ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా లేదు
న్యాయవ్యవస్థ శక్తివంతమైందే కానీ అందుబాటులో లేదు: ప్రణబ్
‘న్యాయానికి’ విశ్వాస పరీక్ష: సీజేఐ
అలహాబాద్: న్యాయవ్యవస్థ వేగవంతమైన, చవకైన న్యాయాన్ని అందించటంలో ప్రజల ఆకాంక్షలను ఇంకా చేరుకోలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అలహాబాద్ హైకోర్టు ఏర్పాటుచేసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘సామాన్యుడికి న్యాయం అందుబాటులోకి వచ్చేలా చొరవతీసుకోవాలి. న్యాయాన్ని పరిరక్షిస్తున్న ఉన్నతమైన సంస్థగా, ప్రజల హక్కులను కాపాడే పవిత్రమైన ఆలయంగా ప్రజల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత సుప్రీం కోర్టుదే. భారత న్యాయవ్యవస్థ ఎంతో శక్తివంతమైనప్పటికీ.. పూర్తిస్థాయిలో ప్రజలకు న్యాయం అందలేకపోతోంది’ అని అన్నారు. దేశంలో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలోని మూడు ముఖ్యమైన స్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థకే.. చట్టంలోని లోపాలు ఎత్తిచూపి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాల్సిన బాధ్యత కూడా ఉందన్నారాయన.
ఇంటి సవాళ్లే ఎక్కువయ్యాయి: ఠాకూర్
కాగా, అంతర్గతంగా ఉన్న సవాళ్ల కారణంగా న్యాయవ్యవస్థ విశ్వాస పరీక్ష ఎదుర్కుంటోందని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అన్నారు. ‘న్యాయవ్యవస్థపై ప్రజల్లో చాలా అంచనాలుంటాయి. వీటికి ఎదుర్కునేందుకు మన(న్యాయ) వ్యవస్థపై ఇంటా, బయటా చాలా సవాళ్లుంటాయి. బయటి సవాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చు. లోపలివే చాలా ఇబ్బందికరం. లోపలి సవాళ్లను పరిష్కరించుకోకపోతే.. న్యాయవ్యవస్థ విశ్వసనీయత కోల్పోతుంది’ అని అన్నారు. బార్ కౌన్సిల్ సరిగ్గా సహకరిస్తే పాత కేసులను పరిష్కరించేందుకు న్యాయమూర్తులు సిద్ధంగా ఉన్నారన్నారు. బడుగులు, సమస్యలపై గొంతెత్తే వారికి న్యాయవ్యవస్థ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
‘కోర్టు’ రికార్డింగ్‌పై పునరాలోచించండి
పారదర్శకత, కేసులు త్వరగా తేల్చేందుకు కోర్టు వ్యవహారాల రికార్డింగు కావాలని కేంద్రం మరోసారి సుప్రీం కోర్టును కోరింది. దీనిపై ఇటీవలే సీజేఐ విముఖత వ్యక్తం చేసినా.. పున:పరిశీలించాలని కేంద్ర న్యాయమంత్రి డీవీ సదానందగౌడ లేఖ రాశారు. గతేడాది రాసిన లేఖపై సమాధానం రాకపోవటంతో.. మొన్నటి జనవరిలోనూ గౌడ మరో లేఖ రాశారు. కోర్టు వ్యవహారాలను ఆడియో-వీడియో రికార్డింగు చేయాలంటూ.. న్యాయశాఖకు చాలా సలహాలందుతాయన్నారు. కింది కోర్టుల్లో ఈ పద్ధతిని పరిశీలించటం ద్వారా స్పష్టమైన అవగాహన వస్తుందని.. దీని ఆధారంగా.. పైకోర్టుల విషయంలో ఆలోచ చేయాలన్నారు. పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యతిరేకించినప్పటికీ. ఈ వ్యవహారాన్ని మరోసారి పరిశీలించాలని కేంద్రం సూచించింది.
11.5 కోట్ల ఉద్యోగాలు
వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా 11.5 కోట్ల వ్యవసాయేతర ఉద్యోగాలు కావాలని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు. ఢిల్లీలో స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి కల్పన అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. స్వయం సహాయక ఉపాధిని పెంచుకోవటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.