పోలీసు శునకాల పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరైన హోంమంత్రి తానేటి వనిత
సాక్షి, అమరావతి: నేర పరిశోధన, భద్రత చర్యల్లో పోలీసు జాగిలాల పాత్ర కీలకమైనదని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. పోలీసు జాగిలాల 20వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వనిత మాట్లాడుతూ నేరస్తుల జాడ కనిపెట్టడం, ప్రముఖుల భద్రత ఏర్పాట్లు, ఆగంతకులపై దాడి చేసి వారిని నిలువరించడం మొదలైన వాటిలో పోలీసు జాగిలాలు కీలక భూమిక నిర్వర్తిస్తున్నాయని అన్నారు.
రాష్ట్రంలోని 177 పోలీసు జాగిలాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వెటర్నరీ వైద్యుడి పోస్టును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మన పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 189 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. సైబర్ మిత్ర, ఉమెన్ హెల్ప్ డెస్క్, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్‌గుప్తా, డీజీ (ఇంటెలిజెన్స్) ఆంజనేయులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న జాగిలాల విన్యాసాలు
పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా జాగిలాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాంబులను గుర్తించడం, వీఐపీలపై దాడికి పాల్పడేవారిని నిరోధించడం, ఆగంతకులపై దాడి చేయడం మొదలైన విన్యాసాలను ప్రదర్శించాయి.
20వ బ్యాచ్ కింద 35 జాగిలాలు, 52 మంది జాగిలాల సంరక్షకులు మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో 8 నెలలపాటు శిక్షణ ఇచ్చారు. ఇక్కడ 2017 నుంచి ఇప్పటివరకు 4 బ్యాచ్‌ల కింద 124 జాగిలాలు, 175 మంది హ్యాండ్లర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలను జిల్లా పోలీసు కేంద్రాలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, టీటీడీలకు కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment