AP: కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్లు | Police Department has Decided to form four APSP Police Battalions | Sakshi
Sakshi News home page

AP: కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్లు

Published Wed, Nov 30 2022 8:05 AM | Last Updated on Wed, Nov 30 2022 8:16 AM

Police Department has Decided to form four APSP Police Battalions - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఏపీఎస్పీ పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా), మద్దిపాడు (ప్రకాశం జిల్లా), చిత్తూరులో కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పోలీసు శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 పోలీస్‌ బెటాలియన్లు ఉన్నాయి.

కాగా, రాష్ట్ర విభజన అనంతరం అవసరాలకు తగినట్లుగా కొత్తగా నాలుగు బెటాలియన్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం కొత్త బెటాలియన్ల ఏర్పాటు అంశాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భూములను కూడా గుర్తించింది. ఎచ్చెర్లలో 80 ఎకరాలు, రాజమహేంద్రవరంలో దాదాపు 30 ఎకరాలు, మద్దిపాడులో 95 ఎకరాలు, చిత్తూరులో దాదాపు 50 ఎకరాలను ఎంపిక చేసింది.

మద్దిపాడులోని భూమిని ఇప్పటికే ఏపీఎస్పీ విభాగానికి అప్పగించారు. ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం, చిత్తూరులోని భూములు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటిని త్వరలోనే ఏపీఎస్పీ విభాగానికి అప్పగించాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశించారు. అనంతరం ఆ నాలుగు కేంద్రాల్లో బెటాలియన్ల ఏర్పాటు కోసం భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులను ఏపీఎస్పీ చేపడుతుంది. ఏడాదిలోగా నాలుగు బెటాలియన్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఏపీఎస్పీ భావిస్తోంది. 

పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం
ఏపీఎస్పీ అధికారులు, జవాన్లతోపాటు కలిపి 1,007 మందితో ఒక్కో బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బెటాలియన్‌లో ఒక కమాండెంట్, ఒక అదనపు కమాండెంట్, నలుగురు అసిస్టెంట్‌ కమాండెంట్లు, 10మంది రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, 24మంది రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 70మంది అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 177మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 630మంది కానిస్టేబుళ్లు ఉంటారు.

వారితోపాటు మినిస్టీరియల్‌ స్టాఫ్‌ 26మంది, ఒక మెడికల్‌ యూనిట్‌ (8మంది వైద్య సిబ్బంది), 56 మంది ఇతర సిబ్బందిని నియమిస్తారు. ఆ విధంగా మొత్తం 4,028మందితో నాలుగు బెటాలియన్లను ఏర్పాటు చేస్తారు. ‘కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ తదితర సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అవకాశం కలుగుతుంది’ అని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement