ముందస్తు చర్యలకు ఆదేశిస్తే.. ఇక్కడ ఆశ్రయించండి: హైకోర్టు
స్పీకర్ కార్యదర్శికి స్వేచ్ఛ ఇచ్చిన సీజే ధర్మాసనం..
‘అనర్హత’ పిటిషన్ల కేసులో ప్రతివాదులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్లలో సింగిల్ జడ్జి ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే.. ఇక్కడ ఆశ్రయించొచ్చని స్పీకర్ కార్యదర్శికి సీజే ధర్మాసనం స్వేచ్ఛ ఇచ్చింది. ప్రతివాదుల వాదనలు వినకుండా సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. న్యాయ, చట్టసభ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎన్నికల కమిషన్‌తోపాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, దానం నాగేందర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వివేకానంద్, వెంకట్‌రావు, కడియం శ్రీహరిలకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను అక్టోబర్ 24కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాలకు గడువిస్తున్నామని.. ఆ లోగా వివరాలు అందజేయకుంటే మేమే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని గత నెల 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. సింగిల్ జడ్జి తీర్పులో ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు.
‘స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని కిహోటో హలోహాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పు దీనికి విరుద్ధంగా ఉంది. మణిపూర్ శాసనసభ స్పీకర్ కీషమ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సింగిల్ జడ్జి ఆధారపడ్డారు. స్పీకర్ ఐదేళ్లపాటు మౌనంగా ఉండేందుకు ఇష్టపడితే కోర్టులు చూస్తూ ఉండలేవని చెప్పారు.
బీఆర్‌ఎస్ కాలంలో అనేక అనర్హత పిటిషన్లు పదవీకాలం ముగిసే వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. పిటిషనర్లు స్పీకర్‌ను ఊపిరి తీసుకునే అవకాశమైనా ఇవ్వకుండా కోర్టును ఆశ్రయించారు’అని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయ సమీక్ష అధికారాలతో అనర్హత పిటిషన్‌లను నిర్ణీత గడువులోగా నిర్ణయించాలని శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయగలదో.. లేదో తేల్చాలని కోరారు.
ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన గడువు సమీపిస్తోందని, ఏదైనా నిర్ణయం వెలువరించే అవకాశముందని చెప్పారు. సింగిల్ జడ్జి సుమోటోగా విచారణ చేపట్టకున్నా.. బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఏదైనా ఉత్తర్వులు ఇస్తే వెంటనే ఇక్కడ (సీజే ధర్మాసనం) ఆశ్రయించే స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. దీనికి అనుమతించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది.
సింగిల్ జడ్జి తీర్పు ఇది...
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్, దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా, స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎల్పీ మహేశ్వర్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ చెప్పేందుకు నాలుగు వారాలకు గడువిస్తున్నాం.. ఆలోగా వివరాలు అందజేయకుంటే మేమే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని గత నెల 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment