టీజీఎస్పీ బెటాలియన్లలో నిరసనలను ప్రేరేపించారంటూ పోలీసు శాఖ ఉత్తర్వులు
ఆందోళనలకు నేతృత్వం వహించిన,ఇంటర్వ్యూలు ఇచ్చినవారి గుర్తింపు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం చర్యలకు ఏర్పాట్లు
క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమంటూ డీజీపీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అందులో వివిధ బెటాలియన్లకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. టీజీఎస్పీ బెటాలియన్లలో ఆందోళనలకు నేతృత్వం వహించిన, ఇంటర్వ్యూలు ఇచ్చినవారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అంతకుముందు టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలపై డీజీపీ జితేందర్ ప్రకటన విడుదల చేశారు.
వారి సమస్యలను సానుభూతితో పరిశీలిస్తామని, సిబ్బంది యథావిధిగా విధుల్లో చేరాలని హామీ ఇస్తూనే.. క్రమశిక్షణ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. టీజీఎస్పీ సిబ్బంది పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించరాదని.. నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 39 మంది టీజీఎస్పీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిరసనలు, ఆందోళనలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, తదనుగుణంగా చర్యలు చేపడతామని అందులో పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీ విధానాలే..
ఉమ్మడి ఏపీలో టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధులకు అనుసరించిన విధివిధానాలే తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్ ఎంపిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులు కోరుకున్న విధంగా జరిగాయన్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు లేనివిధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పండుగలు, సెలవుల్లో సిబ్బంది విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ఆ ప్రకటనలో డీజీపీ వివరించారు.
టీజీఎస్పీ సిబ్బందికి ఉన్నతాధికారుల కౌన్సెలింగ్..
టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనబాట పట్టడంతో పోలీస్ ఉన్నతాధికారులు వారికి పలు అంశాలపై కౌన్సెలింగ్ చేపట్టారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలేమిటనే అంశాలను వివరిస్తున్నారు. ఈ మేరకు మొదటి, ఎనిమిదో బెటాలియన్ల సిబ్బందికి శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్‌లు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వరంగల్‌లో సీపీ వరంగల్, 12వ బెటాలియన్‌లో నల్లగొండ జిల్లా ఎస్పీ, సిరిసిల్లలో స్థానిక ఎస్పీ, డిచ్‌పల్లిలో కామారెడ్డి ఎస్పీలు సిబ్బందితో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment