నేర దర్యాప్తులో దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏఐ టెక్నాలజీ వాడకం
నేరస్తుల ఫింగర్ ప్రింట్, ఐరిస్, పాదముద్రలు, ముఖ చిత్రాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్ (ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ పూర్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి ఐదు పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఆంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైన సాఫ్ట్‌వేర్లను సైతం అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పారు. ఆంబిస్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు.
ఏమిటీ ఆంబిస్?
నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అర చేతిముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫిస్ (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) సాంకేతికతను వినియోగిస్తోంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ (ఏఎంబీఐఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ప్రకారం నేరస్థుల వేలి ముద్రలు, చేతి ముద్రలతోపాటు ఐరిష్ స్కాన్, ముఖ చిత్రాలు (ఫేషియల్ ఇమేజెస్), కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు.
ఇలా వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన ఆంబిస్ సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఆంబిస్ పూర్తిగా ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్‌ప్రింట్ ఆల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తుంది. నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతికత ఎంతో వేగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు.
ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలిముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతికత ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ ఆంబిస్ సాంకేతికత కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్‌లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్‌లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment