
జీఎస్టీతో రాష్ట్రాలకే లబ్ధి
రాజ్యసభ సమావేశాల చివరి రోజైన శుక్రవారం పదవీ కాలం ముగుస్తున్న 53 మంది సభ్యులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆమోదం పొందకపోవడంపై రాజ్యసభలో మోదీ విచారం
♦ చివరిరోజు 53 మంది సభ్యులకు ఘనంగా వీడ్కోలు
♦ న్యాయవ్యవస్థ జోక్యంపై సభ్యుల ఆందోళన; సభ నివధిక వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాల చివరి రోజైన శుక్రవారం పదవీ కాలం ముగుస్తున్న 53 మంది సభ్యులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ చేస్తున్న వారికి వీడ్కోలుతో పాటు కొత్త సభ్యుల్ని ఆహ్వానించే అవకాశం రాజ్యసభకు మాత్రమే ఉందని మోదీ అన్నారు. 53 మంది సభ్యులు ఆరేళ్ల కాలంలో రెండు ప్రభుత్వాల్ని చూశారని, వారి జ్ఞానం, అనుభవంతో ప్రభుత్వాలు లాభపడ్డాయన్నారు. ఎన్డీఏ సర్కారు తక్కువ లాభపడినా, అంతకుముందు ప్రభుత్వం ఎక్కువగా లబ్ధిపొందిందని మోదీ చెప్పారు. అయితే వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును రాజ్యసభ ఆమోదించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.
బిల్లు ఆమోదంతో రాష్ట్రాలే లాభపడతాయని, రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు. వారి రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్.. ఇలా ఒకటి రెండే కాదు అన్ని రాష్ట్రాలు జీఎస్టీతో లాభపడతాయన్నారు. బిల్లులో రాజ్యాంగ సవరణను లోక్‌సభ ఆమోదించినా రాజ్యసభలో మాత్రం పెండింగ్‌లోనే ఉందన్నారు. అటవీకరణ నిధుల నిర్వహణ, ప్రణాళిక బిల్లు ఆమోదం పొందితే ఒక్కో రాష్ట్రం రూ. 2 నుంచి రూ. 3 వేల కోట్లు పొందుతుందని చెప్పారు.
న్యాయవ్యవస్థ జోక్యంపై ఆందోళన
ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు సభ్యులు చట్టసభల్లో న్యాయవ్యవస్థ జోక్యం పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిజైట్లీ మాట్లాడుతూ.. చట్టాలు, బడ్జెట్ రూపకల్పనలో పార్లమెంట్ ఆధిక్యాన్ని కాపాడాలన్నారు. చట్టాలు, బడ్జెట్ తయారీని మూడో వ్యవస్థ నిర్ణయించకూదని, ఆ అధికారాలు చేజారితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో పాటు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనం అవుతుందన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేయబోతున్న పలువురు సభ్యులు ఉద్వేగంగా మాట్లాడారు.
జైట్లీ - జైరాంల పరిహాసాలు
జైట్లీ, రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేయనున్న కాంగ్రెస్ నేత జైరాంరమేశ్‌లు హాస్యోక్తులు విసురుకున్నారు. జైట్లీ వాస్తవాలపై మాస్టర్ స్పిన్నర్(వక్రీకరించే అర్థంలో) అని రమేశ్ అభివర్ణించారు. తన రిటైర్మంట్‌ను ప్రస్తావిస్తూ.. క్రికెటర్ విజయ్‌మర్చంట్ మంచి ఇన్నింగ్స్ ఆడాక రిటైర్ కావడంపై అడిగినప్పుడు ‘ఎందుకు వెళటం లేదు? అని జనం అడిగేలా కన్నా ఎందుకెళ్తున్నారు? అని అడిగేలా వెళ్లటం ఉత్తమం’ అని చెప్పారన్నారు. జైట్లీ స్పందిస్తూ.. రిటైర్మెంట్‌పై రమేశ్ ఉటంకించిన వ్యాఖ్యలు చేసింది మర్చంట్ కాదు.. సునీల్ గవాస్కర్ అని పేర్కొన్నారు. దీంతో జైట్లీ లేచి ‘ఇది కూడా స్పిన్నే’ అని చెప్పారు.
12 బిల్లులకు ఆమోదం
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో 12 బిల్లుల్ని ఆమోదించిన రాజ్యసభ శుక్రవారం నిరవధికంగా వాయిదాపడింది. ఏప్రిల్ 25న ప్రారంభమైన కార్యకలాపాలు 69 గంటల పాటు సాగగా 19 గంటల సమయం వృథా అయ్యింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన, అగస్టా స్కాంపై ఆందోళనలతో అనేకసార్లు వాయిదాపడింది. ముగింపు సందర్భంగా చైర్మన్ హమిద్ అన్సారీ మాట్లాడుతూ.. సమావేశాలు తక్కువ సమయమే ఉన్నా సవాలుగా సాగాయన్నారు. చర్చ, నిరసనల సందర్భంగా సభ్యులు అద్భుతప్రతిభ ప్రదర్శించారన్నారు.
ఈ సమావేశాల్లో కీలకమైన ఆర్థిక బిల్లు, దివాలా బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కాగా ఈ సెషన్‌లోనే మాల్యా తన పదవికి రాజీనామా చేశారు. కొత్తగా ఎన్నికైన వారితో పాటు, తిరిగి ఎన్నికైన 13 మంది ప్రమాణం చేశారు. కాగా, కేంద్రం విపక్షాలతోపాటు, అధికారులు, జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకే ఎక్కువ సమయం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తీవ్రంగా విమర్శించారు. దీనికోసం వివిధ విచారణ సంస్థలు, మీడియాలోని ఓ వర్గం సాయంతో ఈ విభాగాన్ని నడిపిస్తోందన్నారు.