
ట్రంప్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. అధ్యక్షులకు న్యాయ విచారణ నుంచి కొంతమేరకు రక్షణ ఉంటుందని తొలిసారిగా అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ‘రాజ్యాంగబద్ధమైన అధికార పరిధిలో తీసుకునే నిర్ణయాలకు మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇది అధికారిక నిర్ణయాలకు మాత్రమే వరిస్తుంది. అనధికారిక చర్యలకు ఎలాంటి రక్షణ పొందలేరు’ అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ మెజారిటీ తీర్పు(6–3)లో పేర్కొన్నారు.
2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించకుండా ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలపై డొనాల్డ్ ట్రంప్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు అప్పగించింది. ఫలితంగా అధ్యక్ష ఎన్నిక జరిగే నవంబర్ 5 లోగా ట్రంప్ విచారణను ఎదుర్కొనే అవకాశాలు లేనట్టే.
‘మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి మినహాయింపు అధ్యక్ష వ్యవస్థనే పునర్వవస్థీకరిస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే రాజ్యాంగ సూత్రాలను, భూమికను, ప్రభుత్వ వ్యవస్థను అవహేళన చేయడమే’ అని జస్టిస్ సోనియా సొటోమేయర్ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేయగా.. అధ్యక్షుడు బైడెన్ ఈ తీర్పుపై స్పందిస్తారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. అట్లాంటా బిగ్ డిబేట్ తర్వాత మళ్లీ బైడెన్ మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment