సాక్షి, అమరావతి: పుర్రె, ఫొటో, టెక్నాలజీ ఆధారంగా.. చనిపోయిన వ్యక్తి ఆనవాళ్లను గుర్తించడాన్ని సూపర్ ఇంపోజిషన్ అంటారు. మిస్సింగ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారంగా సూపర్ ఇంపోజిషన్ కీలక సమాచారం ఇస్తోంది. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్పష్టమైన ఫలితాలు వస్తున్నాయి. నేర ప్రదేశంలో పుర్రె దొరికినప్పుడు దాన్ని ఫోరెన్సిక్ లేబొరేటరీలో అన్ని విధాలా పరీక్షిస్తారు. ప్రత్యేక స్టాండ్‌లో అమర్చి డిజిటల్ ఫొటో తీస్తారు. పుర్రెలోని అతి చిన్న ఎముకను కూడా పరీక్షించే కాంతి కిరణాలను దీని మీదకు పంపుతారు. ఔట్‌లైన్ ఆధారంగా ఆ పుర్రె వ్యక్తి ముఖం కోలగా, గుండ్రంగా ఉంటుందా?
అసలా పుర్రె పురుషుడిదా? స్త్రీదా? అనే అంచనా వేస్తారు. పుర్రెలోని ఎముకల మందాన్ని బట్టి, అరుగుదలను బట్టి వయసును నిర్ధారిస్తారు. సాధారణంగా 35 ఏళ్ల తర్వాత నుంచి ఎముకలో అరుగుదల కనిపిస్తుంది. దవడ ఎముకలు, దంతాలు, వాటి మధ్య ఉన్న అంతరం (గ్యాప్) నేర పరిశోధనలో కీలకం. ఉదాహరణకు దంతాలు ఏ మేర అరిగిపోయాయి? ఎక్కడెక్కడ పుచ్చిపోయాయి? అనే వివరాలను బట్టి ఆ వ్యక్తి అలవాట్లు, వయసు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పుర్రె ఎముక భాగాలను లోతుగా డిజిటలైజ్ చేస్తారు కాబట్టి ఏ చిన్న ఎముకకు ఎలాంటి దెబ్బ తగిలినా సూపర్ ఇంపోజ్‌లో బయటపడుతుంది.
ఎముక చిట్లిపోయే తీరును బట్టి.. హంతకుడు ఎలాంటి ఆయుధంతో.. ఎంత దూరం నుంచి కొట్టి ఉండొచ్చని అంచనా వేస్తారు. దగ్గర్నుంచి ఇనుపరాడ్‌తో మోది ఉంటే.. పుర్రెలోని కొన్ని ఎముకలు కన్పించనంతగా చిట్లిపోతాయి. వాస్తవానికి దీనిపై అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక పరిశోధనలు జరిగాయి. పుర్రెలోని 60 ఎముకలను విడివిడిగా ఏ స్థాయి దెబ్బలకు ఏమేర పగిలిపోతాయి? ఎంత వరకూ చిట్లిపోతాయనే సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. మన దేశంలో జాతీయ ఫోరెన్సిక్ లేబొరేటరీలోనూ ఇలాంటి పరిశోధనలు జరిగాయి. ప్రస్తుతం వీటినే రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీలు అనుసరిస్తున్నాయి.
ఇంపోజ్ ఇలా చేస్తారు..
మృతుడి ఫొటోను డిజిటల్ టెక్నాలజీ ద్వారా నెగెటివ్‌గా మారుస్తారు. పుర్రెను కూడా ఔట్‌లైన్‌తో నెగెటివ్ తీసుకుంటారు. రెండింటినీ స్టాండ్‌పై అమర్చిన బోర్డ్ మీదకు తీసుకొస్తారు. రెండింటి ఔట్‌లైన్స్ కచ్చితంగా సరిపోయేలా అమరుస్తారు. ముక్కు, ఎముక భాగాలు, దవడ, దంతాలు, తలపై భాగం.. ఇలా అన్నిటిని పరిశీలిస్తారు. పాయింట్ 5 తేడా కూడా లేకుండా నిక్కచ్చిగా రెండు నెగెటివ్‌లు కలిసిపోతే ఆ పుర్రె మృతుడిదే అని నిర్ధారిస్తారు. తర్వాత పుర్రెలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషిస్తారు. మద్యం సేవించే వ్యక్తి అయితే ఎముక మజ్జ అరిగిపోయి అంతర్భాగం క్రమంగా డొల్లగా మారుతుంది. దీన్ని కచ్చితంగా అంచనా వేస్తారు.
వ్యక్తి చనిపోయిన తర్వాత ఎముకల్లో ఉండే కొన్ని రకాల రసాయనాలు అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి మారతాయి. ఘటన స్థలానికి సమీపంలో రసాయన పరిశ్రమలుంటే అవి అస్తి పంజరంలోని ఎముకలను కొరికేస్తాయి. 24 గంటల్లో ఈ ప్రక్రియ ఏమేర ఉంటుందనే అంచనా ఫోరెన్సిక్ నిపుణులకే తెలుసు. దీన్నిబట్టి ఎన్ని రోజుల క్రితం హత్య జరిగిందనే నిర్ధారణకు వస్తారు. ఎముకపై రసాయన ప్రభావాలను బట్టి ఏ ప్రాంతంలో మృతదేహం ఎక్కువ కాలం ఉంచారనే విశ్లేషణ చేస్తారు. నొసటి భాగంలో చిన్న ఎముకలుంటాయి. కళ్లజోడు వాడే వ్యక్తికి ఆ ఎముకలపై ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రభావాన్ని పరిశీలించి, ఆ వ్యక్తి ఎన్నేళ్ల నుంచి కళ్లజోడు వాడుతున్నాడు? అనేది గుర్తిస్తారు. దీన్నిబట్టి కూడా వయసు నిర్ధారణకు వీలవుతుంది.
దేశంలో ఇప్పటివరకు జరిగిన ఇంపోజిషన్..
దేశంలో సూపర్ ఇంపోజిషన్ గుర్తింపు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మన ఫోరెన్సిక్ నిపుణులు అంతర్జాతీయంగా జరిగే పరిశోధనల్లో భాగస్వాములవుతున్నారు. వారి అనుభవాలను, పరిశోధన ఫలితాలను పరిగణనలోనికి తీసుకుంటున్నారు.
అనుబంధ సమాచారమే..
నేర దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రమే సూపర్ ఇంపోజిషన్ వీలు కల్పిస్తుంది. దీన్ని ప్రధాన సాక్ష్యంగా న్యాయస్థానాలు పరిగణలోనికి తీసుకోవు. అయితే, దర్యాప్తులో ఇప్పుడిది కీలక భూమిక పోషిస్తోంది. నెట్‌వర్క్ విస్తృతమవ్వడం, అంతర్రాష్ట్ర నేరస్తుల వివరాలను దేశవ్యాప్తంగా అనుసంధానం చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇంపోజిషన్ సులభమవుతోంది. పోలీసులకు కూడా దీనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో సెల్‌ఫోన్ ద్వారా సమాచారం సేకరిస్తారు. ఆ వ్యక్తి చివరిగా ఎక్కడ తప్పిపోయాడో తెలుసుకుంటారు. ఆ ప్రాంతంలో లభించిన గుర్తు తెలియని మృతదేహాల వివరాలు పోలీస్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఫలానా వ్యక్తి కావచ్చని ఓ అంచనాకు వచ్చిన తర్వాత.. ఆ అనుమానాన్ని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపి, పుర్రె, మిస్సింగ్ వ్యక్తి ఫొటోను పంపుతున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో సికింద్రాబాద్‌లోని లాలాగూడా పోలీసులు దగ్గర్లోని ఒక డ్రైనేజీ దగ్గరకు వెళ్లారు. అప్పటికే అక్కడ జనం గుంపులుగా పోగై ఆసక్తిగా చూస్తున్నారు. పోలీసులు జనాన్ని నెట్టేస్తూ డ్రైనేజీ దగ్గరకు వెళ్లారు. ఎవరిదో శవం. చనిపోయి చాలా రోజులైనట్టుంది. చర్మం మొత్తం కుళ్లిపోయి ఊడిపోయింది. అస్తి పంజరం మాత్రమే ఉంది. పోలీసుల్లో ఒకతను దాన్ని లేపే ప్రయత్నం చేశాడు. మిగతా భాగాల నుంచి పుర్రె విడిపోయింది. అన్నింటినీ ఒక అట్టపెట్టెలో పెట్టారు.
తమిళనాడులోని సేలంకు దగ్గర్లోని ఓ పల్లెటూరది. 15 రోజుల క్రితం ముత్తుస్వామి సేలం పోలీసులకు తన కొడుకు పళనిస్వామి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అతని మొబైల్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. లాలాగూడ సమీపంలోని సెల్ టవర్‌కు చివరిసారిగా ఆ మొబైల్ కనెక్ట్ అయినట్టు సమాచారం వచ్చింది. సేలం పోలీసులు లాలాగూడా పోలీసులకు రేడియో మెసేజ్‌తోపాటు ఫ్యాక్స్‌లో పళనిస్వామి ఫొటో పంపారు.
ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ లేబొరేటరీలో గుర్తుతెలియని పుర్రెను, ఓ ఫొటోను సూపర్ ఇంపోజ్ చేశారు. గంట తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ దగ్గరకొచ్చాడు. ‘ఎస్.. ఆ ఫొటోలో వ్యక్తిదే ఆ పుర్రె.. తలపై కొట్టి హత్య చేసినట్టుంది. హత్యకు బలమైన రాడ్ ఉపయోగించినట్టుంది. హత్య తర్వాత మూడు అడుగుల దూరం శవాన్ని ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోంది’ అని చెప్పాడు.