‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు | Telangana High Court order to Speaker Secretary On BRS Party defection MLAs | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు

Published Tue, Sep 10 2024 12:44 AM | Last Updated on Tue, Sep 10 2024 12:46 AM

Telangana High Court order to Speaker Secretary On BRS Party defection MLAs

బీఆర్‌ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్‌ ఏమిటో చెప్పండి 

లేనిపక్షంలో సుమోటోగా విచారణ చేపడతాం..తగిన ఆదేశాలిస్తాం 

స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

ఎమ్మెల్యేల అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్లను స్పీకర్‌ ముందుంచండి 

ఇరుపక్షాల వాదనలకు సంబంధించి విచారణ షెడ్యూల్‌ రూపొందించండి 

రిట్‌ అధికార పరిధి చాలా విస్తృతమైనది.. సాంకేతిక కారణాలతో కొట్టివేస్తే న్యాయం జరగదు 

అసెంబ్లీ కాలపరిమితి పూర్తయ్యే వరకు స్పీకర్‌ వేచిచూస్తూ ఉంటే కోర్టులు చేతులు దులుపుకుంటూ ఉండలేవు 

ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం 

రిట్‌ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి కీలక తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్‌ ఏమిటో చెప్పేందుకు నాలుగు వారాల గడువిస్తున్నాం.. ఆలోగా వివరాలు అందజేయకుంటే మేమే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది..’ అని స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్‌ ముందుంచాలని, విచారణ షెడ్యూల్‌ రూపొందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)కు అందజేయాలని ఆదేశిస్తూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. 

‘కైశమ్‌ మేఘచంద్ర సింగ్‌ వర్సెస్‌ స్పీకర్‌ ఆఫ్‌ మణిపూర్‌’ కేసులో అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం రిట్‌ అధికార పరిధి చాలా విస్తృతమైనది. తొందరపాటు చర్య అని, సాంకేతిక కారణాలతో కొట్టివేస్తే న్యాయం జరగదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ నీతి, తత్వశా్రస్తానికి రాజ్యాంగ అథారిటీలు కట్టుబడి ఉండాలి. న్యాయ సమీక్ష అన్నదే కాదు.. అసలు సమస్యకు పరిష్కారం ఎప్పుడనేది తేలాలి. 

శాసనసభ కాలపరిమితి పూర్తయ్యే ఐదేళ్ల వరకు స్పీకర్‌ వేచిచూస్తూ ఉంటే కోర్టులు చేతులు దులుపుకుంటూ ఉండలేవు. ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. అనర్హత పిటిషన్లలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌ నిరాకరిస్తే పిటిషనర్లకు ఎటువంటి పరిష్కారం లభించదు. ‘కైశమ్‌ మేఘచంద్ర సింగ్‌’ కేసులోసుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ఏజీ, అనధికార ప్రతివాదుల వాదనలను సమర్ధించదు..’ అని స్పష్టం చేసింది.  

మూడు పిటిషన్లపై విచారణ 
2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే విధంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. 

అలాగే నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్‌ సమయం ఇవ్వడం లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఇంకో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఇరు పక్షాలకు చెందిన సీనియర్‌ న్యాయవాదుల వాదనలను కూలంకషంగా విన్నారు. గత నెల 10న రిజర్వు చేసిన తీర్పును సోమవారం వెలువరించారు. దానం, కడియం తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఆర్యామ సుందరం, గండ్ర మోహన్‌రావు విన్పించిన వాదనలను న్యాయమూర్తి తన తీర్పులో నమోదు చేశారు.  

3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే: పిటిషనర్లు 
‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్‌ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుకోకుండా సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు గతంలో తేల్చిచెప్పింది. 

మెజారిటీ ఉన్న పార్టీ తరఫు వ్యక్తి స్పీకర్‌ అవుతారు కాబట్టి, అధికార పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకుండా పదవీ కాలం ముగిసే వరకు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కైశమ్‌ మేఘచంద్ర సింగ్‌ వర్సెస్‌ స్పీకర్‌ ఆఫ్‌ మణిపూర్‌ కేసులో స్పీకర్‌ రాజకీయ విధేయత కారణంగా అనుసరించిన పక్షపాత వైఖరిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంది. 

అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఒక పార్టీ నుంచి ఎన్నికవుతున్న స్పీకర్‌ వద్ద ఉంచాలా.. వద్దా..? అనే దానిపై పార్లమెంటు పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు సూచించింది. అసెంబ్లీ కార్యదర్శి కూడా పబ్లిక్‌ సర్వెంటే. స్పీకర్‌పై అందరికీ గౌరవం ఉంది. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన నిర్ణయం తీసుకోవడం లేదని భావిస్తున్నాం. 

రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం సరికాదు. జిల్లా కోర్టులకు కూడా విచారణ ఇన్నిరోజుల్లో పూర్తి చేయాలని గడువు పెడుతున్నారు. అలాంటప్పుడు ట్రిబ్యునల్‌ చైర్మన్‌ (స్పీకర్‌) కింద ఆయన్ను ఆదేశించే అధికారం రాజ్యాంగ ధర్మాసనాలకు ఉంటుంది..’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. 

స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలివ్వలేవు: ఏజీ 
‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికార పరిధి కోర్టులకు లేదు. స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పది రోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం స్పీకర్‌కు ఇచ్చింది. 

రిట్‌ పిటిషన్లు దాఖలు చేయడంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య. టీఆర్‌ఎస్‌ హయాంలో వేసిన అనేక అనర్హత పిటిషన్లను అప్పటి స్పీకర్‌ పరిష్కరించలేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసులో పిటిషన్‌ చెల్లదని ఇదే కోర్టు గతంలో చెప్పింది. తాజా పిటిషన్లను కొట్టేయాలి..’ అని ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి కోర్టును కోరారు. 

ఇదీ తీర్పు.. 
‘బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఏప్రిల్‌లో ఒక పిటిషన్, జూలైలో ఇంకో పిటిషన్‌ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆగస్టు 10 తీర్పు రిజర్వు చేశాం. ఇప్పటివరకు అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో రిట్‌ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. స్పీకర్‌ కార్యాలయానికి రాజ్యాంగ హోదా, గౌరవం ఉంది. 

అనర్హత పిటిషన్లను వెంటనే రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ ముందు ఉంచాలని స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. ఇరుపక్షాల వాదనలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత వాదనలకు సంబంధించి నేటి నుంచి నాలుగు వారాల్లోగా షెడ్యూల్‌ నిర్ణయించాలి. నాలుగు వారాల్లో ఏం తేల్చకపోతే సుమోటోగా విచారణ చేపడతాం. తగిన ఆదేశాలను మేమే ఇస్తాం..’ అని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు.   a

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement