నేర పరిశోధనకు కృత్రిమ మేథో వ్యవస్థ
లండన్: నేరపరిశోధనలో సహకరించే సరికొత్త కృత్రిమ మేథో వ్యవస్థను లండన్‌లోని మిడిల్ సెక్స్ వర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి పరిచారు. ఆధారాలను విశ్లేషించడంతోపాటు మానవ పరిశోధనలో తప్పిపోయిన సంక్లిష్టమైన లింక్‌లనూ ఇది విశ్లేషిస్తుంది. వీఏఎల్‌సీఆర్‌ఐ (విజువల్ ఎనలిటిక్స్ ఫర్ సెన్స్ మేకింగ్ ఇన్ క్రిమినల్ ఇంటె లిజెన్స్) అని పిలిచే ఈ వ్యవస్థ ద్వారా సెకెన్ల వ్యవధిలో కేసు కు సంబంధించి కీలక అంశాలను విశ్లేషించవచ్చు. నేర పరిశోధన అంటే పోలీసులు తమకు లభించిన ఆధారాలను ఒక దానికొకటి అల్లుకుంటూ పోతారని ప్రతిఒక్కరూ భావిస్తుంటారు.
అయితే ఆధారాల మధ్య లింక్‌లు కలుపు కుంటూ పోవడమే సంక్లిష్టమైన పని అని పరిశోధ నకు నేతృత్వం వహిస్తున్న విలియం వోంగ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. లక్షలాది పోలీస్ రికా ర్డులు, ఇంటర్వూలు, చిత్రాలు, వీడియోలను స్కాన్ చేసి విశ్లేషించడం ద్వారా వీఏఎల్‌సీఆర్‌ఐ ఆధారాల మధ్య లింక్‌లను కనిపెడుతుంది. ఈ విశ్లేషణ సరైనదా, కాదా అనే విషయాన్ని విశ్లేషకుడు నిర్ణయించిన తరువాత అది ఫలితాన్ని సరి చేసుకుంటుందని నీసా కొడగోడా అనే పరిశోధకుడు వెల్లడించారు. ప్రస్తుతం యూకే పోలీసులు దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.