న్యాయవ్యవస్థను స్వతంత్రంగానే ఉంచాలి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థకు ఉన్న స్వాతంత్య్ర స్వభావాన్ని ఎంతమాత్రం వూర్చడానికి వీలు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా అన్నారు. దాంట్లో ఏవైనా మార్పులు చేయాలనుకున్నా, అటువంటి ప్రయుత్నాలను తిప్పికొట్టే సత్తా న్యాయవ్యవస్థకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో ఉన్నతస్థాయి నియామకాలకు సంబంధించి కొలీజియం పద్ధతికి స్వస్తిచెప్పడానికి ప్రయుత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో పార్లమెంట్ చేసిన చట్టం గురించి ఆయన నేరుగా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కానీ, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని హరించే ఎలాంటి ప్రయత్నమైనా విఫలంకాక తప్పదని పేర్కొన్నారు.
ప్రజలు విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే న్యాయవ్యవస్థకు స్వేచ్ఛ అవసరవుని అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక వ్యవస్థకాని, వురేఇతర విభాగంకాని తప్పుచేస్తే తవుకు అండగా ఒక వ్యవస్థ ఉందనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ లోధా అన్నారు. శనివారం ‘రూల్ ఆఫ్ లా’ అనే అంశంపై ఏర్పాటైన సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యాయవ్యవస్థపై బురదజల్లేందుకు ప్రయత్నించే వ్యక్తులను దూరంగా పెట్టాలని న్యాయవేత్తలను కోరారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించాలనుకునే ఎలాంటి ప్రయుత్నమైనా విఫలం కాకతప్పదని, ఈ రంగంలో తనకున్న 21 ఏళ్ల అనుభవంతో ఆ విషయం చెబుతున్నానన్నారు. కాగా, ఈ వ్యవస్థలో అవినీతి లేకుండా చూడాల్సిన అవసరం ఉందనిఅభిప్రాయపడ్డారు.
న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది ...
న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని, ఈ వ్యవస్థ పవిత్రమైందని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో అన్నారు. ఈ వ్యవస్థ స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు.