నేర విచారణ ప్రక్రియ ఇలా... | Sakshi Guest Column On Criminal investigation process | Sakshi
Sakshi News home page

నేర విచారణ ప్రక్రియ ఇలా...

Published Fri, Sep 22 2023 3:57 AM | Last Updated on Fri, Sep 22 2023 3:57 AM

Sakshi Guest Column On Criminal investigation process

ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. పేదలు–ధనికులు, చిన్న–పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. అందరూ చట్టాన్ని గౌరవిస్తూ పాటించాల్సిందే. చట్టాలు అమలు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, న్యాయవ్యవస్థలు పని చేస్తాయి. బాధ్యత గల పౌరులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య వాటాదారులు కాబట్టి, ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతోంది అనే అవగాహన కూడా వారికి ఉండాలి. ఆ అవగాహన వారికి ఉంటేనే ప్రజాప్రతినిధుల పనితీరును సరిగ్గా అవగతం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడతారు.

ఏదైనా కాగ్నిజబుల్‌ అఫెన్స్‌ (గుర్తించతగిన నేరం) జరిగితే పోలీసు వారికి ప్రజల నుంచి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. మూడు సంవ త్సరాలు అంతకు ఎక్కువ శిక్షపడే నేరాలను కాగ్నిజబుల్‌ అఫెన్స్‌లు అంటారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు మేజిస్ట్రేట్‌ వారెంట్‌ లేకుండా ఇతర నిబంధనలకు లోబడి నిందితులను అరెస్టు చేయవచ్చు.

కాగ్నిజబుల్‌ అఫెన్సులపై ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు దాని ఆధారంగా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేసి సంబంధించిన మేజిస్ట్రేట్‌కు పంపిస్తారు. అది మొట్టమొదటి నివేదిక కాబట్టే దాన్ని ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. మూడేళ్ళ కంటే తక్కువ శిక్షలు పడే నేరాలను నాన్‌–కాగ్నిజబుల్‌ అఫెన్సులు అంటారు. వీటిని కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రైవేట్‌ కంప్లైట్‌ ఆధారంగా కోర్టు ఇచ్చే ఉత్తర్వుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు వెళ్ళవచ్చు. 

ఎఫ్‌ఐఆర్‌ అనేది కాగ్నిజబుల్‌ అఫెన్సు జరిగింది అనే విషయాన్ని తెలియజేసే పత్రం మాత్రమే. ఒక నేరం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉండవచ్చు. అలాంటి సందర్భంలో సహజంగా నిందితుల పేర్లను పొందుపరచడం జరుగుతుంది. అయితే ఎఫ్‌ఐఆర్‌ ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. పోలీసుల దర్యాప్తులోనే అందులోని నిజానిజాలు, నిందితుల పాత్రలు నిర్ధారించడం జరుగుతుంది.

ఫిర్యాదులో నిందితుల పేర్లు లేవు కదా అని దాన్ని స్వీకరించకపోడా నికీ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఉండటానికీ ఆస్కారం లేదు. ఉదాహరణకు దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు లేవు. పోలీసుల దర్యాప్తు లోనే ఆ పేర్లు, వారి పాత్రలు వెలుగులోకి వచ్చాయి.

ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, ప్రజల సొమ్ము కొల్లగొట్టడం వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అందరి పేర్లు ఎఫ్‌ఐ  ఆర్‌లో చేర్చడం మామూలుగా జరగదు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనేక పత్రాలను పరిశీలించడం, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే బాధ్యులైన నిందితుల పేర్లు వెలుగులోకి వస్తాయి.

