవహారం చేస్తే చేతులు ముడుచుకుని కూర్చుని, అరాచకాలను భరించాలా? చూస్తూ ఊరుకోబోం.. పోరాడుతాం. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం. ఎమ్మెల్యేలను కొనడానికి అసలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడాం. నాలుగింట మూడింతల మెజారిటీ ఉన్న ప్రభుత్వాలను ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూల్చేయాలనే కుటిల రాజకీయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. 

మోదీ.. ఈ దుర్మార్గాలను ఆపండి 
ప్రధాని మోదీ గారూ.. నేను మీ రాజకీయ సహచరుడిని. మీరు ప్రధానమంత్రి అయినప్పుడే నేను ముఖ్యమంత్రిని. ఎనిమిదేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇంకేం కావాలి? మంచి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకోండి. చరిత్రలో గుర్తింపు పొందండి. స్వయంగా అడుగు ముందుకేసి ఈ దుర్మార్గంలో పాత్ర కలిగిన వారందరినీ అరెస్టు చేయించండి. దర్యాప్తు చేయించండి. అలాకాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ద్వారా, ప్రభుత్వాలను కూల్చడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ దుర్మార్గాలను ఆపండి. ఇలా చేయడం దేశానికి, మీకు మంచిది కాదు. దేశచరిత్రలో మీ స్థానం దిగజారిపోతుంది. ఎంత శక్తివంతుడైనా వందేళ్లకు మించి బతకరు. ఎందుకు చెడ్డ పనులు చేయాలి? దీనికి ఫుల్‌స్టాప్‌ పడాలి. పట్టపగలు మీ పేరు, మీ హోంమంత్రి పేరు చెప్పి అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనికి కళ్లెం వేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశానికి కళంకం తీసుకురాకండి. 

అమిత్‌షా పేరు 20సార్లు చెప్పారు 
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దాగిన భయంకరమైన దగా, కుట్రలు వింటే ఆశ్చర్యం కలుగుతోంది. వారు 20సార్లు అమిత్‌షా పేరు, ఒకట్రెండు సార్లు మోదీ పేరు చెప్పారు. రిసార్టుల్లో ఉండి ప్రభుత్వాలను కూలగొట్టానని పసుపు పచ్చ బట్టలాయన (సింహయాజీ) చెప్పారు. ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, మరో నాలుగు కూల్చే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. తెలంగాణ, ఢిల్లీలలో బేరాలు అయిపోయాయి. తర్వాత ఆంధ్ర, రాజస్థాన్‌లలో ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పారు. వెంటనే ఢిల్లీ సీఎంను అప్రమత్తం చేశాం. ఇది రాజకీయమా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వాలు కూలిన చోట మౌనం పాటించారు కాబట్టే ఈ దుర్మార్గ ముఠా ఆగడాలు చెల్లుబాటయ్యాయి. కానీ చైతన్యవంతమైన తెలంగాణ ఈ ముఠా ఆట కట్టించి వారి చర్యలను బయటకు తెచ్చింది. 

మేధావులు, యువత మౌనం వీడాలి 
బీజేపీ ఒళ్లు మరిచి చేస్తున్న అరాచక కాండ జుగుప్సాకరంగా ఉంది. ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని స్వయంగా దేశ ప్రధాని చెప్పడం దేనికి సంకేతం? నెల రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దేశ హోంమంత్రి చెప్పడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా? దేశ ప్రజలు, యువత, మీడియా ముక్త కంఠంతో ఖండించకపోతే దేశం ఉనికి, ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దిగజారుతుంది. ఒకసారి దేశం దెబ్బతింటే వందేళ్లు వెనక్కి పోతుంది. మఠాధిపతులు వేషాలు, రూపాలు మార్చి దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఆ పరిస్థితులు మారాలి. రాబోయే రోజుల్లో జయప్రకాశ్‌ నారాయణ్‌ తరహాలో జరిగే ఉద్యమాలకు యువత, విద్యార్థులు, మేధావులు మౌనం వీడి మద్దతునివ్వాలి.  

2015 నుంచి వారి కాల్‌డేటా తీశారు 
బీఎల్‌ సంతోష్, అమిత్‌ షా, జేపీ నడ్డా పేర్లను బ్రోకర్లే చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రలోభపర్చే కుట్రలో పాల్గొన్న మధ్యవర్తుల ఫోన్లను పోలీసులు సీజ్‌ చేసిన తర్వాత వారి కుట్ర కోణమంతా బయటపడింది. 2015 నుంచి ఇప్పటివరకు దేశంలో ఏం జరిగిందో వీళ్ల చరిత్ర ఏందో మొత్తం బయటపడింది. పోలీసులు కాల్‌డేటాను, ల్యాప్‌టాప్‌లలోని డేటాను తీశారు. మూడు గంటల వీడియోలో కుట్ర బహిర్గతమైంది. మొత్తం డేటాను ఉన్నదున్నట్టు హైకోర్టుకు సమర్పించారు. 70వేల నుంచి 80 వేల పేజీలు అయింది. హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఇది పబ్లిక్‌ డొమైన్‌లోకి వెళ్లింది. 

సీఎం పక్కనే ‘ఆ నలుగురు’ఎమ్మెల్యేలు 
‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో కీలకమైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్‌ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, బి.హర్షవర్ధన్‌రెడ్డి నలుగురూ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ పక్కనే కూర్చోవడం గమనార్హం. ఇక ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు పార్టీ సెక్రెటరీ జనరల్‌ కే.కేశవరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మునుగోడులో పోలింగ్ శాతం 90 ప్లస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement