స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం
- పార్టీ ఫిరాయింపులపై పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
- స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య
- టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ వ్యాజ్యాలపై తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టేసింది. స్పీకర్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఈ వ్యవహారంలో స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో పూర్తిపాఠం అందుబాటులోకి రాలేదు.
తమ పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలపై టీడీపీ, రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డిలపై కాంగ్రెస్, మదన్‌లాల్‌పై వైఎస్సార్‌సీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫిర్యాదును స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ ఆ పార్టీల నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలను మొదట విచారించిన సింగిల్ జడ్జి.. వీటికి విచారణార్హత లేదంటూ కొట్టేశారు. సింగిల్ తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ఆయా పార్టీల నాయకులు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఫిరాయింపుల ఫిర్యాదులు స్పీకర్ నిర్ణయం తీసుకునే దశలో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో జోక్యం సరికాదని తెలంగాణ అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని 1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ వాదనంతో ధర్మాసనం ఏకీభవించింది. ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం వెలువరించడానికి ముందే పిటిషనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించడం సరికాదన్న ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించింది.