స్తంభించిన న్యాయవ్యవస్థ
రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులుగా పనిచేయని కోర్టులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల విధులు బహిష్కరణతో న్యాయవ్యవస్థ స్తంభించింది. జైళ్లలో ఉన్న నిందితుల తరఫున బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం మినహా ఎటువంటి ఇతర కేసులకు న్యాయవాదులు హాజరుకావడం లేదు. ఈనెల 11న దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ను సైతం కొన్ని జిల్లాల్లో న్యాయవాదులు పూర్తిగా బహిష్కరించగా మరికొన్ని జిల్లాల్లో పాక్షికంగా పనిచేశాయి. మరో 12 రోజుల పాటు విధులు బహిష్కరించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని న్యాయవాదుల సంఘాలు నిర్ణయించిన నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. మరో పక్క న్యాయశాఖ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్తే న్యాయవ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉంది.
ఆందోళన ఉధృతం: ఇప్పటికే విధులు బహిష్కరించి పలురూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు ఉద్యమాన్ని మరిం త తీవ్రం చేయాలని నిర్ణయించారు. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రీకాల్ చేయాలంటూ రిలేనిరాహార దీక్షలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా నిరసన వంటి కార్యక్రమాలను చేపట్టారు.
2 వరకు విధుల బహిష్కరణ: ఈ ఆందోళన జూలై 2 వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు, న్యాయవాదుల జేఏసీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సోమవారం నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామ ని జితేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 24న చలో హైదరాబాద్‌లో భాగంగా ఇందిరాపార్కు వద్ద మహాధర్నా ఉంటుందన్నారు. న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్రమోహన్‌రావు, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1 నుంచి సమ్మె
ప్రత్యేక హైకోర్టుతోపాటు హైకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రీకా ల్ చేయాలని కోరుతూ జూలై 1 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించాం. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులతో మరో 20ఏళ్ల వరకు తెలంగాణకు చెందిన వారు హైకోర్టు జడ్జీలు కాలేరు. కొత్త నియామకాలూ ఉండవు. దీంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. వీటిని రద్దు చేసే వరకూ ఆందోళన చేస్తాం.
- బి.లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి,న్యాయశాఖ ఉద్యోగుల సంఘం