అరెస్టు అయిన వ్యక్తికీ కొన్ని హక్కులు ఉంటాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిందితుడికి అందుకు కారణాలు చెప్పాలి. బెయిలబుల్‌ అఫెన్సు అయితే ఆ విషయం తెలియపరుస్తూ బెయిల్‌ బాండ్స్‌ ఇస్తే విడుదల చేస్తామనీ నిందితుడికి వివరించాలి. నింది తుడికి సంబంధించిన వ్యక్తికి అరెస్టు కార్డ్‌ ఇవ్వాలి. ఎలాంటి సాక్ష్యా ధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లైతే 24 గంటల్లో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌లోని (సీఆర్పీసీ) సెక్షన్‌ 167 చెప్తుంది. అయితే ఆ అరెస్టు వేరే ప్రాంతంలో జరిగితే ప్రయాణ సమయాన్ని అదనంగా పరిగణించాలనే నిబంధనా ఉంది. నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందితేనే 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిస్తారు.

కేవలం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న వారినే పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కూడా అరెస్టు చేసిన నాటి నుంచి 14 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరంలో నిందితుడి పాత్రపై కీలక విషయాలను రాబట్టడా నికి పోలీసు కస్టడీ దోహదం చేస్తుంది. 

జ్యుడీషియల్‌ రిమాండ్‌ కోరినప్పుడు నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించే, కోర్టు తగిన ఆదేశాలు ఇస్తుంది. ఈ ఆధారాలు లేకుంటే జ్యుడీషియల్‌ రిమాండ్‌ను మేజిస్ట్రేట్‌ తిరస్కరించవచ్చు. ఇలా తిరస్కరించినప్పుడు నిందితునికి బెయిల్‌ ఇచ్చి పంపించివేస్తారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌ దశలో నిందితుడిని నేరం చేశారా, లేదా? అనే అంశాన్ని న్యాయమూర్తి అడగరు.

కేవలం పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా? వంటివి మాత్రమే అడుగుతారు. పోలీసులు తనను కొట్టారని నిందితుడు వెల్లడిస్తే వెంటనే ఆస్పత్రికి పంపడానికీ, ఊండ్స్‌ సర్టిఫికెట్‌ తీసుకోవ డానికీ తగిన చర్యలు తీసుకుంటారు. పోలీసు కస్టడీలో నిందితుడిని కొట్టారని రుజువైతే సంబంధిత పోలీసులపై అదే కోర్టులో కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. 

పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తారు. సీఆర్పీసీలోని సెక్షన్‌ 161 కింద నమోదు చేసే ఈ వాంగ్మూలాల్లో సాక్షుల సంతకాలు తీసుకోకూడదు. ఈ వాంగ్మూలాలను సాక్ష్యాలుగానూ పరిగణించకూడదు. కేవలం వాటిని దర్యాప్తు నిమిత్తం, కోర్టులో సాక్షుల వాంగ్మూలాల కచ్చిత త్వాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగించవచ్చు. సీఆర్పీసీ సెక్షన్‌ 164 కింది సాక్షుల వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేయ వచ్చు. ఆ వాంగ్మూలాల కింద సాక్షుల సంతకాలు తీసుకుంటారు.

అందువల్ల ఈ వాంగ్మూలానికి విరుద్ధంగా సాక్షి కోర్టులో సాక్ష్యం చెబితే అందుకు అతడు బాధ్యుడు అవుతాడు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కోర్టులో నిందితుల విచారణ నిమిత్తం అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కోర్టు సీఆర్పీసీలోని సెక్షన్‌ 190 కింద నేరాన్ని కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంటుంది. అభియోగం చేసిన నేరారోపణలపై ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే కోర్టు పరిగణనలోకి తీసుకోదు.

ఈ దశలో సదరు కేసు విచారణ అదే మేజిస్ట్రేట్‌ పరిధిలో ఉంటే దానికి సీసీ నంబర్‌ ఇస్తారు. అందులోని సెక్షన్ల ప్రకారం కేసు సెషన్స్‌  న్యాయమూర్తి ట్రయల్‌ నిర్వహించాల్సి ఉంటే పీఆర్సీ నంబర్‌ ఇచ్చి ఫైల్‌ను సంబంధిత కోర్టుకు పంపిస్తారు. చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణన లోకి తీసుకున్న తర్వాత సమన్లు జారీ చేయడం ద్వారా ఓ తేదీ ఖరారు చేసి నిందితులను న్యాయస్థానానికి పిలుస్తారు. నిందితుడు హాజరైన తర్వాత చార్జ్‌షీట్‌తో పాటు ప్రాసిక్యూషన్‌  వాళ్ళు కోర్టుకు సమర్పించిన ప్రతి డాక్యుమెంట్‌ను ఉచితంగా అందిస్తారు.

