
సాక్షి, హైదరాబాద్ : న్యాయవ్యవస్థకు సమస్యలు కొత్త కాదని, గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని స్వతంత్రంగా నిలిచిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. భేదాభిప్రాయాలు, వాదోపవాదాలు సమస్య పరిష్కారదిశగా ఉండాలని, లేనిపక్షంలో మూడో వ్యవస్థ పెత్తనం చేసేందుకు సిద్ధంగా ఉందని.. అదే జరిగితే న్యాయవ్యవస్థ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు (మూడో వ్యవస్థ ఏదో ఆయన పేర్కొనలేదు).
శుక్రవారం రాత్రి ఉమ్మడి హైకోర్టు ఆవరణలో తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాద సం ఘాల వార్షికోత్సవ సభలో జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాయవ్యవస్థ సంధి కాలంలో ఉందని, మా ర్పులను ఆహ్వానించాలని.. రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తూనే పరీక్షలను నెగ్గుకురావాల్సిన సమయమిదని ఆయన పేర్కొన్నారు.
ఖాళీల భర్తీకి ప్రయత్నిద్దాం..
ఉమ్మడి హైకోర్టులో చాలా రోజులుగా ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉందని.. ఎప్పుడు భర్తీ అవుతుందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే తెలియదని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. ఈ నెలాఖరులోగా ప్రధాన న్యాయమూర్తి పోస్టు భర్తీ కాకపోతే... కనీసం ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టులను భర్తీ చేయాలని సీజేఐని కోరాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి సూచించారు.
కొలీజియంతో మాట్లాడి ఖాళీల భర్తీకి ప్రయత్నిస్తానన్నారు. ఢిల్లీలోని జిల్లా కోర్టుల్లో పదేళ్ల సర్వీసు ఉన్న న్యాయవాదులకు కోర్టు ఆవరణలో చాంబర్లు ఉంటాయని.. అదే తరహాలో తెలంగాణ, ఏపీల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలోలా సివిల్, క్రిమినల్ కేసులు మాత్రమే చేస్తే సరిపోదని.. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్, టెక్నాలజీ, విభిన్న ట్రిబ్యునల్‌ల కేసులు వాదించే పరిజ్ఞానం పెంచుకోవాలని యువ న్యాయవాదులకు సూచించారు.
సీజే భర్తీ చిదంబర రహస్యం: ఏసీజే
ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదని, అదో చిదంబర రహస్యంగా మారిందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ వ్యాఖ్యానించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణను న్యాయవాదులు సన్మా నించారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ న్యాయవాదుల సంఘాల పూర్వపు అధ్యక్షులు చల్లా ధనంజయ, జల్లి కనకయ్య, కొత్త అధ్యక్షులుగా ఎన్నికైన కె.బి.రామన్నదొర, సి.దామోదర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.
పారదర్శకంగా లేదనేది అపోహ..
న్యాయవ్యవస్థ పారదర్శకంగా లేదనేది అపోహ అని.. ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియాకు కూడా అదే అభిప్రాయముందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కోర్టులో కేసు దాఖలు చేయడం దగ్గరి నుంచి వాదనల వరకు అన్నీ బహిరంగంగానే జరుగుతాయన్నారు. కేసుల విచారణలో జాప్యం, పెండింగ్ కేసులకు న్యాయవ్యవస్థే కారణమనే విమర్శలు ఉన్నాయని.. చివరికి చిన్నపిల్లల మాదిరిగా జడ్జీలకు సెలవులు ఎందుకనే విమర్శలూ చేస్తున్నారని పేర్కొన్నారు.
కోర్టుల్లో కనీస వసతులు లేకపోవడంపై.. ఏళ్ల తరబడి సగం సగం సిబ్బంది, సగం మంది జడ్జీలతోనే కోర్టులు పనిచేయడంపై ఎవరూ అడగడం లేదేమని ప్రశ్నించారు. కోర్టుల్లో పారదర్శక లేదనేది అపోహేనని నిరూపించాలంటే.. దిగువ స్థాయి కోర్టులన్నింటిలో మాతృభాషలో వాద ప్రతివాదనలు, తీర్పులు వెలువరించాల్సిన అవసరముందని చెప్పారు.