రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీయొద్దు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
జడ్జీలు సంయమనంతో వ్యవహరించాలి
న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు
తమ పరిధులకు లోబడి ఉండాలి
భోపాల్: న్యాయవ్యవస్థ క్రియాశీలత ఇతర వ్యవస్థల ఉనికిని దెబ్బతీసేలా ఉండకూడదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జడ్జీలను హెచ్చరించారు. అధికారాన్ని వాడేటప్పుడు సమతౌల్యం, సంయమనం పాటించాలని సూచించారు. ‘అన్ని వ్యవస్థలకన్నా రాజ్యాంగమే అత్యున్నతమైంది. ప్రజాస్వామ్యానికి కీలకమైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధులకు లోబడి వ్యవహరించాలి. ఇతర వ్యవస్థల పరిధిలో జోక్యంచేసుకుని వాటి పనితీరుకు ఆటంకాలు సృష్టించరాదు. రాజ్యాంగం నిర్ధేశించిన విధులు సాఫీగా నిర్వర్తించడానికి దోహదపడాలి. ఇతర వ్యవస్థలతో సమస్య వచ్చినప్పుడు న్యాయమూర్తులు సంయమనంతో వ్యవహరించాలి. రాజ్యాంగంలో ఈ మూడు వ్యవస్థల అధికారాలను నిర్దిష్టంగా పేర్కొన్నారు’ అని అన్నారు. శనివారం ఇక్కడ జాతీయ జ్యుడీషియల్ అకాడమీలో సుప్రీం కోర్టు జడ్జీలు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగించారు.
‘శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాలు న్యాయసమీక్షకు లోబడి ఉంటాయి. ఈ సందర్భంలోనే న్యాయవ్యవస్థ అన్ని వేళల్లో సంయమనం, క్రమశిక్షణ పాటించాలని, ఇదే న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండడం అవసరం. అప్పుడే ప్రజలకు నిస్పాక్షిక న్యాయం లభిస్తుంది. ప్రత్యేకించి దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇది అవసరం. న్యాయసమీక్ష న్యాయవ్యవస్థకు మూలాధారం. దేశంలో న్యాయవ్యవస్థ పరిధి విస్తరించడం మంచి పరిణామం. పౌరుల హక్కుల పరిరక్షణకు కోర్టులు పోస్టుకార్డుల ద్వారా అందే ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా స్పందిస్తూ న్యాయాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి చర్యలవల్ల సాధారణ ప్రజలకు న్యాయం అందుతోంది’ అని అన్నారు. కోర్టులు చట్టాల్లో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ అన్యాయాలను నియంత్రిస్తున్నాయని అన్నారు. సమాజంలో రూల్ ఆఫ్‌లా, స్వేచ్ఛలను కాపాడడంలో కోర్టులది అద్వితీయ స్థానమని ప్రశంసించారు. న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజల నమ్మకాన్ని ఎల్లవేళలా కాపాడాలని అన్నారు. సామాన్యులకు కోర్టు ఖర్చులు భారం కాకూడదని సూచించారు. దేశ విలువలు కాపాడడంలో, ప్రభుత్వానికి మార్గదర్శకంగా వ్యవహరించడంలో సుప్రీంకోర్టు పాత్ర ప్రశంసనీయమని అన్నారు. కాగా, కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోవడం ఆందోళనకరమైన అంశమని, వివిధ మార్గాల్లో కేసులను సత్వరంగా పరిష్కరించాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్విల్‌కర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెండింగ్‌లో 3 కోట్ల కేసులు: సదానంద గౌడ
దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు మూడుకోట్ల మేర కేసులు పెండింగ్‌లో ఉండడంపై న్యాయ మంత్రి సదానంద గౌడ ఆందోళన వ్యక్తంచేశారు. గత మూడేళ్లుగా పెండింగ్ కేసుల పరిష్కారానికి తీవ్రంగా కృషి జరుగుతున్నప్పటికీ, ఇంకా మూడుకోట్లమేర కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.