ఈ తర్వాత హియరింగ్‌ డేట్‌ ఇచ్చి, ఆపై ఫ్రేమింగ్‌ ఆఫ్‌ చార్జెస్‌ ప్రక్రియ చేపడతారు. ఈ సంద ర్భంలో చార్జ్‌షీట్‌లోని ఆరోపణలను నిందితుల ముందు చదువు తారు. ఈ దశలో ఏ నిందితుడైనా తనపై ప్రాసిక్యూషన్‌  ఆరోపించిన సెక్షన్లు చెల్లవని భావిస్తే డిస్‌చార్జ్‌ పిటిషన్‌ వేసుకోవచ్చు. ఈ పిటిషన్లు డిస్మిస్‌ అయిన తర్వాత మాత్రమే నిందితులపై చార్జెస్‌ ఫ్రేమింగ్‌ జరుగుతుంది. ఈ దశలో న్యాయమూర్తి నిందితులను ఉద్దేశించి నేరం అంగీకరిస్తావా? అని ప్రశ్నిస్తారు. అంగీకరిస్తే (ప్లీడెడ్‌ గిల్టీ) వెంటనే శిక్ష విధిస్తారు. అంగీకరించకపోతే (డినై) కేసు ట్రయల్‌ నిర్వహిస్తారు. 

కేసు ట్రయల్‌ దశలో న్యాయస్థానం సాక్షులకు సమన్లు జారీ చేస్తుంది. సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత సీఆర్పీసీలోని సెక్షన్‌  313 ప్రకారం నిందితులకు ఓ అవకాశం ఉంటుంది. ఏ నిందితుడిపై ఏ సాక్షి ఏం చెప్పాడనేది వారికి తెలియపరుస్తారు. దానిపై వాళ్లు ఏం చెప్పాలనుకున్నది తెలుసుకుని రికార్డు చేస్తారు. ఈ సందర్భంలోనే నిందితుల తరఫున ఎవరైనా సాక్షులు ఉన్నారా? అనేది న్యాయమూర్తి అడుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటే లిస్ట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ విట్నెస్‌ రూపొందించి, వారికి సమన్లు ఇచ్చి కోర్టుకు పిలుస్తారు. ఆపై వీరి వాంగ్మూలం నమోదు, ప్రాసిక్యూషన్‌  నిర్వహించే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియ జరుగుతాయి. ఇది పూర్తయిన తర్వాత నిర్ణీత సమయం ఇచ్చి, ఆపై వాదోపవాదాలు మొదలవుతాయి. 

నిందితుడికి తెలియకుండా న్యాయమూర్తి సాక్ష్యాలు రికార్డు చేయరు. ప్రతి సాక్ష్యమూ అతడి ప్రత్యక్షంలోనే చేస్తారు. సీఆర్పీసీ సెక్షన్‌ 317 ఆధారంగా దాఖలు చేసే పిటిషన్‌  ద్వారా నిందితుడు కోరితేనే అతడి న్యాయవాది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏ దశలోనూ పౌరుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే చట్టంలో నిందితుడికి ఇన్ని సౌలభ్యాలు కల్పించారు. బాధ్యత గల పౌరులు ఎవ రైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. వాదోప వాదాలు విన్న తర్వాత కోర్టు వారు ఓ తేదీ ఇచ్చి తీర్పు వెలువరిస్తారు.
– జస్టిస్‌ జి. కృష్ణ మోహన్‌ రెడ్డి
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement