Criminal investigation
-
పోలీసులకు ‘ఆంబిస్’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్ (ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి ఐదు పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఆంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సైతం అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పారు. ఆంబిస్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఏమిటీ ఆంబిస్? నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అర చేతిముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫిస్ (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) సాంకేతికతను వినియోగిస్తోంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ (ఏఎంబీఐఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ప్రకారం నేరస్థుల వేలి ముద్రలు, చేతి ముద్రలతోపాటు ఐరిష్ స్కాన్, ముఖ చిత్రాలు (ఫేషియల్ ఇమేజెస్), కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు. ఇలా వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన ఆంబిస్ సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఆంబిస్ పూర్తిగా ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్‌ప్రింట్ ఆల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తుంది. నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతికత ఎంతో వేగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలిముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతికత ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ ఆంబిస్ సాంకేతికత కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్‌లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్‌లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం గమనార్హం. -
Trump: యూఎస్ సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. అధ్యక్షులకు న్యాయ విచారణ నుంచి కొంతమేరకు రక్షణ ఉంటుందని తొలిసారిగా అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ‘రాజ్యాంగబద్ధమైన అధికార పరిధిలో తీసుకునే నిర్ణయాలకు మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇది అధికారిక నిర్ణయాలకు మాత్రమే వరిస్తుంది. అనధికారిక చర్యలకు ఎలాంటి రక్షణ పొందలేరు’ అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ మెజారిటీ తీర్పు(6–3)లో పేర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించకుండా ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలపై డొనాల్డ్ ట్రంప్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు అప్పగించింది. ఫలితంగా అధ్యక్ష ఎన్నిక జరిగే నవంబర్ 5 లోగా ట్రంప్ విచారణను ఎదుర్కొనే అవకాశాలు లేనట్టే. ‘మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి మినహాయింపు అధ్యక్ష వ్యవస్థనే పునర్వవస్థీకరిస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే రాజ్యాంగ సూత్రాలను, భూమికను, ప్రభుత్వ వ్యవస్థను అవహేళన చేయడమే’ అని జస్టిస్ సోనియా సొటోమేయర్ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేయగా.. అధ్యక్షుడు బైడెన్ ఈ తీర్పుపై స్పందిస్తారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. అట్లాంటా బిగ్ డిబేట్ తర్వాత మళ్లీ బైడెన్ మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం. -
నేర విచారణ ప్రక్రియ ఇలా...
ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. పేదలు–ధనికులు, చిన్న–పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. అందరూ చట్టాన్ని గౌరవిస్తూ పాటించాల్సిందే. చట్టాలు అమలు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, న్యాయవ్యవస్థలు పని చేస్తాయి. బాధ్యత గల పౌరులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య వాటాదారులు కాబట్టి, ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతోంది అనే అవగాహన కూడా వారికి ఉండాలి. ఆ అవగాహన వారికి ఉంటేనే ప్రజాప్రతినిధుల పనితీరును సరిగ్గా అవగతం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడతారు. ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తించతగిన నేరం) జరిగితే పోలీసు వారికి ప్రజల నుంచి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. మూడు సంవ త్సరాలు అంతకు ఎక్కువ శిక్షపడే నేరాలను కాగ్నిజబుల్ అఫెన్స్‌లు అంటారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు మేజిస్ట్రేట్ వారెంట్ లేకుండా ఇతర నిబంధనలకు లోబడి నిందితులను అరెస్టు చేయవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్సులపై ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు దాని ఆధారంగా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి సంబంధించిన మేజిస్ట్రేట్‌కు పంపిస్తారు. అది మొట్టమొదటి నివేదిక కాబట్టే దాన్ని ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. మూడేళ్ళ కంటే తక్కువ శిక్షలు పడే నేరాలను నాన్–కాగ్నిజబుల్ అఫెన్సులు అంటారు. వీటిని కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రైవేట్ కంప్లైట్ ఆధారంగా కోర్టు ఇచ్చే ఉత్తర్వుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు వెళ్ళవచ్చు. ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్సు జరిగింది అనే విషయాన్ని తెలియజేసే పత్రం మాత్రమే. ఒక నేరం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉండవచ్చు. అలాంటి సందర్భంలో సహజంగా నిందితుల పేర్లను పొందుపరచడం జరుగుతుంది. అయితే ఎఫ్ఐఆర్ ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. పోలీసుల దర్యాప్తులోనే అందులోని నిజానిజాలు, నిందితుల పాత్రలు నిర్ధారించడం జరుగుతుంది. ఫిర్యాదులో నిందితుల పేర్లు లేవు కదా అని దాన్ని స్వీకరించకపోడా నికీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండటానికీ ఆస్కారం లేదు. ఉదాహరణకు దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు లేవు. పోలీసుల దర్యాప్తు లోనే ఆ పేర్లు, వారి పాత్రలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, ప్రజల సొమ్ము కొల్లగొట్టడం వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అందరి పేర్లు ఎఫ్ఐ ఆర్‌లో చేర్చడం మామూలుగా జరగదు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనేక పత్రాలను పరిశీలించడం, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే బాధ్యులైన నిందితుల పేర్లు వెలుగులోకి వస్తాయి. అరెస్టు అయిన వ్యక్తికీ కొన్ని హక్కులు ఉంటాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిందితుడికి అందుకు కారణాలు చెప్పాలి. బెయిలబుల్ అఫెన్సు అయితే ఆ విషయం తెలియపరుస్తూ బెయిల్ బాండ్స్ ఇస్తే విడుదల చేస్తామనీ నిందితుడికి వివరించాలి. నింది తుడికి సంబంధించిన వ్యక్తికి అరెస్టు కార్డ్ ఇవ్వాలి. ఎలాంటి సాక్ష్యా ధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లైతే 24 గంటల్లో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని క్రిమినల్ ప్రోసీజర్ కోడ్‌లోని (సీఆర్పీసీ) సెక్షన్ 167 చెప్తుంది. అయితే ఆ అరెస్టు వేరే ప్రాంతంలో జరిగితే ప్రయాణ సమయాన్ని అదనంగా పరిగణించాలనే నిబంధనా ఉంది. నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందితేనే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తారు. కేవలం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వారినే పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కూడా అరెస్టు చేసిన నాటి నుంచి 14 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరంలో నిందితుడి పాత్రపై కీలక విషయాలను రాబట్టడా నికి పోలీసు కస్టడీ దోహదం చేస్తుంది. జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పుడు నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించే, కోర్టు తగిన ఆదేశాలు ఇస్తుంది. ఈ ఆధారాలు లేకుంటే జ్యుడీషియల్ రిమాండ్‌ను మేజిస్ట్రేట్ తిరస్కరించవచ్చు. ఇలా తిరస్కరించినప్పుడు నిందితునికి బెయిల్ ఇచ్చి పంపించివేస్తారు. జ్యుడీషియల్ రిమాండ్ దశలో నిందితుడిని నేరం చేశారా, లేదా? అనే అంశాన్ని న్యాయమూర్తి అడగరు. కేవలం పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా? వంటివి మాత్రమే అడుగుతారు. పోలీసులు తనను కొట్టారని నిందితుడు వెల్లడిస్తే వెంటనే ఆస్పత్రికి పంపడానికీ, ఊండ్స్ సర్టిఫికెట్ తీసుకోవ డానికీ తగిన చర్యలు తీసుకుంటారు. పోలీసు కస్టడీలో నిందితుడిని కొట్టారని రుజువైతే సంబంధిత పోలీసులపై అదే కోర్టులో కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తారు. సీఆర్పీసీలోని సెక్షన్ 161 కింద నమోదు చేసే ఈ వాంగ్మూలాల్లో సాక్షుల సంతకాలు తీసుకోకూడదు. ఈ వాంగ్మూలాలను సాక్ష్యాలుగానూ పరిగణించకూడదు. కేవలం వాటిని దర్యాప్తు నిమిత్తం, కోర్టులో సాక్షుల వాంగ్మూలాల కచ్చిత త్వాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగించవచ్చు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింది సాక్షుల వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేయ వచ్చు. ఆ వాంగ్మూలాల కింద సాక్షుల సంతకాలు తీసుకుంటారు. అందువల్ల ఈ వాంగ్మూలానికి విరుద్ధంగా సాక్షి కోర్టులో సాక్ష్యం చెబితే అందుకు అతడు బాధ్యుడు అవుతాడు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కోర్టులో నిందితుల విచారణ నిమిత్తం అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కోర్టు సీఆర్పీసీలోని సెక్షన్ 190 కింద నేరాన్ని కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంటుంది. అభియోగం చేసిన నేరారోపణలపై ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే కోర్టు పరిగణనలోకి తీసుకోదు. ఈ దశలో సదరు కేసు విచారణ అదే మేజిస్ట్రేట్ పరిధిలో ఉంటే దానికి సీసీ నంబర్ ఇస్తారు. అందులోని సెక్షన్ల ప్రకారం కేసు సెషన్స్ న్యాయమూర్తి ట్రయల్ నిర్వహించాల్సి ఉంటే పీఆర్సీ నంబర్ ఇచ్చి ఫైల్‌ను సంబంధిత కోర్టుకు పంపిస్తారు. చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణన లోకి తీసుకున్న తర్వాత సమన్లు జారీ చేయడం ద్వారా ఓ తేదీ ఖరారు చేసి నిందితులను న్యాయస్థానానికి పిలుస్తారు. నిందితుడు హాజరైన తర్వాత చార్జ్‌షీట్‌తో పాటు ప్రాసిక్యూషన్ వాళ్ళు కోర్టుకు సమర్పించిన ప్రతి డాక్యుమెంట్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ తర్వాత హియరింగ్ డేట్ ఇచ్చి, ఆపై ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ప్రక్రియ చేపడతారు. ఈ సంద ర్భంలో చార్జ్‌షీట్‌లోని ఆరోపణలను నిందితుల ముందు చదువు తారు. ఈ దశలో ఏ నిందితుడైనా తనపై ప్రాసిక్యూషన్ ఆరోపించిన సెక్షన్లు చెల్లవని భావిస్తే డిస్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత మాత్రమే నిందితులపై చార్జెస్ ఫ్రేమింగ్ జరుగుతుంది. ఈ దశలో న్యాయమూర్తి నిందితులను ఉద్దేశించి నేరం అంగీకరిస్తావా? అని ప్రశ్నిస్తారు. అంగీకరిస్తే (ప్లీడెడ్ గిల్టీ) వెంటనే శిక్ష విధిస్తారు. అంగీకరించకపోతే (డినై) కేసు ట్రయల్ నిర్వహిస్తారు. కేసు ట్రయల్ దశలో న్యాయస్థానం సాక్షులకు సమన్లు జారీ చేస్తుంది. సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత సీఆర్పీసీలోని సెక్షన్ 313 ప్రకారం నిందితులకు ఓ అవకాశం ఉంటుంది. ఏ నిందితుడిపై ఏ సాక్షి ఏం చెప్పాడనేది వారికి తెలియపరుస్తారు. దానిపై వాళ్లు ఏం చెప్పాలనుకున్నది తెలుసుకుని రికార్డు చేస్తారు. ఈ సందర్భంలోనే నిందితుల తరఫున ఎవరైనా సాక్షులు ఉన్నారా? అనేది న్యాయమూర్తి అడుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటే లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ విట్నెస్ రూపొందించి, వారికి సమన్లు ఇచ్చి కోర్టుకు పిలుస్తారు. ఆపై వీరి వాంగ్మూలం నమోదు, ప్రాసిక్యూషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతాయి. ఇది పూర్తయిన తర్వాత నిర్ణీత సమయం ఇచ్చి, ఆపై వాదోపవాదాలు మొదలవుతాయి. నిందితుడికి తెలియకుండా న్యాయమూర్తి సాక్ష్యాలు రికార్డు చేయరు. ప్రతి సాక్ష్యమూ అతడి ప్రత్యక్షంలోనే చేస్తారు. సీఆర్పీసీ సెక్షన్ 317 ఆధారంగా దాఖలు చేసే పిటిషన్ ద్వారా నిందితుడు కోరితేనే అతడి న్యాయవాది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏ దశలోనూ పౌరుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే చట్టంలో నిందితుడికి ఇన్ని సౌలభ్యాలు కల్పించారు. బాధ్యత గల పౌరులు ఎవ రైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. వాదోప వాదాలు విన్న తర్వాత కోర్టు వారు ఓ తేదీ ఇచ్చి తీర్పు వెలువరిస్తారు. – జస్టిస్ జి. కృష్ణ మోహన్ రెడ్డి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
US presidential election 2024: ట్రంప్ కేసు దారెటు!?
అవినీతి అక్రమాలకు పాల్పడి, న్యాయస్థానంలో నేర విచారణను ఎదుర్కొంటున్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అపకీర్తిని మూటగట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున తానే బరిలో ఉంటానని సంకేతాలిస్తున్నారు. అసలు అది సాధ్యమేనా అన్న చర్చ ప్రపంచమంతటా సాగుతోంది. ట్రంప్‌పై నమోదైన హష్ మనీ చెల్లింపుల కేసులో ఇకపై ఏం జరగవచ్చన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌పై కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందే కేసులను కొట్టివేయించేందుకు ట్రంప్ న్యాయబృందం ప్రయత్నాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చన్నది ఆసక్తికరంగా మారింది... గాగ్ ఆర్డర్ ఇస్తారా? ► డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రమైన అభియోగాలు వచ్చాయని, అవి నిరూపితమైతే ఆయనకు గరిష్ట స్థాయిలో జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ► న్యాయమూర్తులపై ట్రంప్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జువాన్ మెర్చాన్, మన్‌హట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్పై విరుచుకుపడ్డారు. ► ట్రంప్ మంగళవారం మన్‌హట్టన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు హంగామా సృష్టించారు. ఇదంతా న్యాయస్థానానికి చికాకు తెప్పించింది. ► సమాజంలో హింసను ప్రేరేపించే, అశాంతిని సృష్టించే, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలకు, ప్రవర్తనకు దూరంగా ఉండాలని ట్రంప్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చాన్ హితవు పలికారు. ► ఇది జరిగిన ఐదు గంటల తర్వాత ట్రంప్ నోరు పారేసుకున్నారు. జువాన్ మెర్చాన్, అల్విన్ బ్రాగ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ► మెర్చాన్, ఆయన భార్య, ఆయన కుటుంబం తనను ద్వేషిస్తోందని ఆరోపించారు. ఇక అల్విన్ బ్రాగ్ ఒక విఫలమైన జిల్లా అటార్నీ అని ఆక్షేపించారు. ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అల్విన్ బ్రాగ్ ఒక జంతువు, మానసిక రోగి అని ట్రంప్ మండిపడ్డారు. ► ట్రంప్ నోటికి తాళం వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జువాన్ మెర్చాన్ గాగ్ ఆర్డర్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ► గాగ్ ఆర్డర్ జారీ చేస్తే కేసుల గురించి ట్రంప్ గానీ, ఆయన న్యాయబృందం గానీ ఎక్కడా బహిరంగంగా చర్చించకూడదు. ► గాగ్ ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించి కేసు నమోదు చేస్తారు. ట్రంప్‌కు 1,000 డాలర్ల జరిమానా లేదా 30 రోజుల జైలు శిక్ష.. లేదా రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలు అందాక ఏం చేస్తారో? ► ట్రంప్ హష్ మనీ చెల్లించిన కేసులో మన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం గత ఐదేళ్లుగా విచారణ కొనసాగిస్తోంది. ► చెల్లింపుల వ్యవహారాన్ని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అల్విన్బ్రాగ్ చెబుతున్నారు. ► దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూటర్లు ట్రంప్ న్యాయ బృందానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘డిస్కవరీ’ అంటారు. ► ఇది 35 రోజుల్లోగా పూర్తికావాలి. కానీ, అల్విన్ బ్రాగ్ నేతృత్వంలోని ప్రాసిక్యూటర్ల బృందానికి 65 రోజుల సమయం.. అంటే జూన్ 8 దాకా గడువు ఇచ్చారు. సాక్ష్యాలు చేతికి అందాక ట్రంప్ న్యాయవాదులు ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ పోటీ ఖాయమేనా? ► ట్రంప్ లాయర్ల తీర్మానాలపై డిసెంబర్ 4న కోర్టు తీర్పు వెలువడనుంది. ► తీర్మానాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ట్రంప్‌పై అసలైన విచారణ ప్రారంభమవుతుంది. ► వచ్చే ఏడాది జనవరి నుంచి విచారణ చేపట్టాలని తాము కోర్టును కోరుతామని ప్రాసిక్యూటర్లు చెప్పారు. ► మార్చి నుంచి జూన్ వరకూ అమెరికాలో వసంత కాలం. అప్పుడైతే బాగుంటుందని ట్రంప్ లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ► విచారణ మొదలయ్యే నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రైమరీ ఎన్నికల్లో ప్రజలు పార్టీల తరపున పోటీ చేసే నామినీలకు ఓటు వేస్తారు. ► ట్రంప్‌పై విచారణ పూర్తయ్యి, తుది తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. కొత్త అధ్యక్షుడు కొలువుతీరుతాడు. ► 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నిక్షేపంగా పోటీ చేయొచ్చు. ఏ చట్టమూ ఆయనను అడ్డుకోలేదు. ► రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేయడానికి ట్రంప్ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ► ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేస్తే పదవి నుంచి దిగిపోవడమో లేక కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడడమో చేయాల్సి ఉంటుంది. తీర్మానం ప్రవేశపెడతారా? ► ట్రంప్‌ను అన్ని కేసుల నుంచి నిర్దోషిగా బయటకు తీసుకువస్తామని ఆయన తరపు లాయర్లు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ► చట్టప్రకారం చూస్తే విచారణ ప్రారంభం కావడానికి ముందు కేసులన్నింటినీ పునఃపరిశీలించి, ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టును అభ్యర్థించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు కోర్టులో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ► కేసులను పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రంప్ బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే ట్రంప్‌కు విముక్తి లభించినట్లే. అయితే, ఇదంతా ఆయన లాయర్ల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ► ట్రంప్ కేసులను విచారిస్తున్న జడ్జిని విధుల నుంచి తొలగించాలని, విచారణ వేదికను మన్‌హట్టన్ నుంచి సమీపంలోని స్టాటెన్ ఐలాండ్‌కు మార్చాలని కోరుతూ కూడా తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వీలుంది. మన్హట్టన్లో ట్రంప్ అభిమానులు పెద్దగా లేరు. అక్కడ విచారణ జరపడం సమంజసం కాదని ఆయన వాదిస్తున్నారు. ► మామూలుగా అయితే 45 రోజుల్లోగా తీర్మానం ప్రవేశపెట్టాలి. ట్రంప్ బృందానికి జడ్జి మెర్చాన్ ఆగస్టు 8 దాకా గడువు ఇచ్చారు. అంటే నాలుగు నెలలు. ట్రంప్ లాయర్ల తీర్మానంపై ప్రాసిక్యూటర్లు స్పందించడానికి సెప్టెంబర్ 19వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్దేశించారు. ► తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ కచ్చితంగా వాడుకుంటామని, ప్రతి చిన్న అంశాన్ని కూడా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రంప్ న్యాయవాది జోయ్ టాకోపినా చెప్పారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డ ఉదంతం క్రమంగా చినికి చినికి గాలివానగా మారుతోంది. ఆ పత్రాల్లో బ్రిటన్, ఉక్రెయిన్, ఇరాన్‌లకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలున్నట్టు వస్తున్న వార్తలు మరింత దుమారానికి దారి తీస్తున్నాయి. బరాక్ ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటి సదరు పత్రాలు ఆయన పదవి నుంచి తప్పుకున్నాక ఉపయోగించిన ప్రైవేట్ కార్యాలయంలో గత నవంబర్‌లో బయటపడ్డాయి. ఈ అంశం సోమవారం వెలుగులోకి వచ్చింది. వాటి ఉనికిని కనిపెట్టింది బైడెన్ తరఫు లాయర్లేనని, వెంటనే వారు నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చారని ఆయన వర్గం సమర్థించుకున్నా విపక్షాలు ఇప్పటికే దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 2022 ఆగస్టులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోనూ ఇలాగే భారీ సంఖ్యలో రహస్య పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఈ విషయమై ట్రంప్‌పై దర్యాప్తు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నాయి. అదే కోవలో బైడెన్ కూడా విచారణ ఎదుర్కోక తప్పదంటున్నారు. దీనిపై అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్కు ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందింది. నేషనల్ ఆర్కైవ్స్, రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని తనకు నివేదించగానే దీనిపై విచారణ బాధ్యతలను షికాగో అటార్నీ జాన్ లాష్చ్ జూనియర్‌కు గార్లండ్ అప్పగించారు. ఆయన నుంచి ఇప్పటికే అన్ని వివరాలూ తెప్పించుకున్నారు. బైడెన్‌పై పూర్తిస్థాయి నేర విచారణ ప్రారంభించాలా, వద్దా అన్న కీలక అంశంపై గార్లండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రంప్ రహస్య డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది గార్లండే కావడం విశేషం! అధ్యక్షుల నిజాయితీకి అత్యంత ప్రాధాన్యమివ్వడమే గాక వారి ప్రవర్తన విషయంలో అత్యంత పట్టింపుగా ఉండే అమెరికాలో చివరికిది బైడెన్ పదవికి ఎసరు పెడుతుందా అన్నది చూడాలి. ఏం జరిగింది? బైడెన్ వద్ద పలు రహస్య పత్రాలు బయట పడ్డట్టు సోమవారం అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో వైట్‌హౌస్ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. 2022 నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్లో ఉన్న బైడెన్ ప్రైవేట్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న సందర్భంగా అందులో పలు రహస్య పత్రాలను ఆయన లాయర్లు కనుగొన్నట్టు పేర్కొంది. అవన్నీ ఒబామా అధ్యక్షునిగా, బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటివని, అంటే 2013–16 నాటివని చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే పలు పత్రాలు కూడా వీటిలో ఉన్నాయి! అవి రహస్య పత్రాలని తెలియగానే తన లాయర్లు వెంటనే నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చి వాటిని అప్పగించారని బైడెన్ చెప్పుకొచ్చారు. ఉపాధ్యక్షునిగా పదవీకాలం ముగిశాక 2017 నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ కార్యాలయాన్ని వాడుకున్నారు. ఆ పత్రాల్లో ఏముంది? బైడెన్ ఆఫీసులో దొరికినవి మామూలు రహస్య పత్రాలేనంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే వాటిలో బ్రిటన్, ఇరాన్, ఉక్రెయిన్లకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు సేకరించిన అత్యంత రహస్య సమాచారం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తదితర వార్తా సంస్థలు తాజాగా వెల్లడించడం సంచలనం రేపుతోంది. కావాలనే ఆలస్యంగా బయట పెట్టారా? రహస్య పత్రాలు ప్రైవేట్ కార్యాలయంలో దొరకడం ఒక ఎత్తైతే, దాన్ని ఇంతకాలం దాచి ఉంచడం బైడెన్‌కు మరింత ఇబ్బందికరంగా మారేలా కన్పిస్తోంది. 2022 నవంబర్ 2న ఈ పత్రాలు వెలుగు చూసినప్పటికి అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికలు మరో వారంలోపే ఉన్నాయి. పత్రాల విషయం అప్పుడే బయటికొస్తే ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లకు పెద్ద ఎదురుదెబ్బే తగిలేది. అందుకే దీన్ని దాచి ఉంచినట్టు తేలితే బైడెన్‌కు మరింత తలనొప్పిగా మారడం ఖాయం. మధ్యంతరంలో ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ లభించడం తెలిసిందే. రాజకీయ వేడి బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య దుమారానికి దారి తీస్తోంది. ట్రంప్ ఎస్టేట్ మాదిరిగా బైడెన్ ఇల్లు, కార్యాలయాల్లో ఎఫ్‌బీఐ ఎప్పుడు సోదాలు చేస్తుందంటూ రిపబ్లికన్ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ట్రంప్ అయితే మరో అడుగు ముందుకేసి, రహస్య పత్రాలను కాపాడలేకపోయినందుకు వైట్‌హౌస్‌లో కూడా ఎఫ్‌బీఐ సోదాలు చేయాలన్నారు! ప్రతినిధుల సభలో రహస్య పత్రాల వ్యవహారాలను చూసే శక్తిమంతమైన ఓవర్‌సైట్ కమిటీ సారథి అయిన రిపబ్లికన్ సభ్యుడు జేమ్స్ కోమర్ ఇప్పటికే దీనిపై పూర్తి సమాచారమివ్వాలంటూ నేషనల్ ఆర్కైవ్స్‌కు, వైట్‌హౌస్ కౌన్సెల్ కార్యాలయానికి లేఖలు రాశారు. ట్రంప్ పత్రాల గొడవ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా తప్పుకున్నాక పలు రహస్య పత్రాలను వైట్‌హౌస్ నుంచి తన ఫ్లోరిడా ఎస్టేట్‌కు తీసుకెళ్లారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. 2022 ఆగస్టులో ఆయన ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాల్లో వందలాది డాక్యుమెంట్లు దొరికాయి. తనకేమీ తెలియదని, ఇదంతా రాజకీయ కుట్ర సాధింపని ట్రంప్ ఎదురు దాడికి దిగారు. దొరికినవన్నీ తన వ్యక్తిగత పత్రాలేనంటూ బుకాయించారు. దీనిపై ఇప్పటికే ఆయనపై సివిల్, క్రిమినల్ విచారణలు జరుగుతున్నాయి. మొత్తం 3,000కు పైగా డాక్యుమెంట్లను వైట్‌హౌస్ నుంచి తరలించినట్టు టంప్ర్పై అభియోగాలు నమోదయ్యాయి. నాకు తెలియదు: బైడెన్ వాషింగ్టన్: తన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డట్టు తెలిసి ఆశ్చర్యపోయానని బైడెన్ అన్నారు. ‘ఆ పత్రాల గురించి, ఉపాధ్యక్షునిగా నేను తప్పుకున్న తర్వాత నా కార్యాలయంలోకి అవెలా వచ్చాయో నాకు తెలియదు. వాటిల్లో ఏముందో కూడా తెలియదు. వీటిపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా. ఇలాంటి అంశాలను నేనెంత సీరియస్‌గా తీసుకుంటానో అందరికీ తెలుసు’ అన్నారు. మెక్సికో పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రశ్నించడంతో ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నేర విచారణ విషయంలో అత్యున్నత స్థాయి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు కనీస పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచింది. నకిలీ ఇన్వాయిస్లకు మాత్రం పన్ను పరిమితి రూ.1 కోటి కొనసాగించాలని శనివారం జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో జీఎస్టీ పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 1.4 కోట్లు కాగా నెలకు సగటున రూ.1.4 లక్షల కోట్లు వసూలవుతున్నాయని వివరించారు. అధికారి విధులకు ఆటంకం కలిగించడం, ఉద్ధేశపూర్వకంగా సాక్ష్యాల తారుమారు, సరఫరా సమాచారాన్ని ఇవ్వకపోవడం వంటి మూడు అంశాలను నేర జాబితా నుంచి తొలగించాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్‌పై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. అదనపు సుంకాల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 50–150 శాతం శ్రేణి నుంచి 25–100 శాతం శ్రేణికి కుదించారు. పరిహార (కంపెన్సేషన్) పన్ను 22 శాతం విధించడానికి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) నిర్వచనంపై కూడా కౌన్సిల్ స్పష్టత ఇచ్చింది. ఇకపై 1,500 సీసీ ఆపైన ఇంజిన్ సామర్థ్యం, 4,000 మిల్లీమీటర్ల కంటే పొడవు, 170 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే ఎస్‌యూవీగా పరిగణిస్తామని సీతారామన్ తెలిపారు. అదేవిధంగా, ఆన్లైన్ గేమ్‌లు గెలవడం అనేది ఒక నిర్దిష్ట ఫలితంపై ఆధారపడి ఉంటే పూర్తి పందెం విలువపై 28 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. -
నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం
సాక్షి, అమరావతి: నేర పరిశోధన, భద్రత చర్యల్లో పోలీసు జాగిలాల పాత్ర కీలకమైనదని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. పోలీసు జాగిలాల 20వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వనిత మాట్లాడుతూ నేరస్తుల జాడ కనిపెట్టడం, ప్రముఖుల భద్రత ఏర్పాట్లు, ఆగంతకులపై దాడి చేసి వారిని నిలువరించడం మొదలైన వాటిలో పోలీసు జాగిలాలు కీలక భూమిక నిర్వర్తిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని 177 పోలీసు జాగిలాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వెటర్నరీ వైద్యుడి పోస్టును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మన పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 189 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. సైబర్ మిత్ర, ఉమెన్ హెల్ప్ డెస్క్, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్‌గుప్తా, డీజీ (ఇంటెలిజెన్స్) ఆంజనేయులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న జాగిలాల విన్యాసాలు పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా జాగిలాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాంబులను గుర్తించడం, వీఐపీలపై దాడికి పాల్పడేవారిని నిరోధించడం, ఆగంతకులపై దాడి చేయడం మొదలైన విన్యాసాలను ప్రదర్శించాయి. 20వ బ్యాచ్ కింద 35 జాగిలాలు, 52 మంది జాగిలాల సంరక్షకులు మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో 8 నెలలపాటు శిక్షణ ఇచ్చారు. ఇక్కడ 2017 నుంచి ఇప్పటివరకు 4 బ్యాచ్‌ల కింద 124 జాగిలాలు, 175 మంది హ్యాండ్లర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలను జిల్లా పోలీసు కేంద్రాలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, టీటీడీలకు కేటాయిస్తారు. -
ట్రంప్ సంస్థలపై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్థలపై క్రిమినల్ విచారణను జరపనున్నారు. ఇప్పటి వరకు ఆయన వ్యాపార లావాదేవీల విషయంలో సివిల్ కోణంలో విచారణ సాగుతోంది. అయితే ట్రంప్ సంస్థకు చెందిన కేసుల విచారణ ఇకపై క్రిమినల్ కోణంలోనూ దర్యాప్తు ఉంటుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ ప్రతినిధి లెటీటియా జేమ్స్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ సంస్థలకు తెలియజేసినట్లు జేమ్స్ చెప్పారు. రుణాల కోసం, అలాగే ఆర్థిక పన్ను ప్రయోజనాలను పొందటానికి ట్రంప్ సంస్థలు ఆస్తి విలువలను తప్పుగా నివేదించాయా లేదా అని అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ దర్యాప్తు చేస్తున్నారు. అధిక రుణాలు పొందటానికి ట్రంప్ సంస్థలు కొన్ని ఆస్తుల విలువలను పెంచి, ఆస్తిపన్ను మినహాయింపులను పొందటానికి కొన్నింటి విలువలను తగ్గించాయన్న అభియోగంపై దర్యాప్తు జరగతున్నట్లు జేమ్స్ పేర్కొన్నారు. వీటి వల్ల ఆ సంస్థలు చట్టవ్యతిరేకంగా లాభం పొందాయన్న కోణంలో ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతోంది. ట్రంప్ మాత్రం ఈ దర్యాప్తు తతంగమంతా రాజకీయ కక్షతోనే తనను టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. చదవండి: USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు -
నేర పరిశోధనలో సమర్థులకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: నేర పరిశోధనలో సమర్థులను గుర్తించి అవార్డులతో ప్రోత్సహించడం ద్వారా మిగిలిన వారిలో స్ఫూర్తిని రగిలించినట్లవుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ‘అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్(ఏబీసీడీ)’లను అందించారు. నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 66 మందికి డీజీపీ బహుమతులు అందించారు. మొదటి, రెండు, మూడవ బహుమతులుగా రూ.లక్ష, రూ.60 వేలు, రూ.40వేల నగదుతోపాటు ప్రశంసాపత్రాలు అందించారు. ► విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉయ్యూరులో రూ.60 లక్షల చోరీని ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన విజయవాడ సీసీఎస్ పోలీస్ టీమ్‌కు 2020 సెకండ్ క్వార్టర్ ఏబీసీడీ కింద మొదటి బహుమతి దక్కింది. సీసీఎస్ పోలీస్‌స్టేషన్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మరో 9 మంది అవార్డును అందుకున్నారు. రెండు, మూడు బహుమతులను మదనపల్లె డీఎస్పీ కె.రవిమనోహరాచారి బృందం.. గుంటూరు అర్బన్‌లోని దిశ మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు బృందం అందుకున్నాయి. కారు చోరీ కేసులో తీగలాగితే 15 క్రిమినల్ కేసుల్లోని గ్యాంగ్‌ను నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ టీమ్ పట్టుకోవడంతో 2020 మూడవ క్వార్టర్ అవార్డుల్లో మొదటి బహుమతి దక్కింది. కోవూరు సీఐ జి.రామారావు బృందం అవార్డు అందుకుంది. రెండు, మూడు బహుమతులను చిత్తూరు జిల్లా పీలేరు సీఐ ఎ.సాదిక్ అలీ బృందం.. మార్కాపురం అడిషనల్ ఎస్పీ కె.చౌడేశ్వరి బృందం అందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నా సెల్యూట్: ఎస్సై శిరీష మహిళలను ప్రోత్సహించడంతోపాటు వారి రక్షణకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ శాఖకు సెల్యూట్ చేస్తున్నానని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై కత్తూరు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. రెండ్రోజుల క్రితం అనాథ శవాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన శిరీషకు డీజీపీ చేతుల మీదుగా డీజీపీ కమాండేషన్ డిస్క్ అవార్డును అందజేశారు. తుపాను సమయంలో వరదల్లో చిక్కుకున్న ఒడిశా పోలీసుల ప్రాణాలను కాపాడిన ఎచ్చెర్ల ఎస్సై రాజేష్‌కు కూడా డీజీపీ కమాండేషన్ డిస్క్‌ను అందజేశారు. అలాగే పోలీస్ మెడల్ కూడా దక్కింది. -
ఆరు పట్టణాల్లో క్రైమ్ సీన్ చిత్రీకరణ
న్యూఢిల్లీ: హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, అహ్మదాబాద్‌లలో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ తరువాత దేశమంతా ఈ పద్ధతిని అమలుచేసేందుకు ఆరు నెలల గడువు కోరింది. ఈ మేరకు కేంద్రం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలుచేసింది. నేర విచారణను చిత్రీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. ఈ విషయంలో చొరవచూపిన గుజరాత్.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘మొబైల్ పాకెట్ యాప్’ అనే అప్లికేషన్‌కు అనుసంధానమయ్యే ఒక సెంట్రల్ సర్వర్‌ను రూపొందించింది. పోలీస్ స్టేషన్‌కు సమకూర్చిన ప్రతి సెల్ఫోన్లో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గుజరాత్ నమూనా ఆధారంగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రూపొందించిన మరో యాప్‌ను పరీక్షించాలనుకుంటున్నట్లు కోర్టు తెలిపింది. ‘నేర విచారణ చిత్రీకరణకు సంబంధించి గుజరాత్ మంచి పురోగతి సాధించింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగించేలా ఒక సమగ్ర నమూనాను కేంద్రం రూపొందిస్తుందని ఆశిస్తున్నాం’ అని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన లాయర్ శిరిన్ ఖాజురియా మాట్లాడుతూ..కోర్టు గత ఉత్తర్వుల మేరకు కేంద్రీయ పర్యవేక్షణ విభాగం(సీఓబీ) ఏర్పాటైందని తెలిపారు. నేరం జరిగిన చోటును వీడియోతీసే ప్రణాళికపై సీఓబీ తొలి సమావేశం మే 24న నిర్వహించారని చెప్పారు.నేరం జరిగిన చోటును వీడియో తీసే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైందని ఏప్రిల్ 5న కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసు విచారణలో వీడియోగ్రఫీ వినియోగం, కాల పరిమితిపై హోం శాఖ నియమించిన కమిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదిస్తూ ఈ విధంగా స్పందించింది. -
నేర పరిశోధనలో ‘నేను సైతం’
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ తల్లీకుమార్తె రూ.30 లక్షలతో గత బుధవారం విజయవాడకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆటోలో రైల్వేస్టేషన్‌కు వస్తుండగా నగదు బ్యాగు ‘మాయమైంది’. దర్యాప్తు చేసిన గోపాలపురం పోలీసులు గురువారం ఉదయానికే ఆ బ్యాగు జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ వద్దకు ‘చేరినట్లు’ గుర్తించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని సోమవారం అదుపులోకి తీసుకుని రూ.28.4 లక్షలు రికవరీ చేశారు. ‘నేను సైతం’ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఇది సాధ్యమైందని నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. నగదుతో ఉన్న బ్యాగు మాయం... విజయవాడకు చెందిన సుశీల తల్లి (102) నల్లకుంటలో మనుమరాలు భాగవతుల మోహిని (50) వద్ద ఉండేది. ఈమె ఇటీవల మరణించడంతో సుశీల నగరానికి వచ్చారు. ఇక్కడ పనులు ముగించుకుని గత బుధవారం తిరుగు ప్రయాణమ య్యా రు. విజయవాడలో కుమారుడికి ఇవ్వడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసుకున్నారు. ఐదు బ్యాగులతో మోహిని, సుశీల ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. స్టేషన్‌కు చేరుకున్నాక చూస్తే నగదు ఉన్న బ్యాగు కనిపించలేదు. అదే ఆటోలో వెనక్కు వెళ్లి గాలించినా ఫలితం లేకపోవడంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రాస్‌రోడ్స్‌లో పడిపోయినట్లు గుర్తింపు... పోలీసులు వెంటనే నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నల్లకుంట–సికింద్రాబాద్ స్టేషన్ మధ్య ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. 42 కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించిన అధికారు లు విశ్లేషించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చీ హోటల్ వద్ద ఉన్న కెమెరాలో ఉదయం 6:28 గంటల ప్రాంతంలో బ్యాగు జారిపోవడం స్పష్టంగా రికార్డయింది. ఆ బ్యాగు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఆనుకుని ఉండటంతో ఎవరూ గమనించలేదు. 25 నిమిషాల తర్వాత అటుగా వచ్చిన జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ స్వీపర్ ఆ బ్యాగ్‌ను తీసుకున్నట్లు రికార్డ యింది. పోలీసులు గురువారం జీహెచ్ఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్‌ను విచారించారు. బ్యాగు తీసుకున్న వ్యక్తి కె.రాములు అని, అత నిది ఇబ్రహీంపట్నం సమీపంలోని గంగారం అంటూ చెప్పాడు. రాములు కోసం ప్రయత్నించగా ఆచూకీ లభించలేదు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బవార్చీ హోటల్ ఎదురుగానే అదుపులోకి తీసుకున్నారు. డంపింగ్ యార్డ్‌లో రూ. 5 లక్షలు... బ్యాగులో అంత డబ్బు చూసేసరికి ఏం చేయాలో పాలుపోలేదని రాములు పోలీసులకు చెప్పాడు. అందులో రూ. 5 లక్షల్ని ముషీరాబాద్‌లోని డంపింగ్ యార్డ్‌లో పాతిపెట్టానన్నాడు. తన కుమారుడు కె.శ్రీశైలం ద్విచక్ర వాహనం ఖరీదు చేసుకోవడానికి రూ. 59,700, తన బావమరిది వి.శ్రీశైలానికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఇచ్చానని అంగీకరించాడు. మరో రూ. 23,40,300లు తన ఇంట్లో ఉన్నాయని వెల్లడించాడు. దీంతో డంపింగ్ యార్డ్, రాములు ఇంటి నుంచి పోలీసులు రూ. 28,40,300లు రికవరీ చేశారు. పరారీలో ఉన్న ‘శ్రీశైలాల’ కోసం గాలిస్తున్నారు. కాగా ప్రతి ఒక్కరూ ‘నేను సైతం’కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుమతి కోరారు. ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన గోపాలపురం ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్, డీఐ కిరణ్‌కుమార్, ఎస్సై రామకృష్ణలతో పాటు క్రైమ్ బృందాలను అభినందించారు. వీరికి ప్రత్యేక రివార్డులు అందించారు. -
ఆమెపై అలక్ష్యం..
సాక్షి, హైదరాబాద్: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ, దర్యాప్తులో తీవ్రజాప్యం జరుగుతోంది. సంచలన కేసులు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఆలస్యమే మృగాళ్లు మరింత రెచ్చిపోయేందుకు కారణమవుతోంది. గతనెలలో హైదరాబాద్ లాలాగూడ ప్రాంతంలో సంధ్యారాణి... ఈ నెలలో కూకట్‌పల్లిలో జానకి.. సోమవారం చందానగర్‌లో అపర్ణ, ఆమె తల్లీ, నాలుగేళ్ల చిన్నారి.. మంగళవారం హయత్‌నగర్‌లో అనూష, గచ్చిబౌలిలో బొటానికల్ గార్డెన్ వద్ద ముక్కలుగా దొరికిన గుర్తుతెలియని మహిళ.. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన దారుణాలివీ. మహిళలు, యువతులపై జరిగే నేరాల్లో దోషులకు సత్వరమే శిక్షలు పడకపోవడం వల్లే దారుణాలు పెరిగిపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాలుగు రోజులే హడావుడి ఆడపిల్లలపై ప్రేమోన్మాదులు కత్తులు, యాసిడ్‌తో దాడులకు తెగబడిన సమయాల్లో పోలీసులు నాలుగు రోజులు హడావుడి చేస్తున్నారు. కళాశాలలు, హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. తర్వాత కేసు దర్యాప్తు పూర్తయి, కోర్టులో విచారణ ముగిసి దోషులకు శిక్ష పడటం మాత్రం ప్రహసనంగా మారిపోయింది. ‘నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం’అంటూ గంభీరంగా ప్రకటించే అధికార యంత్రాంగం, పాలకుల హామీలు కూడా నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. నేరగాళ్ల ‘ధైర్యం’అదే..! మహిళలపై నేరాలు పెరగడానికి వ్యవస్థాగత లోపాలు, కుటుంబ వ్యవస్థలు పతనం కావడం, చట్టమంటే భయం లేకుండా పోవడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–206 గణాంకాల ప్రకారం మహిళలపై జరిగిన నేరాల్లో.. ఏపీలో 9.3 శాతం, తెలంగాణలో 8.1 శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి. కేసుల విచారణ పూర్తవడానికి ఏళ్లు పడుతుండటంతో అప్పటివరకు బాధితులు పోరాడలేకపోతున్నారు. ఇలాంటి కారణాల వల్లే ‘ఏం చేసినా.. ఏం కాదు’అన్న ధైర్యం నేరగాళ్లలో పెరిగిపోతోంది. ఈ పరిస్థితి మారేందుకు పోలీసులు.. దోషులకు వీలైనంత త్వరగా శిక్షలు పడేలా చూడాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని బాధితులు కోరుతున్నారు. మరింత ‘భరోసా’కావాలి.. బాధిత మహిళలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్‌లో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్ని కేవలం అత్యాచారం, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, తీవ్రమైన గృహహింస కేసుల్లోనివారికి మాత్రమే పరిమితం చేశారు. ఈ కేంద్రం బాధితులకు అండగా ఉండటంతోపాటు వైద్య, న్యాయ సహాయం చేస్తోంది. పునరావాసం కూడా కల్పిస్తోంది. ఈ తరహా కేంద్రాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలపై జరిగే ప్రతి నేరంలోనూ స్పందించేలా మార్పుచేర్పులు చేయాల్సి ఉంది. బెయిల్ ఇవ్వొద్దు మహిళలపై జరిగే నేరాలకు తక్షణం ఫుల్స్టాప్ పెట్టాలంటే నేరస్తులకు విచారణ పూర్తయ్యేదాకా బెయిల్ రాకుండా చూడాలి. బెయిల్ వచ్చిందంటే సాక్షులను ప్రభావితం చేయటం, రాజీ కోసం ఒత్తిడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. మహిళలపై జరిగే నేరాలను రుజువు చేసేందుకు ప్రాసిక్యూషన్ కూడా ఇన్వెస్టిగేషన్ నుంచి జడ్జిమెంట్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళల కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తేవాలి. – కాటేపల్లి సరళ, హైకోర్టు అడ్వకేట్ తక్షణ న్యాయం జరగాలి ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత స్పందన చూస్తే మహిళలకు మంచిరోజులు వచ్చాయనిపించింది. కానీ కొన్నాళ్ల తర్వాత మళ్లీ పాతరోజులే రిపీట్ అవుతున్నాయి. నేరం జరిగిన వెంటనే కఠిన శిక్షలు అమలు చేయాలి. ఆ దిశగా న్యాయ వ్యవస్థను క్రియాశీలం చేయాలి. హైదరాబాద్‌లో పోలీస్స్టేషన్లు మరింత విమెన్ ఫ్రెండ్లీగా తయారు కావాలి. న్యాయం కోసం వెళ్లిన వారిని ప్రశ్నలతో భయపెట్టే పరిస్థితి ఉండొద్దు. – నీలిమా పొనుగోటి,సాఫ్ట్వేర్ ఇంజనీర్, గచ్చిబౌలి ఏపీలో ఇలా.. - 2015కు సంబంధించిన 9,349 కేసుల దర్యాప్తు 2016లోనూ కొనసాగాయి - వీటిలో 66 కేసులను ఆయా పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. 153 కేసులు సరైన ఆధారాల్లేక మూతబడ్డాయి. 1,323 కేసులు తప్పుడు ఫిర్యాదులుగా, 226 కేసుల్లో వాస్తవాలు వక్రీకరించినట్లు తేలింది - 14,774 కేసుల్లో మాత్రమే దర్యాప్తు పూర్తయి కోర్టులో అభియోగపత్రాలు దాఖలయ్యాయి - విచారణ పూర్తయిన 9,882 కేసుల్లో 922 (9.3 శాతం) కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి తెలంగాణలో ఇలా.. - 2015కు సంబంధించిన 6,585 కేసుల దర్యాప్తు 2016లోనూ కొనసాగింది - 50 కేసులను ఆయా ఠాణాలకు బదిలీ చేశారు. 569 కేసులు సరైన ఆధారాల్లేక మూతబడ్డాయి. 642 కేసులు తప్పుడు ఫిర్యాదులుగా, 438 కేసుల్లో వాస్తవాలు వక్రీకరించినట్లు తేలింది. - 12,185 కేసుల్లోనే దర్యాప్తు పూర్తయి కోర్టులో అభియోగపత్రాలు దాఖలయ్యాయి - విచారణ పూర్తయిన 5,809 కేసుల్లో 471 (8.1 శాతం) కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి -
పుర్రెలూ నిజాలు చెబుతాయి!
సాక్షి, అమరావతి: పుర్రె, ఫొటో, టెక్నాలజీ ఆధారంగా.. చనిపోయిన వ్యక్తి ఆనవాళ్లను గుర్తించడాన్ని సూపర్ ఇంపోజిషన్ అంటారు. మిస్సింగ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారంగా సూపర్ ఇంపోజిషన్ కీలక సమాచారం ఇస్తోంది. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్పష్టమైన ఫలితాలు వస్తున్నాయి. నేర ప్రదేశంలో పుర్రె దొరికినప్పుడు దాన్ని ఫోరెన్సిక్ లేబొరేటరీలో అన్ని విధాలా పరీక్షిస్తారు. ప్రత్యేక స్టాండ్‌లో అమర్చి డిజిటల్ ఫొటో తీస్తారు. పుర్రెలోని అతి చిన్న ఎముకను కూడా పరీక్షించే కాంతి కిరణాలను దీని మీదకు పంపుతారు. ఔట్‌లైన్ ఆధారంగా ఆ పుర్రె వ్యక్తి ముఖం కోలగా, గుండ్రంగా ఉంటుందా? అసలా పుర్రె పురుషుడిదా? స్త్రీదా? అనే అంచనా వేస్తారు. పుర్రెలోని ఎముకల మందాన్ని బట్టి, అరుగుదలను బట్టి వయసును నిర్ధారిస్తారు. సాధారణంగా 35 ఏళ్ల తర్వాత నుంచి ఎముకలో అరుగుదల కనిపిస్తుంది. దవడ ఎముకలు, దంతాలు, వాటి మధ్య ఉన్న అంతరం (గ్యాప్) నేర పరిశోధనలో కీలకం. ఉదాహరణకు దంతాలు ఏ మేర అరిగిపోయాయి? ఎక్కడెక్కడ పుచ్చిపోయాయి? అనే వివరాలను బట్టి ఆ వ్యక్తి అలవాట్లు, వయసు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పుర్రె ఎముక భాగాలను లోతుగా డిజిటలైజ్ చేస్తారు కాబట్టి ఏ చిన్న ఎముకకు ఎలాంటి దెబ్బ తగిలినా సూపర్ ఇంపోజ్లో బయటపడుతుంది. ఎముక చిట్లిపోయే తీరును బట్టి.. హంతకుడు ఎలాంటి ఆయుధంతో.. ఎంత దూరం నుంచి కొట్టి ఉండొచ్చని అంచనా