బిల్లు పార్లమెంట్ ఆమోదం తరువాత కోర్టుకు రండి
పిటిషనర్‌కు ధర్మాసనం సూచన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో ఈ దశలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. బిల్లు, దాని లక్షణాలు, అందులోని అంశాలు సక్రమైనవా... కావా? అనే విషయంలో తేల్చాల్సింది శాసనవ్యవస్థ మాత్రమేనని, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత, రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కోర్టులను ఆశ్రయించాలని, అప్పుడే ప్రయోజనం ఉంటుందని పిటిషనర్‌కు స్పష్టం చేస్తూ, ఈ వ్యాజ్యంపై విచారణను ముగించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన కోసం రాష్ట్రపతి పంపినది కేవలం ముసాయిదా బిల్లు (డ్రాఫ్ట్) మాత్రమేనని, ఓ బిల్లుకు ఉండాల్సిన లక్షణాలేవీ దానికి లేవని, అందువల్ల దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సికింద్రాబాద్‌కు చెందిన కామన్ మ్యాన్ ఫోరం కన్వీనర్ జీవీ రావు పిల్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారులు)లుగా నియమితులైన సీనియర్ న్యాయవాదులు ఎస్.ఆర్.అశోక్, డి.ప్రకాశ్‌రెడ్డిలతో పాటు పిటిషనర్ జీవీ రావు కూడా వాదనలు వినిపించారు. పిటిషనర్ అభ్యర్థనలో స్పష్టత లేదని అమికస్ క్యూరీలు నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘‘బిల్లు సక్రమైందా... కాదా? అది రూపంలో ఉండాలి? తదితర అంశాలన్నీ శాసనవ్యవస్థ పరిధిలోనివి. రాజ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం విభజన జరుగుతుందా... లేదా? అన్నదే మనం చూడాలి. ప్రస్తుతం మేం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత, రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కోర్టుకు రండి (పిటిషనర్‌ను ఉద్దేశించి). అనవసరంగా మేం జోక్యం చేసుకోలేం. మీరూ (పిటిషనర్) జోక్యం చేసుకోకండి. అది సభా హక్కుల ఉల్లంఘన అవుతుంది’’ అని వ్యాఖ్యానించింది.