వేస్తారు. దగ్గర్నుంచి ఇనుపరాడ్‌తో మోది ఉంటే.. పుర్రెలోని కొన్ని ఎముకలు కన్పించనంతగా చిట్లిపోతాయి. వాస్తవానికి దీనిపై అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక పరిశోధనలు జరిగాయి. పుర్రెలోని 60 ఎముకలను విడివిడిగా ఏ స్థాయి దెబ్బలకు ఏమేర పగిలిపోతాయి? ఎంత వరకూ చిట్లిపోతాయనే సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. మన దేశంలో జాతీయ ఫోరెన్సిక్ లేబొరేటరీలోనూ ఇలాంటి పరిశోధనలు జరిగాయి. ప్రస్తుతం వీటినే రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీలు అనుసరిస్తున్నాయి. ఇంపోజ్ ఇలా చేస్తారు.. మృతుడి ఫొటోను డిజిటల్ టెక్నాలజీ ద్వారా నెగెటివ్‌గా మారుస్తారు. పుర్రెను కూడా ఔట్లైన్తో నెగెటివ్ తీసుకుంటారు. రెండింటినీ స్టాండ్‌పై అమర్చిన బోర్డ్ మీదకు తీసుకొస్తారు. రెండింటి ఔట్‌లైన్స్ కచ్చితంగా సరిపోయేలా అమరుస్తారు. ముక్కు, ఎముక భాగాలు, దవడ, దంతాలు, తలపై భాగం.. ఇలా అన్నిటిని పరిశీలిస్తారు. పాయింట్ 5 తేడా కూడా లేకుండా నిక్కచ్చిగా రెండు నెగెటివ్‌లు కలిసిపోతే ఆ పుర్రె మృతుడిదే అని నిర్ధారిస్తారు. తర్వాత పుర్రెలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషిస్తారు. మద్యం సేవించే వ్యక్తి అయితే ఎముక మజ్జ అరిగిపోయి అంతర్భాగం క్రమంగా డొల్లగా మారుతుంది. దీన్ని కచ్చితంగా అంచనా వేస్తారు. వ్యక్తి చనిపోయిన తర్వాత ఎముకల్లో ఉండే కొన్ని రకాల రసాయనాలు అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి మారతాయి. ఘటన స్థలానికి సమీపంలో రసాయన పరిశ్రమలుంటే అవి అస్తి పంజరంలోని ఎముకలను కొరికేస్తాయి. 24 గంటల్లో ఈ ప్రక్రియ ఏమేర ఉంటుందనే అంచనా ఫోరెన్సిక్ నిపుణులకే తెలుసు. దీన్నిబట్టి ఎన్ని రోజుల క్రితం హత్య జరిగిందనే నిర్ధారణకు వస్తారు. ఎముకపై రసాయన ప్రభావాలను బట్టి ఏ ప్రాంతంలో మృతదేహం ఎక్కువ కాలం ఉంచారనే విశ్లేషణ చేస్తారు. నొసటి భాగంలో చిన్న ఎముకలుంటాయి. కళ్లజోడు వాడే వ్యక్తికి ఆ ఎముకలపై ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రభావాన్ని పరిశీలించి, ఆ వ్యక్తి ఎన్నేళ్ల నుంచి కళ్లజోడు వాడుతున్నాడు? అనేది గుర్తిస్తారు. దీన్నిబట్టి కూడా వయసు నిర్ధారణకు వీలవుతుంది. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఇంపోజిషన్.. దేశంలో సూపర్ ఇంపోజిషన్ గుర్తింపు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మన ఫోరెన్సిక్ నిపుణులు అంతర్జాతీయంగా జరిగే పరిశోధనల్లో భాగస్వాములవుతున్నారు. వారి అనుభవాలను, పరిశోధన ఫలితాలను పరిగణనలోనికి తీసుకుంటున్నారు. అనుబంధ సమాచారమే.. నేర దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రమే సూపర్ ఇంపోజిషన్ వీలు కల్పిస్తుంది. దీన్ని ప్రధాన సాక్ష్యంగా న్యాయస్థానాలు పరిగణలోనికి తీసుకోవు. అయితే, దర్యాప్తులో ఇప్పుడిది కీలక భూమిక పోషిస్తోంది. నెట్వర్క్ విస్తృతమవ్వడం, అంతర్రాష్ట్ర నేరస్తుల వివరాలను దేశవ్యాప్తంగా అనుసంధానం చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇంపోజిషన్ సులభమవుతోంది. పోలీసులకు కూడా దీనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో సెల్‌ఫోన్ ద్వారా సమాచారం సేకరిస్తారు. ఆ వ్యక్తి చివరిగా ఎక్కడ తప్పిపోయాడో తెలుసుకుంటారు. ఆ ప్రాంతంలో లభించిన గుర్తు తెలియని మృతదేహాల వివరాలు పోలీస్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఫలానా వ్యక్తి కావచ్చని ఓ అంచనాకు వచ్చిన తర్వాత.. ఆ అనుమానాన్ని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపి, పుర్రె, మిస్సింగ్ వ్యక్తి ఫొటోను పంపుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సికింద్రాబాద్‌లోని లాలాగూడా పోలీసులు దగ్గర్లోని ఒక డ్రైనేజీ దగ్గరకు వెళ్లారు. అప్పటికే అక్కడ జనం గుంపులుగా పోగై ఆసక్తిగా చూస్తున్నారు. పోలీసులు జనాన్ని నెట్టేస్తూ డ్రైనేజీ దగ్గరకు వెళ్లారు. ఎవరిదో శవం. చనిపోయి చాలా రోజులైనట్టుంది. చర్మం మొత్తం కుళ్లిపోయి ఊడిపోయింది. అస్తి పంజరం మాత్రమే ఉంది. పోలీసుల్లో ఒకతను దాన్ని లేపే ప్రయత్నం చేశాడు. మిగతా భాగాల నుంచి పుర్రె విడిపోయింది. అన్నింటినీ ఒక అట్టపెట్టెలో పెట్టారు. తమిళనాడులోని సేలంకు దగ్గర్లోని ఓ పల్లెటూరది. 15 రోజుల క్రితం ముత్తుస్వామి సేలం పోలీసులకు తన కొడుకు పళనిస్వామి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అతని మొబైల్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. లాలాగూడ సమీపంలోని సెల్ టవర్‌కు చివరిసారిగా ఆ మొబైల్ కనెక్ట్ అయినట్టు సమాచారం వచ్చింది. సేలం పోలీసులు లాలాగూడా పోలీసులకు రేడియో మెసేజ్‌తోపాటు ఫ్యాక్స్‌లో పళనిస్వామి ఫొటో పంపారు. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ లేబొరేటరీలో గుర్తుతెలియని పుర్రెను, ఓ ఫొటోను సూపర్ ఇంపోజ్ చేశారు. గంట తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ దగ్గరకొచ్చాడు. ‘ఎస్.. ఆ ఫొటోలో వ్యక్తిదే ఆ పుర్రె.. తలపై కొట్టి హత్య చేసినట్టుంది. హత్యకు బలమైన రాడ్ ఉపయోగించినట్టుంది. హత్య తర్వాత మూడు అడుగుల దూరం శవాన్ని ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోంది’ అని చెప్పాడు. -
నేర పరిశోధనకు కృత్రిమ మేథో వ్యవస్థ
లండన్: నేరపరిశోధనలో సహకరించే సరికొత్త కృత్రిమ మేథో వ్యవస్థను లండన్‌లోని మిడిల్ సెక్స్ వర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి పరిచారు. ఆధారాలను విశ్లేషించడంతోపాటు మానవ పరిశోధనలో తప్పిపోయిన సంక్లిష్టమైన లింక్‌లనూ ఇది విశ్లేషిస్తుంది. వీఏఎల్సీఆర్ఐ (విజువల్ ఎనలిటిక్స్ ఫర్ సెన్స్ మేకింగ్ ఇన్ క్రిమినల్ ఇంటె లిజెన్స్) అని పిలిచే ఈ వ్యవస్థ ద్వారా సెకెన్ల వ్యవధిలో కేసు కు సంబంధించి కీలక అంశాలను విశ్లేషించవచ్చు. నేర పరిశోధన అంటే పోలీసులు తమకు లభించిన ఆధారాలను ఒక దానికొకటి అల్లుకుంటూ పోతారని ప్రతిఒక్కరూ భావిస్తుంటారు. అయితే ఆధారాల మధ్య లింక్‌లు కలుపు కుంటూ పోవడమే సంక్లిష్టమైన పని అని పరిశోధ నకు నేతృత్వం వహిస్తున్న విలియం వోంగ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. లక్షలాది పోలీస్ రికా ర్డులు, ఇంటర్వూలు, చిత్రాలు, వీడియోలను స్కాన్ చేసి విశ్లేషించడం ద్వారా వీఏఎల్సీఆర్ఐ ఆధారాల మధ్య లింక్‌లను కనిపెడుతుంది. ఈ విశ్లేషణ సరైనదా, కాదా అనే విషయాన్ని విశ్లేషకుడు నిర్ణయించిన తరువాత అది ఫలితాన్ని సరి చేసుకుంటుందని నీసా కొడగోడా అనే పరిశోధకుడు వెల్లడించారు. ప్రస్తుతం యూకే పోలీసులు దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.